పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

12 Mar, 2018 01:59 IST|Sakshi

పాపకు తలలో పదేపదే ర్యాష్‌!

మా పాపకు పదకొండు నెలల వయస్సు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్‌ వచ్చింది. డాక్టర్‌గారికి చూపించి చికిత్స చేయిస్తే తగ్గింది గానీ మళ్లీ పదే పదే తిరగబెడుతోంది.  మా పాపకు ఉన్న సమస్య ఏమిటి?      – ఎమ్‌. శారద, సామర్లకోట
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్‌) భాగంలో చర్మం మీద ర్యాష్‌ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అలాగే కొద్దిగా సూపర్‌ యాడ్‌ ఇన్ఫెక్షన్‌ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్‌ డర్మటైటిస్‌ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలిక సమస్యగానే చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడుపైన పొరల్లా ఊడటం, కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపించడం జరుగుతుంది.

దీనికి కారణం ఫలానా అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... కొన్నిసార్లు ఎమ్‌. పర్పూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. కొన్నిసార్లు ఈ ర్యాష్‌ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తుంది.

ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్‌ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్‌... అంటే అటోపిక్‌ డర్మటైటిస్, సోరియాసిస్‌ వంటి స్కిన్‌ డిజార్డర్స్‌ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు.

చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్‌ (సెలీనియం, శాల్సిలిక్‌ యాసిడ్, టార్‌) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఉన్న కీమ్స్‌ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్‌ వంటివి చేయాలి. దాంతో ఈ సమస్య నయమవుతుంది. అలాగే ఈ సమస్యతో ప్రభావితమైన భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం కూడా చాలా ముఖ్యం.


బాబుకుతరచూతలనొప్పి..ఏం చేయాలి?

మా బాబు వయసు తొమ్మిదేళ్లు. తరచూ తలనొపితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు చాలా అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మధ్యలో కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి.
– జి. సుబ్రహ్మణ్యమూర్తి, వరంగల్‌
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్‌ హెడేక్‌)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్‌. ఇది పెద్దల్లో అంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్‌ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్‌) తలనొప్పులు రావచ్చు.

మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్‌ వల్ల వస్తున్న తలనొప్పి అని  భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు.

చికిత్స : ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదిటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్‌ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూప్‌ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం.  

పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్‌ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను  చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్‌ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్‌ సలహా మేరకు కొన్ని  మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్‌ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం అవసరం.


మా బాబు ఎదుగుదల నార్మల్‌గానే ఉందా?

మా బాబుకు 15 నెలలు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. అయితే వాడు ఇంకా సపోర్ట్‌ తీసుకోకుండా నడవలేకపోవడం, ముద్దుమాటలాడకపోవడం చూస్తే వాడి ఎదుగుదలలో ఏవైనా లోపాలున్నాయేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తోంది. దాంతో తీవ్ర వేదనకు గురవుతున్నాం. పిల్లల వికాసం ఏయే సమయాల్లో ఎలా ఉంటుందో విపులంగా వివరించండి. 
  – సువర్ణకుమారి, కాకినాడ
మీ బాబు ఎదుగుదల విషయంలో కాస్త నిదానంగా ఉన్నాడంటూ మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే... మీరలా అనుకోవడానికి కారణలేమీ కనిపించడం లేదు. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, వికాసం వేర్వేరుగా ఉంటాయి. పిల్లల డెవలప్‌మెంట్‌ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫలానా పిల్లలు ఫలానా సమయంలోనే ఫలానా నైపుణ్యాలను నేర్చుకుంటారని చెప్పడం కుదరదు.

కొంతమంది చాలా త్వరగా నడుస్తారు, మాట్లాడతారు. మరికొందరు కాస్త ఆలస్యంగా. అయితే ఎవరు ఎప్పుడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటారన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... నెలలు నిండకముందే పుట్టడం, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి ఏవైనా సమస్యలు రావడం, పుట్టాక జాండీస్, ఇన్ఫెక్షన్స్‌ వంటివి రావడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, పిల్లలను పెంచే ప్రక్రియలో తల్లిదండ్రులు ఓవర్‌ ప్రొటెక్టివ్‌గా ఉండటం, కవల పిల్లలు కావడం వంటి అనేక అంశాలు వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నడక: సాధారణంగా పిల్లలు 11 నుంచి 16 నెలల మధ్య నడవడం ప్రారంభిస్తారు. కొందరు ఆలస్యంగా నడవడం మొదలుపెట్టవచ్చు. 18 నెలల పిల్లలు నడవడంతో పాటు ఏదైనా వస్తువులు పట్టుకుని లాగడం, వస్తువులను దూరంగా నెట్టడం, బుక్‌ చేతికి ఇచ్చినప్పుడు పేజీలు తిప్పడం, క్రేయాన్స్‌ వంటివి ఇస్తే వాటితో నేలమీద, గోడల మీద రాయడం, నేల మీదే దృష్టిపెట్టి పరుగెత్తడం వంటివి సులభంగా చేస్తుంటారు. రెండేళ్లు వచ్చే సరికి తలుపులు తెరవడం, సొరుగులు లాగడం, చేతులు కడుక్కోవడం, మెట్లు ఎక్కడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ పనులు చేయడంలోనూ పిల్లవాడికీ, పిల్లవాడికీ మధ్య తేడాలుంటాయి.

మాటలు: ఇక మాటల విషయానికి వస్తే 15 నెలలు నిండిన చిన్నారులు ముద్దుమాటలతో పాటు, ఒకటి రెండు శబ్దాలు పలకడం చేస్తుంటారు. 18 నుంచి 24 నెలల వయసుకు వాళ్లు 15–20 పదాలు పలకడంతో పాటు తల్లిదండ్రుల సూచనలకు రెస్పాండ్‌ అవుతుంటారు.

18–20 నెలల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా కూడా మాటలు రాకపోతే, చుట్టుపక్కల శబ్దాలకు ఏమాత్రం రెస్పాండ్‌ కాకపోతే... అప్పుడు అలాంటి పిల్లలకు డెవలప్‌మెంట్‌ డిలే ఉన్నట్లుగా పరిగణిస్తాం. అలాంటి పిల్లల్లో వినికిడి లోపాలు ఏవైనా ఉన్నాయేమో  తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇక మీ బాబు విషయానికి వస్తే... అతడు కొన్ని శబ్దాలను పలకడం, కొన్ని వస్తువుల ఆసరాతోనైనా నిలబడటం వంటివి చేస్తున్నాడు. ఇతరత్రా సమస్యలేమీ లేవు. డెవలప్‌మెంట్‌ డిలేని సూచించే లక్షణాలేమీ కనిపించడం లేదు. అయితే ఇలా డెవలప్‌మెంట్‌ డిలే ఉన్నట్లు అనుమానించే పిల్లల విషయంలో క్రమం తప్పకుండా ఫాలో అప్‌లతో పాటు క్లోజ్‌ అబ్జర్వేషన్‌ చాలా ప్రధానం.

ఒకవేళ నిజంగానే గ్రాస్‌ డెవలప్‌మెంట్‌ డిలే ఉంటే త్వరగా కనుక్కుని అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడం (అర్లీ ఇంటర్‌వెన్షన్‌ ప్రోగ్రామ్స్‌) ద్వారా వాళ్లను సరిచేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రీషియన్‌తో తరచూ ఫాలోఅప్‌లో ఉండండి. మీ పీడియాట్రీషియన్‌ సూచనలను తప్పక పాటించండి.


- డా. రమేశ్‌బాబు దాసరి ,సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు