దేశభక్తి మహిళాశక్తి

24 Jan, 2020 02:23 IST|Sakshi
నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌కు మహిళా రెజిమెంట్‌ సైనిక వందనం. (పక్కన) దళపతి లక్ష్మీస్వామినాథన్‌)

‘దేశమంటే మట్టికాదోయ్‌! దేశమంటే మనుషులోయ్‌!’ గురజాడ అప్పారావుగారు ఎంత చక్కగా చెప్పారు. కానీ ఆ కాలానికీ ఈ కాలానికి కాస్త మార్పు వచ్చింది. దేశమంటే ఇప్పుడు మనుషులు కాదు. మహిళా శక్తులు. ఏ ఉద్యమమైనా చూడండి... ఏ ఉద్యోగమైనా చూడండి. మహిళలే ముందుంటున్నారు. ఏం ఉంటున్నారూ.. పర్సెంటేజ్‌ చూడండి. ఆఫీస్‌లలో మగవాళ్లే ఉంటున్నారు. ఆర్మీలలో మగవాళ్లే ఉంటున్నారు. ఉండటం ముఖ్యం కాదు. ముందుండటం ముఖ్యం. పౌరసత్వ చట్టంపై నిరసన. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! పర్యావరణ పరిరక్షణ. ఎవరు ముందుంటున్నారు? మహిళలు!

ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత కాలుష్యం అయినా ఉండనివ్వండి. గాలిలో ప్రస్తుతం స్వచ్ఛమైన దేశభక్తి గుండెల్ని తాకుతోంది. నిన్న.. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జయంతి. రెండు రోజులు గడిస్తే గణతంత్ర దినోత్సవం. నేడు.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. ‘ది ఫర్గాటెన్‌ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ వెబ్‌ సిరీస్‌ ప్రారంభం! మహిళా శక్తికి.. ఈ మూడు సందర్భాలకు సంబంధం ఏమిటి? యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ! స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి, వాళ్ల చేతికి తుపాకులిచ్చారు నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కదన  రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు.. కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు కానీ... ఆరంభంలోనే.. యుద్ధంలోకి స్త్రీలెందుకు, స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్లు ముఖం చిట్లిస్తూ అడ్డొచ్చారు.

నేతాజీ వినలేదు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (నేతాజీ సారథ్యం వహించిన సైన్యం)కి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ.. భారీ బలగాల్లేవు. మహిళాశక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు.నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్‌లో సమావేశం జరిగింది. ‘‘ఏం చేస్తారు బోస్‌.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మగవాళ్లెవరో లేచి అడిగారు నేతాజీని. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు’’ అన్నారు నేతాజీ! ‘‘తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదిలొస్తే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. మహిళలూ యుద్ధరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’.. అన్నారు నేతాజీ. ఆ వెంటనే.. చెయ్యి ముందుకు చాస్తూ.. ప్రమాణం చేస్తున్నట్లుగా.. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్‌’. మరణ ధిక్కార మహిళా దళం మనది’’ అన్నారు.

‘ది ఫర్గాటెన్‌ ఆర్మీ.. ఆజాదీ కె లియే’లో ఓ సన్నివేశం

ఎల్లుండి.. జనవరి 26. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్‌ డే). భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ ఏడాదికి మన గణతంత్రానికి డెబ్భై యేళ్లు పూర్తవుతాయి. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటికీ రాజ్యాంగ రచనా సమాలోచనలు ప్రారంభమైంది మాత్రం దేశానికి స్వాతంత్య్రం రాకముందే! 1946 డిసెంబర్‌ 9, ఉదయం 10.45 గంటలకు న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో ఉన్న కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో (ఇప్పటి పార్లమెంట్‌ హౌస్‌లోని సెంట్రల్‌ హాల్‌) తొలి రాజ్యాంగ సమావేశం జరిగింది. రాజనీతిజ్ఞులు, ఆలోచనాపరులు, మేధావులు.. మొత్తం 207 మంది ఆ కీలకమైన చర్చా సమావేశానికి హాజరయ్యారు. వారిలో 15 మంది మహిళలే! అప్పట్లో అదేమీ తక్కువ సంఖ్య కాదు. ఆ పదిహేను మందిలో కూడా ఒకరు ముస్లిం. ఇంకొకరు దళిత వర్గం. బేగమ్‌ అజీజ్‌ రసూల్, దాక్షాయణి వేలాయుధన్‌.

