పత్రం పుష్పం ఫలం

16 Sep, 2015 23:28 IST|Sakshi
పత్రం పుష్పం ఫలం

ఉగాదితో కొత్త సంవత్సరం మొదలైనా... మన జీవితాల్లో ఎలాంటి విఘ్నాలూ లేకుండా ఉండడానికి మనం చేసుకునే మొదటి పండుగ వినాయక చవితి. మంచి మాట తెలుసుకోడానికి... మంచి బాటలో నడవడానికి మంచివారుగా బతకడానికి... గణనాథుడు నృత్త, గీత, వాద్యాలతో వినోదాత్మకంగా మనకు జ్ఞానం ప్రసాదిస్తాడన్నది నమ్మకం. పత్రం, పుష్పం, ఫలం... ఇవేవీ లేకపోయినా తోయం... అంటే... గరిటెడు జలంతో కూడా సంతృప్తి పడే జనదేవుడు లంబోదరుడు... వరసిద్ధి వినాయకుడు. ఈ పది రోజులూ ఆయనే ప్రతి వీధికీ కళ. అందుకే మా పాఠక దేవుళ్లకు ఇవాళ్టి ఫ్యామిలీ కళకళ.
 
 పత్రం

  దండాలయ్య ఉండ్రాళ్లయ్యా...
 దాదాపు పాతికేళ్లు అయ్యింది ఈ పాట వచ్చి. ఇప్పటికీ చవితి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. ఏ కవికైనా ఇది సంతోషం కలిగించే అంశమే. ‘కూలీ నెం.1’ సినిమాలో ఈ పాట ఒక టీజింగ్ సందర్భంలో వస్తుంది. బాగా డబ్బు, అహంకారం ఉన్న ఒక అమ్మాయి రైల్వే కూలీలు చేస్తున్న గణేశ్ ఊరేగింపునకు అడ్డం వస్తుంది. అంతకు ముందే ఆమె ప్రవర్తన గురించి విన్న హీరో దీనిని చాన్స్‌గా తీసుకుని టీజ్ చేస్తూ పాట పాడతాడు. పైకి ఇది టీజింగ్ సాంగ్‌లా అనిపించినా, అర్థం చూస్తే శాశ్వతంగా నిలిచే భక్తిగీతంలా రాయాలని నిశ్చయించుకున్నా.

 ఆ విధంగానే వచ్చింది. ‘చిన్నారి ఈ చిట్టెలుకరా భరించెరా లంబోదర... పాపం కొండంత నీ పెనుభారం... ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మధన్యం’ అనే పల్లవి ఎలుకకు వర్తిస్తుంది, హీరోయిన్‌కూ వర్తిస్తుంది. హీరోయిన్‌ను మర్చిపోవచ్చు. ఎలుకను మర్చిపోరు గదా. ‘శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం... ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం’... అనే లైన్లు హీరోయిన్‌కి వర్తిస్తాయి, వినాయకునికీ చంద్రునికీ మధ్య జరిగిన కథనూ చెబుతాయి.

 ఈ రెండో అర్థం వల్లే పాట ఇప్పటికీ నిలుచుందని అనుకుంటున్నాను. ఇళయరాజా ఇచ్చిన పల్లవికి చెన్నైలో కూచుని రాసిన పాట ఇది. బాలూ గళం, కోరస్, కంపోజిషన్ అందులో ఉండే సెలెబ్రేషన్ మూడ్ పాటను శాశ్వతం చేశాయి. ఈ పాటే కాదు చాలా సినిమాల్లో దైవప్రస్తావన ఉండే పాటలు అనేకం రాశాను. కాని నాది ఒక రకంగా నిరీశ్వరవాదం. నా దైవానికి రూపం లేదు. ఇది నాస్తికత్వం కాదు. నా దృష్టిలో దైవాన్ని బాహ్యంగా చూడటం కాదు లోలోపల చూడాలి.

