పరి పరిశోధన

5 Feb, 2018 00:46 IST|Sakshi

ఉబ్బసం ఇబ్బందికి కారణం తెలిసింది...
ఉబ్బసం సమస్య మొదలైనప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలితిత్తులు ఎందుకు మూసుకుపోతాయో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీంతో ఉబ్బస వ్యాధి చికిత్సకు మరింత మెరుగైన మందులు తయారు చేయడం వీలవుతుందని అంచనా. హ్యూస్టన్‌ మెథాడిస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలా గాలితిత్తులు మూసుకుపోయేందుకు కేవలం రెండే రెండు పరమాణువులు కారణం.

ఈ రెండింటినీ నియంత్రించగలిగితే  ఉబ్బసం తీవ్రమైనప్పుడు ఊపిరి తీసుకునేందుకు విపరీతమైన ఇబ్బంది పడటం ఉండదు. గాలితిత్తుల ద్వారా ఒక రకమైన ప్రొటీన్‌ ఉత్పత్తి ఎక్కువగా జరగడం.. ఈ ప్రొటీన్‌ జిగురుగా ఉంటుందన్నది తెలిసిందే. ఊపిరితిత్తుల లోపలిగోడల్లో ఉండే కొన్ని ప్రత్యేక కణాలు గాలితిత్తులు ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఈ క్రమంలోనే అవి జిగురులాంటి మ్యూసిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కొన్ని కణాలు ఊపిరితిత్తులు విడుదల చేసే ఓఎక్స్‌40 అనే రసాయనం కారణంగా మ్యూసిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.


మాయన్ల మహా నగరం బయటపడింది...
సింధు నాగరికత గుర్తుంది కదా.. దక్షిణ అమెరికాలోనూ అచ్చం ఇలాంటిదే ఒక నాగరికత వేల ఏళ్ల క్రితం అకస్మాత్తుగా మాయమైపోయింది. అడపాదడపా ఒకట్రెండు నిర్మాణాలు, అవశేషాలు దొరికినప్పటికీ ఈ మాయన్‌ నాగరికత మర్మమేమిటో మాత్రం పూర్తిగా తెలియరాలేదు. ఇక ఈ సమస్యకు ఓ పరిష్కారం చిక్కినట్లే. ఎందుకంటారా? ఈ మధ్యే.. మాయన్లకు సంబంధించి గ్వాటమాలా వద్ద అత్యంత కీలకమైన ఆవిష్కరణ ఒకటి జరిగింది.

అత్యాధునిక లిడార్‌ టెక్నాలజీ సాయంతో అమెజాన్‌ అటవీ ప్రాంతంలో భూగర్భంలో దాక్కున్న భారీ కట్టడాలను, మానవ ఆవాసాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము మొత్తం 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైమానిక సర్వే లాంటిది చేశామని, క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి 900 ఏళ్ల కాలం నాటి మాయన్ల నాగరకతకు చెందిన మహా నగరం లభించింది.

ఇది ఎంత పెద్దది అంటే.. సుమారు కోటిమంది నివసరించిన నగరం అని అంచనా వేస్తున్నారు. మునుపటి అంచనాల కంటే చాలా ఎక్కువగా మాయన్లు అటవీభూమిని వ్యవసాయం కోసం చదును చేశారని, సాగునీరు కోసం కాలువల వంటి ఏర్పాట్లు విస్తృతంగా వాడారని టులాన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు.


జాబిల్లిపై రెండు లక్షల టన్నుల చెత్త!
భూమ్మీద ఇప్పటికే చెత్త సమస్యను సృష్టించుకున్న మనిషి జాబిల్లిని కూడా వదల్లేదు. ఎప్పుడో భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకుంటామని నాసా చెబుతోంది కానీ.. ఇప్పటికే అక్కడ కూడా బోలెడంత చెత్త పేరుకుపోయిందట. నాసా అంచనాల ప్రకారం.. ఇప్పటివరకూ జాబిల్లిపైకి వెళ్లిన ఉపగ్రహాలు, మానవ ప్రయాణాలను కలిపి చూస్తే మొత్తం రెండు లక్షల టన్నుల చెత్త అక్కడ  ఉంది. జాబిల్లిపైకి వెళ్లేందుకు వాడిన రాకెట్లు, ఉపగ్రహాల్లో అత్యధిక భాగాన్ని అక్కడే వదిలి వేయడం వల్ల ఈ సమస్య వస్తోన్నట్లు అంచనా.

వ్యోమగాములను భూమ్మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు ఇది చౌకైన మార్గమని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు అనుకునేవారు. జాబిల్లిపై తిరిగేందుకు ఉపయోగించిన మూన్‌ల్యాండర్‌లు, ఇతర ఉపగ్రహ విడిభాగాలు, మానవ వ్యర్థాలతోపాటు అపోలో 15 వ్యోమగాములు వదిలిన అల్యూమినియంతో చేసిన జ్ఞాపికల వంటివన్నీ ఇక్కడే ఉండిపోయాయి. అప్పట్లో జాబిల్లిపై చేరిన వ్యోమగాములు అక్కడ గోల్ఫ్‌ ఆడారు. ఆ తరువాత గోల్ఫ్‌ బంతులతోపాటు ఇతర సామగ్రిని కూడా అక్కడే వదిలేశారు. భూమి చుట్టూ అంతరిక్షంలో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్‌ చెత్తకు జాబిల్లి ఉపరితలంపై ఉన్న చెత్త అదనం అన్నమాట!

మరిన్ని వార్తలు