మిగతా పదమూడు మందీ.. రేణుకా రాయ్, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్, హంసా మెహ్‌తా, పూర్ణిమా బెనర్జీ, రాజ్‌కుమారి అమృత్‌కౌర్, మాలతీ చౌదరి, లీలా రాయ్, సుచేత కృపలాని, సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అమ్ము స్వామినాథన్, యానీ మాస్కరీన్, కమలా చౌదరి. ఒక్కో మహిళదీ ఒక్కో సామాజిక, రాజకీయ నేపథ్యం. రాజ్యాంగ రచనలో వీరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, అభ్యంతరాలు, సందేహాలు, సంశయాలకు... వీటన్నిటికీ ప్రాధాన్యం లభించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మహిళ సామాజిక హక్కులు ఇప్పుడొక ప్రత్యేక అధ్యాయంగా ఉండటానికి కారణం ఆనాటి ఈ పదిహేను మంది మహిళా సభ్యుల మాటకు లభించిన విలువేనంటారు జె.ఎన్‌.యు. ప్రొఫెసర్‌ నీరజా గోపాల్‌ జయాల్‌. పాలనకు రాజ్యాంగం శక్తి అయితే ఆ శక్తికి స్త్రీ స్వరూపం ఈ పదిహేను మందీ! రాణీ ఝాన్సీ రెజిమెంట్‌లా.. వీరి రాజ్యాంగ మహిళా సైనిక దళం.

తొలి రాజ్యాంగ సమావేశంలోని 15 మంది మహిళా సభ్యులలో పదకొండు మంది 

24 జనవరి 2020. ఈ రోజే! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో.. ‘ది ఫర్గాటెన్‌ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ మినీ వెబ్‌ సిరీస్‌ మొదలవుతున్నాయి. అమెజాన్‌ అనగానే ఇవేవో నాటకీయ మహిళా దేశభక్తి ప్రసారాలని అనుకోకండి. సుభాస్‌ చంద్రబోస్‌ నడిపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని సైనికుల వాస్తవ గాథలతో పాటు.. ఆయన స్థాపించిన రాణీ ఝాన్సీ రెజిమెంట్‌లోని మహిళా సైనికుల వీరగాథల్నీ అమెజాన్‌ చూపించబోతోంది. వీటికి దర్శకత్వం వహిస్తున్నది కబీర్‌ ఖాన్‌. కాబూల్‌ ఎక్స్‌ప్రెస్, న్యూయార్క్, ఏక్‌ థా టైగర్, బజ్‌రంగి భాయ్‌జాన్, ఫాంటమ్, ట్యూబ్‌లైట్‌ వంటి విభిన్న కథా చిత్రాలను తీసిన కబీర్‌ ఖాన్‌.. ఇరవై ఏళ్ల క్రితమే దూరదర్శన్‌ కోసం ఇదే థీమ్‌తో ‘ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ చేశారు.

తాజా.. ఫర్గాటెన్‌ ఆర్మీ’లో.. ప్రధానంగా మహిళా యోధుల స్ఫూర్తిదాయకమైన పోరాట అనుభవాలను శార్వరీ వాగ్‌ (సిరీస్‌లో మాయ) ప్రధాన కథానాయికగా చిత్రీకరిస్తున్నారు. ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలూ కలిస్తే ఒక ఉద్యమం అయ్యేది. ఇప్పుడు ఏ ఉద్యమానికైనా మహిళా వర్గమే ముందుంటోంది. ముందుండే వారెప్పుడూ యోధులే. శక్తులే. ఇప్పుడిక ‘దేశమంటే మహిళలోయ్‌’ అనాలా? అనకపోయినా, అంటే ఒప్పుకోడానికి ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు.

నేతాజీ ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్‌’లో కొందరు

మరిన్ని వార్తలు