పొంచివున్న పెను ముప్పు

25 Apr, 2018 00:01 IST|Sakshi
ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికాకు నౌకాయానం 

ప్రత్యక్ష సాక్షి కథనం

సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో ఈ భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలు రెండింటినీ ప్రత్యక్షంగా తిలకించి, రెండు ధ్రువరేఖలనూ దాటి, ఈ ప్రపంచాన్ని యుద్ధభేరీలతో వణికించగల వాతావరణపు పెనుమార్పుల సంకేతాల్ని దగ్గరగా వీక్షించిన ఒక శాంతి సాధకుని అనుభవాలివి.


రాజా కార్తికేయ
2018 మార్చి ఏడు. భూమికి దక్షిణ ధ్రువం అంటార్కిటికాలో.. దక్షిణ మహాసముద్రంలో మా నౌక లంగరు వేసింది. ఒక కయాక్‌ (ఒక మనిషి పట్టే బోటు)లో నేను మంచు తివాసీలా గడ్డకట్టుకుపోయిన ఒక నదీ ముఖద్వారం కేసి వెళ్తున్నాను. చుట్టూ మంచు కొండలు.. సముద్రపు నీటి మీద తేలుతున్న మంచు దిమ్మలు.. అక్కడక్కడ మంచుదిబ్బల మీద పచార్లు చేస్తున్న పెంగ్విన్‌ పక్షులు.. నీటిపైకి వచ్చి గాలి నింపుకుంటున్న తిమింగలాలు.. మైనస్‌ 20 డిగ్రీల చలిలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా ఎత్తున వున్న నదీ ముఖద్వారం కేసి నా కయాక్లో వెళ్తుంటే.. 

అకస్మాత్తుగా
కొన్నిమీటర్ల ఎత్తున గడ్డ కట్టిపోయివున్న నది నుండి 5–6 టన్నుల బరువుండే మంచుగడ్డ విడిపోయి, జారిపోతోంది! సంభ్రమంతో అటే చూస్తున్నాను. అది ఒక భారీ కంటైనర్‌లా వుంది. అలా జారిపోతూ సముద్రంలోకి పడిపోతోంది! అలా చూస్తుండగానే చెవులు బద్దలయ్యేలా నా పక్కన పిడుగు పడినంత శబ్దంతో ఆ మంచుగడ్డ ’ఢభీ’ మంటూ సముద్రపు జలాల్లో కూలిపోయింది. దాదాపు 30 మీటర్ల ఎత్తునుంచి మంచుగడ్డ కూలిపోయిన ఉద్ధృతానికి సముద్రపు కెరటాలు ఒక్కసారిగా 15–20 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి! అలా ఓ పెద్ద కెరటం నా కయాక్‌ వైపుకి విరుచుకుపడుతూంటే, కంగారుగా, హడావుడిగా నా బలంకొద్దీ కయాక్‌ దిశ మార్చి దూరంగా నడుపుకొచ్చేశాను.. అలా వచ్చేశాక, ’హమ్మయ్య’ అని ఊపిరిపీల్చుకున్నాను ఆ క్షణంలో! నౌకలోకి తిరిగి వచ్చాక రాబర్ట్‌ శ్వాన్‌తో నా అనుభూతిని పంచుకున్నాను. ఆయన మా అంటార్కిటికా అధ్యయన యాత్రకి తలపండిన సారథి.

అంతకు ముందు
2017 జూలై నెలలో ఉత్తర  ధ్రువానికి దగ్గరగా వున్న స్వాల్బర్డ్‌కి వెళ్లాను. నార్వేలో మా దౌత్యాధికారుల సమావేశం ఒకటి జరిగింది. సమావేశం అయిపోగానే నేను ఉత్తర ధ్రువాన్ని చూడాలన్న తహతహకొద్దీ సెలవు తీసుకుని ’స్వాల్బర్డ్‌’కి  విమానంలో వెళ్లాను. అక్కడ ఒక చేపల పడవని అద్దెకి మాట్లాడుకుని, ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా, స్వాల్బర్డ్‌కి ఉత్తరకొసన వున్న చిట్టచివరి జనావాసం నై–అలెసుండ్‌  చేరుకున్నాను. అక్కడున్న జనాభా అంతా కలిపి 30కి అటూ ఇటుగా వుంటారు. ఆ దీవిలో అక్కడక్కడ వున్న బడ్డీకొట్లలాంటి ఆవాసాల మధ్య నడుస్తుంటే, ఒకచోట హిందీ సినిమాగీతం వినిపించింది. 
ఆశ్చర్యంతో అక్కడున్న పసుపుపచ్చటి ఆవాసం ముందుకెళ్లి, తలుపుకొట్టాను. తలుపు తెరుచుకుంది. లోపలకు వెళ్లాక సంభ్రమంతో, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. అక్కడ ఇద్దరు సైంటిస్టులు పనిచేసుకుంటున్నారు. వాళ్లిద్దరూ భారతీయులు. అంటే, నేను అడుగుపెట్టిన ఆవాసం.. ఉత్తర ధ్రువంలో భారతదేశపు పరిశోధనా కేంద్రం ‘ధ్రువ్‌’.

గ్లేసియర్‌పై ఐదు రోజులు
అక్కడున్న అయిదు రోజుల్లో చాలాసార్లు గ్లేసియర్‌ (గడ్డకట్టిన హిమ సాగర జలాల) మీదకి వెళ్లాను. ఉత్తర ధ్రువంలో  ఏం జరుగుతోందో అర్థంకావటానికి ఎక్కువకాలం పట్టలేదు. వాతావరణ మార్పు ప్రభావం భారత్‌ మీద ఎలా వుండవచ్చో తెలుసుకున్నాను. అది తెలిసిన దగ్గర్నుంచీ, నాలో ఏదో ఆందోళన. నేను పర్యావరణ పరిరక్షణ కార్యకర్తని కాను. కాని ఐక్యరాజ్యసమితి ఉద్యోగంలో భాగంగా  శాంతి సాధన కృషిలో పాలుపంచుకునే నాకు ఈ వాతావరణ మార్పు అనే పెనుభూతం మానవ జీవితాలను మసకబారేలా చేస్తుందన్న భావన నిద్రపట్టనీయడంలేదు. స్వాల్బర్డ్‌ నుంచి తిరిగొచ్చిన దగ్గర్నుంచీ అదే భావన. 
భూతాపానికి కొలబద్దలు.. ఆర్కిటిక్, అంటార్కిటికా ధ్రువ ప్రాంతాల్లో సాగర జలాల మధ్యలో విస్తరించిన మంచు ఖండాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్న కొద్దీ నాకు అంటార్కిటికా కూడా వెళ్లి ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలన్న బలమైన కోరిక కలిగింది. ప్రయత్నించాను. రాబర్ట్‌ శ్వాన్‌ ఆధ్వర్యంలోని బృందంలో ఆ ఫిబ్రవరి, మార్చి మాసాల్లో అంటార్కిటికా వెళ్లేందుకు అవకాశం లభించింది.  

నౌకలో అంటార్కిటికాకు
ఫిబ్రవరి 27న దక్షిణ అమెరికాలోని ఉషుఐయా పట్టణం నుంచి నౌకలో 80 మందితో మా అధ్యయన యాత్ర ప్రారంభమైంది. అల్లకల్లోలంగా వున్న డ్రేక్‌ ప్యాసేజీని దాటాం.  మూడురోజుల తరువాత.. మొట్టమొదటి మంచు శిఖరాన్ని సముద్రంలో చూశాం. మార్చి 3న అంటార్కిటికా ధ్రువ రేఖ (సర్కిల్‌)ని దాటి, అంటార్కిటికా ద్వీపకల్పానికి పశ్చిమంగా ప్రయాణించాం. మధ్యమధ్యలో చిన్నచిన్న దీవుల్ని దాటుకుంటూ వెళ్తున్నాం. అంటార్కిటికాలో మనిషి చేసిన మనుగడ ప్రయోగాల తాలూకు చిహ్నాలు చాలా ఇక్కడ కనిపించాయి. 19వ శతాబ్దంలో ‘సీల్‌’ జంతువులను వేటాడటం కోసం ఉపయోగించిన బోట్ల తాలూకు అవశేషాలు.. మనుషులు జీవించి వదిలేసిన ఆవాసాల శిథిలాలు.. అర్జెంటీనా, చిలీ, బ్రిటన్ల స్థావరాలు ఈ ప్రాంతంలో ఇప్పటికీ వున్నాయి. 

