పరి పరిశోధన

17 Mar, 2018 01:45 IST|Sakshi

ఈ త్రీడీ ప్రింటెడ్‌ ఇంటి ధర రూ. 2.5 లక్షలే!

త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో చిన్న వస్తువులను తయారుచేసుకోవచ్చునని చాలాకాలంగా తెలుసుగానీ.. ఇళ్లను ప్రింట్‌ చేసుకునే విషయం మాత్రం ఇంకా ప్రయోగ దశలోనే ఉంది అనుకునేవారు. ఈ అంచనాలను తారుమారు చేస్తూ అమెరికాకు చెందిన ఐకాన్‌ అనే కంపెనీ కారు చౌకగా పొందికైన, చిన్న ఇళ్లను కట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రత్యేకమైన కాంక్రీట్‌ మిశ్రమాన్ని పొరలు పొరలుగా పేర్చడం ద్వారా కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ఇంటిని కట్టేయవచ్చునని చూపుతోంది.

ప్రస్తుతం ఎల్‌ సాల్వడోర్, హైతీల్లో ఇలాంటి చౌక త్రీడీ ప్రింటెడ్‌ ఇళ్లను నిర్మిస్తోంది. ఒక్కో ఇల్లు 600  నుంచి 800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే త్రీడీ టెక్నాలజీతో తయారుచేసే ఇంటి నిర్మాణంలో వృథా చాలా తక్కువగా ఉంటుందని, ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

సాధారణ కాంక్రీట్‌ ఇళ్లతో సమానంగా దశాబ్దాలపాటు చెక్కుచెదరకుండా ఉంటాయని కూడా తెలిపారు. పేదలకు చౌకగా ఒక గూడు కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారితోపాటు.. మురికివాడల్లో కనీస సౌకర్యాలు లేకుండా జీవిస్తున్న వారికీ నీడ కల్పించేందుకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు