అమ్మాయి ఒంటిమీద పులిపిర్లు... తగ్గేదెలా?

21 Aug, 2019 07:44 IST|Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న  చిన్న పులిపిరి కాయల్లాంటివి వతున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి.– ఆర్‌. శైలజ, కర్నూలు

మీరు చెప్పిన  వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ ములస్కమ్‌  కంటాజియోజమ్‌ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్‌ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం.

వ్యాప్తి జరిగే తీరు... చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్‌  ఇనాక్యులేషన్‌ అంటారు. అలర్జిక్‌ డర్మటైటిస్‌ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ  లీజన్స్‌ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్‌), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.
చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్‌ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్‌ మెడిసిన్స్‌.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్‌ అనే క్రీమ్‌ను లీజన్స్‌ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్‌ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి.

బాబుకు తరచూ జలుబు... సలహా ఇవ్వండి
మా బాబుకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, పానీయాలు ఇష్టంగా తాగుతాడు. వద్దన్నా మానడు. ఒక్కోసారి ఊపిరి సరిగ్గా ఆడటం లేదని అంటుంటాడు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటి ప్రభావం సరిగ్గా లేదు. బాబు ఆరోగ్య విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలో తెలియజేయండి.– ఎమ్‌.డి. అన్వర్‌బాషా, గుంటూరు

మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌  లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్యంగా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావరణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూల మొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్‌ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు.

మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్‌ స్టెరాయిడ్‌ స్ప్రేస్‌ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది.

పాపకు ఒంటిపై తరచూ దద్దుర్లు...!
మా పాపకు ఆరేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒక రోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. ఈ సమస్యకు మందులు కూడా వాడాం. అయితే తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. పాప చాలా ఇబ్బంది పడుతోంది. ఇలా జరగడానికి కారణం ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి.– కనకరత్నం, నెల్లూరు

మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్‌ఫీషియల్‌ డర్మిస్‌) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు.  ఇది అతి సాధారణ సమస్య. ఆర్టికేరియాలో అక్యూట్‌ అని, క్రానిక్‌ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్‌ అర్టికేరియా అని చెప్పవచ్చు.

ఆర్టికేరియాకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, వేరుసెనగపల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్‌); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్‌ లేదా వైరల్‌); కాంటాక్ట్‌ అలర్జీలు (అంటే లేటెక్స్‌/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్‌ అర్టికేరియా రావచ్చు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్‌ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం.  కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్‌) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

అక్యూట్‌ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్‌ దుస్తులు, సీఫుడ్‌ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప అర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దాని నుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్‌2 బ్లాకర్స్‌ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్‌ మెడిసిన్స్‌ కూడా వాడవచ్చు. మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్‌ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్‌ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.-డా. రమేశ్‌బాబు దాసరిసీనియర్‌ పీడియాట్రీషియన్,రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు