నిట్టూర్పుల తుఫాన్‌

23 Jun, 2018 00:02 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

ఇది షో కాదు. చూపించాలన్న ఆత్రమూ కాదు. సంచలనం కోసం తపనా కాదు. ఇదొక ప్రదర్శన. హక్కుల కోసం ప్రదర్శన. పదేళ్ల, వందేళ్ల, వెయ్యేళ్ల, లక్ష యేళ్ల.. కోటి యేళ్ల నిట్టూర్పుల తుఫాన్‌. నా కోరికను గుర్తించు.. నన్ను గౌరవించు.. అనే డిమాండ్‌!


‘వీరె ది వెడ్డింగ్‌’ అంటే చాలామందికి అర్థం కాలేదు. పంజాబీలో ఆ మాటలో ‘స్నేహితురాలి పెళ్లి’ అని అర్థం. అది ఇటీవల వార్తలలోకి ఎక్కిన బాలీవుడ్‌ సినిమా. అందులో ఒక స్నేహితురాలి పెళ్లికి ముగ్గురు స్నేహితురాళ్లు హాజరవుతారు. పెళ్లి చేసుకోవాల్సిన స్నేహితురాలికి పెళ్లి మీద పూర్తి సదభిప్రాయం లేదు. ‘కలిసి ఉండటంలోనే సఖ్యత ఉంది కదా’ అంటుంది బాయ్‌ఫ్రెండ్‌తో. కానీ అతడు వినడు. ఆమె ముగ్గురు స్నేహితురాళ్లలో ఒకామె పరమతం వాణ్ని చేసుకుని ఉంటుంది.

ఆ పెళ్లికి ఇంట్లో అనుమతి లేదు. పిల్లాడు పుట్టినా ఆమె కుటుంబం ఆమెను స్వీకరించదు. అందుకని ఆమెకు స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటూ ఉంటుంది. లావెక్కిపోతూ ఉంటుంది. పైకి ఆనందమే. హుషారే. సడన్‌గా తన స్నేహితురాళ్లతో ‘నాకూ మావారికి మధ్య అది జరిగి సంవత్సరం అవుతోంది తెలుసా’ అంటుంది. ఆ స్నేహితురాళ్లలోనే ఇంకొక ఆమెకు తగిన సంబంధం దొరుకుతుండదు. కాని ఎదిగొచ్చిన వయసుకు అవసరాలు ఉంటాయి. తన బాస్‌తో సంబంధం పెట్టుకుంటుంది. దాని నుంచి బయట పడ్డాక అడపా దడపా వచ్చే అవకాశాలను తిరస్కరించకుండా తప్పా ఒప్పా చర్చ పెట్టకుండా వాటి ప్రమేయాన్ని ‘ఒన్‌ నైట్‌ స్టాండ్స్‌’గా చూస్తూ ఉంటుంది.

మరో స్నేహితురాలు తన క్లాస్‌మేట్‌ కుర్రాణ్ణే పెళ్లి చేసుకుని ఉంటుంది. కాని అతడు లండన్‌లో. ఈమె ఢిల్లీలో. కలిసి చదువుకున్నారన్న మాటే కాని కలిసి జీవించదగ్గ గట్టి బంధం తమ మధ్య లేదని ఇరువురికీ అర్థమై ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్‌లో ఉంటుంది. తాగడం, స్మోక్‌ చేయడం, నలుగురి పట్లా నిర్లక్ష్యంగా ఉండటం... అంత వరకే తెగువ. మరొకరితో సంబంధం పెట్టుకోదు. కాని భర్త ఆమెను నాకు నువ్వు వద్దు అంటాడు. ఎందుకంటే ఆమె తనను తాను తృప్తి పరుచుకుంటూ అతని కంట పడుతుంది.

