తలుపులు తెరుద్దాం..

8 Apr, 2020 07:02 IST|Sakshi

భారతదేశం లాక్‌డౌన్‌లో ఉండేసరికి ప్రతి ఒక్కరూ ‘తోచట్లేదు, బోర్‌ కొడుతోంది’ అంటూ ఎవరికి తోచినట్లు వారు పోస్టులు పెడుతున్నారు, టిక్‌టాక్‌లు చేస్తున్నారు. చిన్న వీడియోలు తీస్తున్నారు. ఇంత సృజన వాళ్లలో ఉందని లాక్‌డౌన్‌ వల్లే కదా తెలిసింది. ఎప్పటిలా ఉంటే తెలిసేనా? ప్రకృతిని పరిశీలిద్దామా! ఎప్పటిలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. తన లేలేత కిరణాలు, చురుకైన కిరణాలు, సంధ్యా కిరణాలు ప్రసరించి అలసిపోయి మళ్లీ అస్తమిస్తున్నాడు. లాక్‌ డౌన్‌ సూర్యుడిని ఏమీ చేయలేకపోయింది. ఉదయాన్నే నిద్ర లేవగానే అమ్మ ఆప్యాయంగా, ‘నాన్నా! నిద్రలేవరా! పాలు కలిపి ఉంచాను, నీకు ఇష్టమైన టిఫిన్‌ చేసి ఉంచాను’ అని పలకరించే ప్రేమాభిమానాలను లాక్‌డౌన్‌ ఏమీ చేయలేకపోయింది. రోజూ ఎవరి సమయానికి వారు కంచం పెట్టుకుని, నాలుగు మెతుకులు గబగబ మింగేసి, ఎవరి పనులకు వారు పరుగులు తీశాం. మరి ఇప్పుడో, పొద్దున్న తొమ్మిది అయ్యేసరికి అందరికీ డైనింగ్‌ టేబుల్‌ మీద ఉన్న ఆహారపదార్థాలు స్వాగతం పలుకుతున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడిపే మధుర క్షణాలను లాక్‌డౌన్‌ ప్రసాదించింది. మనం లాక్‌డౌన్‌కు ఋణపడాల్సిందేగా. 

కూరల కోసమో, మందుల కోసమో బయటకు వచ్చినప్పుడు వీధి కుక్కలు డొక్కలు ఎండిపోయి దీనంగా కనిపిస్తున్నాయి. మనం తినగా మిగిలిన అన్నాన్ని వాటికి పంచే దయాగుణం మనకు లాక్‌డౌన్‌ వల్ల అలవడటానికి అవకాశం వచ్చింది కదా. మనం తినగా మిగిలిన అన్నమే కాదు, వీలైతే నాలుగు ముద్దలు ఎక్కువ వండి, సాటి ప్రాణుల పట్ల దయను చూపి మనలోని మానవత్వాన్ని మేల్కొల్పిన లాక్‌డౌన్‌కు నమస్కరిద్దాం. 

చాలామంది పదవీ విరమణ అయ్యాక, యవ్వనంలో కన్న కలలను సాకారం చేసుకునేవారు. కాని ఇప్పుడు యువతకు లాక్‌ డౌన్‌ ఈ వయస్సులోనే వారి సృజనకు పదును పెట్టే అవకాశం ఇస్తోంది. ఆఫీసులకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాలంటే గంటలు గంటలు ప్రయాణించాలి. ఆ సమయమంతా ఇప్పుడు మిగులుతోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని, మనలోని సృజనకు పదును పెట్టడానికి కలాలు, కుంచెలు, గిటార్‌లు, కెమెరాలు, కీ బోర్డులు... అటకెక్కిన మన కళారాధనను బూజు దులిపి బయటకు తీద్దాం. సాధన ప్రారంభిద్దాం. ఎంతో కొంత నైపుణ్యాన్ని సాధిద్దాం. ఆత్మానందం పొందడానికి లాక్‌డౌన్‌ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. 