అందుకే నేను దేవతా మూర్తులను వివిధ బాధ్యతలు నిర్వహించే కార్యనిర్వహణాధికారులుగా చూస్తాను. ఇన్‌ఛార్జ్‌లన్న మాట. నిర్వికల్ప సమాధి అంటారు. ఈ స్థితికి చేరుకున్నప్పుడే దైవాన్ని, మనల్ని కూడా ఒకసారి దర్శిస్తాం. నా దృష్టిలో పూజలు, పండుగలు దుష్కార్యాల నుంచి కాసేపు మనసు మళ్లించడానికి ఉద్దేశించినవే. కాని దైవానికి చేరువ కావాలంటే బాహ్య బంధనాల నుంచి విముక్తి పొంది అంతఃస్వేచ్ఛను అనుభవించాలంటే ఇవి చాలవు. లోపలి ప్రయాణం సాగాలి.

ఈ మాటను చెప్పడానికే నేను ‘శివదర్పణం’ గ్రంథం రాశాను. అందులో శివుణ్ణి ఒక వేటగాడిగా భావిస్తూ ‘నా మనసే ఒక కారడవి. అందులో కోర్కెలనే క్రూరమృగాలు విషసర్పాలు తిరుగుతున్నాయి. వాటిని వేటాడు’ అని వేడుకున్నాను. ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఇదే. మనలో ప్రతి ఒక్కరం అంతర్గత సమృద్ధితో సంపదతో తులతూగాలని వినాయకచవితి సందర్భంగా ఆశిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను.
 - సిరివెన్నెల సీతారామశాస్త్రి
 
 పుష్పం
  జైజై గణేశా.. జై కొడతా గణేశా...
 ‘జై చిరంజీవ’ సినిమా కోసం ఈ పాట సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసి హీరో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడాలి అని చెప్పారు. ఏం స్తుతిస్తాడు... ఎలా స్తుతిస్తాడు... ఆ స్తుతిలో నుంచి ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలి అనేది ఇక నా తలనొప్పి. కాని కవి కన్ను అనేది ఒకటి ఉంటుంది. దానికి దృష్టిలోపం, చత్వారం లేకపోతే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక అర్థాన్ని వెతుకుతుంది.

 ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న చెత్త నాకు గుర్తుకు వచ్చింది. ఈ చెత్తను వినాయకునికి గుర్తు చేయాలి. ఆయన తొండంతో కుంభవృష్టిని కురిపించి దానిని కడిగేయించాలి అనిపించింది. అందుకే పల్లవిలో ‘లోకం నలుమూలలా లేదయ్యా కులాసా... దేశం పలువైపులా ఏదో రభస... మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా... పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా’ అన్నాను. ‘చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి ఈ చిక్కు విడిపించడానికి రమ్మ’ని పిలిచాను. పల్లవి ఓకే. చరణంలో ఏం చెప్పాలి?  వినాయకుడు కుమారస్వామి సహిత శివపార్వతుల పటం చూడండి. వారి వాహనాలు గమనించండి.

వాస్తవంగా అయితే ఒక వాహనానికీ మరో వాహనానికీ వైరం ఉంది. కాని అవి కలిసి మెలిసి లేవూ. మనమెందుకు కొట్టుకుంటున్నాం. అదే మొదటి చరణంలో చెప్పాను. ‘నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా... ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా... పలుజాతుల భిన్నత్వం కనిపి స్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా’... మనకెందుకు లేదు సోదరభావం అని నిలదీశాను. బాగుందనిపించింది. ఈ స్ఫూర్తితో మేం ఉంటాం కాని మాకో బెడదుంది దానిని తొలగించు అని రెండో చరణంలో చెప్పాను.

దాదాల నుంచి లంచాలు మరిగిన నాయకుల నుంచి రక్షించమని కోరుకున్నాను. కాని అక్కడ నాకు తోచిన చమత్కారం ఏమిటంటే ‘ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా’ అనడం. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు చుక్కల్లోనేగా ఉన్నాయి. కందిపప్పు కిలో రెండు వందలని విన్నాను. మనం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాం. కాని ఈ సందర్భంగా చేయాల్సింది మనలోని చెడును ముంచడం మనలోని అహాన్ని వంచడం. ఆ మాటను కూడా చెప్పాను. ఈ పాట జనానికి బాగా నచ్చింది.

వినాయకుని మంటపాల్లో జేజేలు అందుకుంటూనే ఉంది. మరో విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నేను విఘ్నేశ్వరుడి భక్తుణ్ణి. మా ఊరి చెరువు దగ్గర మంచి నల్లరేగడి మట్టి దొరికేది. దానిని తీసుకొచ్చి నా స్వహస్తాలతో వినాయకుడి ప్రతిమను చేసి ఇంట్లో ఒక గుడిలాంటిదే మెయింటెయిన్ చేసేవాణ్ణి. ఆయన దయ వల్ల నాకు బుద్ధి లభించింది. పాటల రచయిత కావాలనే కోరికా సిద్ధించింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి.
 - చంద్రబోస్
 
 ఫలం
  తిరు తిరు గణనాథ...
 వినాయక చవితి అనగానే నాకు మా వూరు ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) పక్కన ఉండే చిట్టడివి గుర్తుకు వస్తుంది. ఆ రోజు పిల్లలందరికీ ఆ అడవిలోకి వెళ్లే పర్మిషన్ దొరుకుతుంది. మరి పత్రి తేవాలి కదా. అందరం సరదాగా పోలోమంటూ పోయి పత్రి తెచ్చేవాళ్లం. మా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి దర్బలో ఇంట్లోనే ఉండేవి. నేను మరీ భక్తుణ్ణి కదా. అంత భక్తిశ్రద్ధలతో చిన్నప్పుడు పూజలూ అవీ చేసిన గుర్తు లేదు. అయినప్పటికీ ఆ వినాయకుడి దయ వల్ల చదువు బాగా వచ్చింది. అయితే నాగార్జున యూనివర్సిటీలో బి.టెక్ చేరాక చదువుపై శ్రద్ధంతా పోయింది.  వినాయకుడు అనగానే చదువు గుర్తుకొస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను.

‘100% లవ్’ సినిమాలో నేను రాసిన పాటలో కూడా ఇదంతా కనిపిస్తుంది. ఆటపాటల్లో హాయిగా ఉండాలనుకునే యూత్‌కి బాబోయ్ ఈ పరీక్షల భారం లేకుండా హాయిగా మార్కులొస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ మూడే పాట పల్లవిలో కనిపిస్తుంది. ‘తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై.. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అని ఉంటుంది పల్లవి. కాని చరణం అంతకన్నా సరదాగా ఉంటుంది. ‘చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనివ్వు’.... ఇలా ఉంటుంది చరణం. ఇందులో ‘ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు’ అడగడం ‘ఆన్సర్ షీటు మీద ఆగిపోని పెన్ను’ అడగడం కనిపిస్తుంది.

రెండో చరణంలో ఇంకా సింపుల్ కోరికలు ఉంటాయి. ‘తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు’ అని చెప్తూ కనుక మా తలరాతలు బాగుండేలా చూడు స్వామి అని వేడుకుంటుంది హీరోయిన్. ‘పేపర్లో ఫొటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు’ అనడం ఒక చమక్కు. అప్పటికే కొన్ని మాంటేజస్ తీసి కొన్ని రఫ్‌నోట్స్‌లు సుకుమార్‌గారు తయారు చేశారు. ఆ మాంటెజస్‌కు తగినట్టుగా ఆ రఫ్‌నోట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాసిన పాట ఇది.

దేవిశ్రీ ప్రసాద్ బాణి, దానికి హరిణి గొంతు రాణించాయి. తమన్నా, నాగచైతన్య కూడా ఈ పాటలోని సన్నివేశాలను బాగా పండించారు. క్లాసికల్ బాణీలో ఉన్న ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు రామ్ నటించిన ‘గణేశ్’ సినిమాలో కూడా వినాయకుడి మీద ఒక పాట రాశాను.  మాలాంటివాళ్లకు పాటే దైవం. మంచి పల్లవి తడితే అదే పెద్ద ప్రసాదం. మీ అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా.
 - రామజోగయ్యశాస్త్రి

మరిన్ని వార్తలు