‘మదర్‌ ఇండియా’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’, ‘హమ్‌ సాత్‌ సాత్‌ హై’... వంటి సినిమాలు తీసే బాలీవుడ్‌ నుంచి ఇప్పుడు ఇలాంటి సినిమా వచ్చి దిగ్భ్రమ పరచే పరిస్థితి ఏర్పడింది. కథలు అయిపోయాయి. కాదు కాదు... కొత్త కథలు చెప్పే సందర్భాలు వచ్చాయి. పగ, ప్రతీకారాలు, యాక్షన్‌ డ్రామాలు... ఇవన్నీ కాదు... భూలోకంలో సగం ఉన్న స్త్రీల గురించి మాట్లాడాలి... వాళ్ల ఆలోచనలు ప్రేక్షకులకు చెప్పాలి... వాళ్ల భావావేశాలు జనానికి అర్థం చేయాలి... కొంచెం షాక్‌ ఎలిమెంట్‌ ఉన్నా ఇవన్నీ చర్చకు పెట్టాలి అని బాలీవుడ్‌ అనుకుంటూ ఉంది. ఈ ప్రయత్నాలు మహిళ, పురుష దర్శకులు చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా తాము ఎదగక తప్పదు అని గ్రహించి వీటిని క్రమంగా ఆహ్వానించే వైపు కదులుతున్నారు.

‘ఫైర్‌’తో మొదలు...
పురుషాధిక్య సమాజం అనేది పడికట్టు మాటే అయినా అది శక్తివంతమైనది. పురుషాధిక్య సమాజంలో పురుషుల వలన, పురుషుల చేత, పురుషుల కొరకు స్త్రీ వినియోగించబడుతుంటుంది. విలువలు పురుషులకు వేరు స్త్రీలకు వేరు. దీనిని సాహిత్యం చాలానే ప్రశ్నించింది. చలం వంటి తెలుగు రచయితలు పెద్ద భూకంపమే సృష్టించారు. కాని సనాతనమైన హిందీ సినిమా పరంపరను మాత్రం మొదటగా దీపా మెహతా ‘ఫైర్‌’ (1996) కుదిపి వదిలిపెట్టింది. అందులో పైకి అంతా బాగా కనిపిస్తున్న ఒక సంపన్న ఉత్తరాది కుటుంబంలో ఇద్దరు తోడి కోడళ్లు శారీరకంగా సన్నిహితం అవుతారు.

ఈ సినిమా చూసిన వారు ‘అంత అవసరం ఏమొచ్చింది?’ అని కోపంతో ఎగిరి పడ్డారు. కాని దేహ అవసరాలు తీర్చుకోవడం తీర్చుకోకపోవడం పురుషుడి చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో స్త్రీ నిమిత్తమాత్రురాలు. కాని దేహ అవసరాలు అంటే కేవలం దేహ అవసరాలేనా? స్పర్శలో కూడా ఎంతో ప్రేమ, ఓదార్పు, దగ్గరితనం లభిస్తుంది. ఆ మాత్రం స్పర్శకు కూడా స్త్రీలు అలమటించేలా మగవాళ్లు ప్రవర్తిస్తున్నప్పుడు స్త్రీలకు మరో గత్యంతరం లేక దగ్గరైతే ఏమిటి మీరు చేయగలిగేది అని ఈ సినిమా ప్రశ్నించింది. సాంస్కృతికంగా ఈ సినిమా కొట్టిన దెబ్బ నుంచి ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలాకాలం పట్టింది.

ఆ తర్వాత వినోద్‌ ఖన్నా, నసిరుద్దీన్‌ షా నటించిన ‘రిహాయి’ (1988), టబూ నటించిన ‘అస్తిత్వ’ (2000) కూడా స్త్రీలకు సంబంధించిన ప్రశ్నలు ముందు పెట్టాయి. ఆకలి, నిద్ర స్త్రీ, పురుషులకు సమానమైనదైనప్పుడు ఆ మూడోది కూడా స్త్రీకు సమానమైనదే కదా అని ప్రశ్నించాయి. ‘రిహాయి’లో వ్యాపారం కోసం నెలల తరబడి టూర్లు చేసే రాజస్తాన్‌ వర్తకులు తాము ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవడం తప్పు అనుకోరు. కాని స్త్రీలు మాత్రం ఇంటి పట్టున ‘పవిత్రం’గా ఉండాలనుకుంటారు.