మంచు దీవిలో వెచ్చదనం!
మా అధ్యయన యాత్ర చివరి భాగం ’డిసెప్షన్‌’ దీవి మీద గడిచింది. అదొక పరమాద్భుత అనుభవం. అక్కడ ఉన్ని దుస్తులు ధరిస్తేనే గాని తట్టుకోలేనంత చలి. కాని, ఆ ’డిసెప్షన్‌’ దీవి మీద అడుగుపెట్టగానే వాతావరణం నులివెచ్చగా అనిపించింది. ఎక్కడిదీ వెచ్చదనం?ఆ దీవిలో ఒకప్పుడు బద్దలయిన అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహించిపోగా, ఆ అగ్నిపర్వతం వున్నచోట భూమి ఒక మూకుడు ఆకారంలో కిందికి కుంగిపోయింది. దాన్ని ఇంగ్లిషులో ’కాల్డెరా’ అంటారు. ఆ అగ్నిపర్వతం తాలూకు తాపం ఇప్పటికీ ఆ దీవిని వెచ్చగా వుంచుతోంది.ఆ ’కాల్డెరా’ అంచుకు వెళ్లి లోపలికి చూస్తున్నాను. కోరుకున్నట్లే ఈ భూమికున్న రెండు ధ్రువ రేఖలను దాటేశాను. ఈ రెండు ఖండాల్లోనూ గ్లేసియర్స్‌ బద్దలవుతూనే వున్నాయి. 

ఎంత దుర్విషయం!
సముద్రంలో విరిగి పడే ప్రతి భారీ మంచు చరియ, గ్లేసియర్‌ ఖండం వల్ల సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. పెరిగే ప్రతి అంగుళపు సముద్రపు నీటి మట్టంవల్ల భూభాగం తగ్గుతుంది. పైగా అనూహ్యంగా సంభవించగల సముద్రపు ఆటుపోట్లు, దాని ప్రభావం మనకి భార త్‌లో వర్షపాతాల మీద పడటం, వేసవికాలాల్లో తాపం పెచ్చరిల్లిపోవటం, అనూహ్యమైన తుఫాన్‌ వర్షాలు సంభవించి పంటల్ని దెబ్బతీయటం, ఫలితంగా వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పెరగడం, సమాజంలో ఘర్షణలు పెంచడం ఇవే జరుగుతాయి. ఇన్ని అవాంఛనీయ పరిస్థి తులకి ప్రధాన కారణం వాతావరణ మార్పు. ఇది పెను ముప్పు. తాపీగా ’రాబోయే సంవత్సరాల్లో పరిష్కరిద్దాంలే’ అని ఉపేక్షించటానికి వీల్లేని అత్యవసర సమస్య ఇది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తెలుసుకొని అప్రమత్తం కాకపోతే ఈ తరానికీ, భవిష్యత్‌ తరాలకీ మిగిలే భవిష్యత్‌ దుఃఖమయం.(హైదరాబాద్‌కి చెందిన  ఈ వ్యాసకర్త ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్త)

కార్బన్‌ వ్యర్థవాయువులు వాతావరణంలో ప్రవేశిం చకుండా నిరోధించే చర్యలు తీసుకోవటం, అడవుల విస్తీర్ణం పెంచుకోవడం వంటివి యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఇది ఇప్పటికిప్పుడే ప్రారంభం కాలేదంటే ఈ భూగ్రహం మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకం కాగల రోజు ఎంతో దూరంలో లేనట్లే.

మరిన్ని వార్తలు