పవర్‌పఫ్ గర్ల్స్

25 Jan, 2014 23:11 IST|Sakshi
పవర్‌పఫ్ గర్ల్స్

అనగనగా ముగ్గురు సోదరీమణులు... ఇంద్రధనుస్సును మైమరిపించే రంగులు విరజిమ్ముతూ ఆకాశంలో మెరుపు వేగంతో దూసుకుపోతూ... అన్యాయాలపై పోరాడి న్యాయాన్ని గెలిపిస్తూ సాహస విన్యాసాలతో అలరిస్తుంటారు. వాళ్లు ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా... అరే వాళ్ళేనండీ ‘పవర్‌పఫ్ గర్ల్స్’.
 
ఈ కార్టూన్ సీరియల్ భలేగా ఉంటుంది తెలుసా! ముగ్గురు అక్కాచెల్లెళ్లు... సూపర్ పవర్‌తో న్యాయం కోసం చేసే పోరాటంలో అందరినీ నవ్విస్తూ, బోలెడు సాహసాలతో ఈ సీరియల్ సాగుతుంటుంది. అసలు వాళ్లని గుర్తుచేసుకుంటే ముందుగా గుర్తుకొచ్చేవి వారి కళ్లే... పెద్దపెద్ద కళ్లతో ముగ్గురూ మూడు రంగుల్లో మెరిసిపోతుంటారు.  బబుల్స్, బ్లోసమ్, బటర్‌కప్ పేర్లతో వీళ్లను పిలుస్తారు. బబుల్స్ బ్లూ, బ్లోసమ్ పింక్, బటర్‌కప్ గ్రీన్ వీరి సిగ్నేచర్ కలర్స్. ఈ రంగులతో తెరపైన సాహసాలతో కనువిందు చేస్తుంటారు.
 
వీరి సృష్టికర్త క్రెగ్ మెక్‌క్యానెన్. ఆయన కార్టూన్ నెట్‌వర్క్‌కి రాసిన మొదటి సీరియల్ ఈ పవర్‌పఫ్ గర్ల్స్. ఈ సీరియల్ 1998 నవంబర్ 18న మొదటిసారి ప్రసారమైంది.
 
ఈ సీరియల్‌లో యుటోనియం అనే శాస్త్రవేత్త ప్రయోగశాలలో అనుకోకుండా పవర్‌పఫ్ గర్ల్స్ సృష్టిస్తాడు. పరిపూర్ణమైన లిటిల్ గర్ల్స్‌ను సృష్టించడానికి చక్కెర, మసాలాదినుసులు, మంచి పదార్థాలు సరిపోతాయి. కాని యుటోనియం వాటితో పాటు ‘ఎక్స్’ అనే రసాయనాన్ని కూడా కలపడంతో ముగ్గురు సూపర్ పవర్‌పఫ్ గర్ల్స్ జన్మిస్తారు. ఈ ముగ్గురు నేరాలపై, మంత్రశక్తులపై పోరాడుతూ ప్రజలను కాపాడుతుంటారు. ప్రస్తుతం పవర్‌పఫ్ గర్ల్స్ ఆరవ సిరీస్ ప్రసారమవుతోంది.

పవర్‌పఫ్ గర్ల్స్ అమెరికా టెలివిజన్ పరిశ్రమ ఇచ్చే ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకుంది. 2001 ఎమ్మీ అవార్డుల్లో పవర్‌పఫ్ గర్ల్స్ సీరియల్‌కు ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ విభాగంలో వాటిని యానిమేట్ చేసిన ఆర్ట్ డెరైక్టర్ డాన్ షాంక్‌కు, అలాగే టెలివిజన్ యానిమేటెడ్ సీరియల్ విభాగంలో ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డులు లభించాయి. 2005 ఎమ్మీ అవార్డుల్లో నేపథ్య రూపకర్త ఫ్రెడరిక్ జె. గార్డ్‌నర్ బహుమతి గెలుచుకున్నారు.

>
మరిన్ని వార్తలు