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వడ్లగింజలు, విశ్వనాథ వేయిపడగలు, బుచ్చిబాబు చివరకు మిగిలేది, గోపీచంద్‌ అసమర్థుని జీవయాత్ర. అడవి బాపిరాజు నారాయణరావు, ఉషశ్రీ జ్వలితజ్వాల, శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్‌ కథలు, నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు, ఆరుద్ర సమగ్రాంధ్ర చరిత్ర, యద్దనపూడి సెక్రటరీ, యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల.. ఒకరేమిటి... నచ్చిన రచయితల పుస్తకాల దుమ్ము దులిపి పుస్తక పఠనం కొనసాగిద్దాం.  వీటితో పాటు మన ఆత్మీయులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుని, ప్రేమగా లకరిద్దాం. ఆత్మీయతలకు, అనుబంధాలకు లాక్‌డౌన్‌ లేదని గుర్తు చేసుకుందాం. వీలైతే వారితో ఆన్‌లైన్‌ ఆటలు ఆడదాం. మానవ సంబంధాలకు లాక్‌డౌన్‌ లేదుగా! ఇంటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లే, సంబంధ బాధ్యతలనూ సంతోషంగా ఆహ్వానిద్దాం.

ఏది జరిగినా మన మంచికే అనే భారతీయ సిద్ధాంతాన్ని గౌరవిద్దాం. లాక్‌డౌన్‌ను ఒక సదవకాశంగా భావించి, మనం చేయాలనుకున్న, సాధించాలనుకున్న, నేర్చుకోవాలనుకున్న, నిరంతరం చేయాలనుకున్నవన్నీ చేయడానికి... ‘ఇది సమయము, మించినన్‌ దొరకదు, త్వరంగొనుడు సుజనులారా, భలే మంచి చౌక బేరము’ (శ్రీకృష్ణతులాభారం లో నారదుడు పాడిన పాట) అని హాయిగా ఆలాపిద్దాం. బంధాలు, అనుబంధాలు పెంచుకుందాం... మనలను మనం బంధవిముక్తుల్ని చేసుకుందాం. ఆ పని ఇప్పుడే ప్రారంభిద్దాం. మాయాబజార్‌లో చెప్పినట్టుగా ఇదియే మన తక్షణ కర్తవ్యం.

పాండవులు పదమూడేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసం అంటే వాళ్లకి క్వారంటైనే మరి. ఐదుగురూ స్వీయ నియంత్రణలో ఉన్నారు. ఆ పదమూడేళ్లు ఖాళీగా, సమయాన్ని భారంగా గడపలేదు. దుష్ట సంహారం చేశారు. అతిథి మర్యాదలు చేశారు. పశుపక్ష్యాదులకు రక్షణగా నిలిచారు. అన్నదమ్ములంతా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. అజ్ఞాతవాసాన్ని ఆనందంగా గడిపారు. ఆ సమయంలోనే ధర్మరాజు తన చదరంగ క్రీడకు పదును పెట్టాడు. భీముడిలోని పాకశాస్త్ర నైపుణ్యాన్ని వెలికితీశాడు, అర్జునుడు తన నాట్యకళతో విరటుని కుమార్తె ఉత్తరను అభినేత్రిని చేశాడు. ఇక నకుల సహదేవులు ఆవులను, గుర్రాలను సంరక్షించారు. ద్రౌపది సైరంధ్రిగా మంచి హెయిర్‌స్టయిలిస్టుగా విరాటరాజు భార్య ను అలంకరించింది. వీరంతా సమయాన్ని వృథా చేసుకోలేదు. లాక్‌డౌన్‌లో ఉన్నామని చింతించలేదు. నైపుణ్యాలను వెలికి తీశారు.
– వైజయంతి పురాణపండ

>
మరిన్ని వార్తలు