ఈ సినిమాలో వ్యాపారం నుంచి తిరిగి వచ్చిన భర్తకు భార్య తాను గర్భవతిని కాబోతున్నానని తండ్రి నువ్వు కాదని చెప్పి సంచలనం రేపుతుంది. ‘అస్తిత్వ’లో రాత్రయితే ముసుగుతన్ని పడుకునే భర్తను చూసి చూసి ఒక మధ్యతరగతి గృహిణి తన సంగీతం టీచర్‌కు సన్నిహితం అవుతుంది. దీనిని భర్త నిలదీసినప్పుడు అది ఎలా నేరమో చెప్పమని ఆ గృహిణి వాదనలు వినిపిస్తుంది. చాలామేరకు మగవారిని కూడా కన్విన్స్‌ చేసిన సినిమా ఇది.

కోరిక పైకి చెప్పకూడదా?
కోరిక వ్యక్తపరిచే హక్కు పురుషుడికే ఉంటుందా? ప్రియురాలుకాని, భార్య కాని తన పురుషుణ్ణి చేయి పట్టుకుని లాగితే ఆమెను బరితెగించిందనే అనుకోవాలా? అనురాగ్‌ కశ్యప్‌ ‘దేవ్‌ డి’ (2009) సినిమా ఈ విషయాన్నే చర్చిస్తుంది. ఆ సినిమాలో అభయ్‌ డియోల్‌ హీరో. అతడి చిన్ననాటి స్నేహితురాలికి అతనితో సన్నిహితంగా మెలగాలని చాలా కాలంగా ఉంటుంది. ఆ సంగతి అతడికి చెప్పడమే కాదు ఒక చాపను సైకిల్‌కు కట్టుకుని మరీ పొలాలకు చేరుకుంటుంది.

ఇలా కోరికను ఒక స్త్రీ వ్యక్తపరచడం హీరో తట్టుకోలేకపోతాడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు. ‘హనీమూన్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (2007) సినిమాలో ఒక స్త్రీ పాత్ర కూడా అత్తామామలు ఉంటే నేను పడక గదిలో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను... వాళ్లంటే నాకు గౌరవం లేకకాదు... కాని మన సంతోషం కోసం విడిగా ఉందాం అని చెప్పడం పెద్ద సమస్యై కూర్చుంటుంది.

‘మసాన్‌’ (2007)లో ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఇద్దరి అంగీకారం ప్రకారం హోటల్‌లో కలవడానికి నిశ్చయించుకుంటుంది. కాని సంఘం, చట్టం దీనికి అనుమతించవు. పోలీసులు పట్టుకుంటారు. కుర్రాడు భయపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక సహజాతం తీర్చుకుంటూ దొరికిపోయిన నేరానికి ఆ అమ్మాయి జీవితాంతం చరిత్రహీనురాలిగా మిగలాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇంతింత పెద్ద శిక్షలు వేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తుంది ఈ సినిమా.

అన్నీ అతనికేనా?
పురుషునికి లైంగిక ఉత్ప్రేరకాలు అనేకం ఉంటాయనీ పుస్తకాలు, వీడియోలు అన్నీ అతని కోసమేననీ స్త్రీలకు ఇవి  ఎందుకు నిషిద్ధమో చెప్పాలని ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ (2016) ప్రశ్నిస్తుంది. సంఘంలో వితంతువులు, యాభై ఏళ్లు దాటిన వాళ్లు అనంటే వాళ్లకు లైంగిక జీవితం అవసరంలేదన్న భావన ఎందుకు ఉందని కూడా ఈ సినిమా నిలదీస్తుంది. ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’లో యాభై ఏళ్ల ఒక వితంతువు కోరికతో సతమతమవుతూ అది సక్రమంగా తీరక పెడత్రోవలు తొక్కే విషాదం కనిపిస్తుంది.

గత సంవత్సరం వచ్చిన ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌’లో హీరోయిన్‌ ‘నా భర్త మిలట్రీలో చనిపోయాడు. నాకు కోరికలు ఉన్నాయి. పెళ్లి కావాలి’ అని చాలా స్వేచ్ఛగా బాహాటంగా చెబుతుంది. బాలీవుడ్‌ వీరి గురించే కాదు... శారీరక ఇబ్బందులు ఉండేవారి లైంగిక కాంక్షలను కూడా గట్టిగా చర్చించే ప్రయత్నం చేస్తోంది. సెరిబ్రల్‌ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన అమ్మాయి ‘మార్గరిటా విత్‌ ఏ స్ట్రా’ (2015) సినిమాలో తన మనసుకూ శరీరానికీ కూడా ఒక తోడు కోసం పరితపించడం కనిపిస్తుంది. బాయ్‌ఫ్రెండ్‌ రిజెక్ట్‌ చేస్తే తన లాంటి మరో దివ్యాంగురాలికి ఆమె సన్నిహితం అవుతుంది. ఇలాంటి కథలన్నీ ఇంతకు ముందు వెండి తెర మీద చూశామా? ఇప్పుడు చూస్తున్నాం.

స్వేచ్ఛా విప్లవం
చూడబోతే ఇప్పుడు బాలీవుడ్‌లో స్వేచ్ఛా విప్లవం నడుస్తున్నట్టుగా ఉంది. స్వేచ్ఛగా తిరిగే తిరగాలనుకునే స్త్రీలు తన శరీరానికి  తామే హక్కుదారులం అంటూ వెండి తెర మీద యధేచ్ఛగా కనిపిస్తున్నారు. అయితే వీరు స్వేచ్ఛను ప్రతిపాదిస్తున్నారు తప్ప పతనాన్ని కాదని మనం అర్థం చేసుకోవాలి. ‘పింక్‌’ సినిమాలో ముగ్గురు ఆడపిల్లలు తాము నచ్చిన అబ్బాయిలతో లైంగికంగా సన్నిహితం కావాలనుకుంటారు.

కాని ఒక్క క్షణం వారికి ‘నో’ చెప్పాలనిపిస్తుంది. అక్కడి దాకా వచ్చాక ‘నో’ చెప్పడం ఏంటని అబ్బాయిలు బలవంత పెట్టబోయారు. అది రేప్‌ కేసుగా మారి పెద్ద చర్చను లేవదీస్తుంది. తమకు ‘నో’ చెప్పే హక్కు కూడా ఉందని ఆడవాళ్లు కెమెరా ద్వారా అరచి చెబుతున్నారని అర్థం చేసుకోవాలి.

స్త్రీ, పురుషుడు లోకంలో ఉన్నంత కాలం ఒకరి అవసరం ఒకరికి ఉన్నంత కాలం ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే క్రమం నిత్యం సాగుతూనే ఉంటుంది. పురుషుడు మాత్రమే నిజ జీవితంలో కాని స్క్రీన్‌ మీద కాని ఎక్కువ స్పేస్‌ ఎల్లకాలం తీసుకోలేడు. మూల్గులకు వేడి నిట్టూర్పులకు అతడు మాత్రమే హక్కుదారుడు కాదని ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిదని బాలీవుడ్‌ ది ఎండ్‌ కార్డ్‌ వేసి మరీ హెచ్చరిస్తోంది.
 

నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా లస్ట్‌ స్టోరీస్‌!
సినిమా ఎక్కడ విడుదలవుతుంది? అనడిగితే థియేటర్లలోనే కదా! అనే రోజులు పోయాయి. ఇప్పుడు థియేటర్లకు మించి సినిమాకు కొత్త మార్కెట్లు పుట్టుకొచ్చాయి. అమేజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌ లాంటివి థియేటర్‌ స్థానాన్ని ఆక్రమించేస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ హాలీవుడ్‌లో ఇప్పటికే పాపులర్‌ కాగా, తాజాగా ఇది ఇండియన్‌ మార్కెట్లోకీ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే నేరుగా విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌’ సినిమా ఇండియాలో పెద్ద సంచలనం. థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. కొంచెం కొత్తదనమున్న, యూత్‌ను మాత్రమే టార్గెట్‌ చేసిన సినిమాలు నేరుగా ఆన్‌లైన్లో విడుదలవ్వడం కొత్త ట్రెండ్‌.

లస్ట్‌ స్టోరీస్, బాలీవుడ్‌లోని నలుగురు టాప్‌ దర్శకులు తీసిన సినిమా. ఇందులో లైంగిక అంశాల మీద ఆడవాళ్ల దృక్పథం ఎలా ఉందీ అన్నది ప్రస్తావించారు. ఇలాంటి సినిమాలకు రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్‌ లాంటివే ఎగ్జిబిషన్‌ సెంటర్లని ‘లస్ట్‌ స్టోరీస్‌’ ప్రూవ్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 15న విడుదలై, సూపర్‌హిట్‌ అయింది!

మరిన్ని వార్తలు