పరి పరిశోధన

25 Mar, 2018 00:42 IST|Sakshi

తిండి తగ్గిస్తే వయసుతోపాటు వచ్చే వ్యాధులు తగ్గుతాయి!
లంఖణం పరమౌషధం అని పెద్దలు ఊరకే అనలేదు. అప్పట్లో అందరూ ఈ విషయాన్ని కొట్టిపారేసినా.. తాజా పరిశోధనలు ఇంకోసారి ఉపవాసం లేదా తక్కువ ఆహారం తీసుకోవడంతో వచ్చే ప్రయోజనాలను రూఢి చేస్తున్నాయి. విషయం ఏమింటే.. అమెరికాలోని పెన్నింగ్టన్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేలరీలు తగ్గిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది! దాదాపు రెండేళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో ఊబకాయులు కాని వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారు.

వీరిలో కొందరికి ఆహారం ద్వారా అందే కేలరీలను 15 శాతం తక్కువ చేశారు. రెండేళ్ల తరువాత పరిశీలిస్తే.. వీరందరి బరువు సగటున తొమ్మిది కిలోల వరకూ తగ్గింది. తిండి తగ్గినా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. బదులుగా వీరందరూ ఉల్లాసంగా ఉన్నారు. కేలరీలు తగ్గినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గించడంతోపాటు జీవక్రియల వేగం కూడా మందగించినట్లు తెలిసింది.

జీవక్రియల వేగం తగ్గడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. శరీరం అందుబాటులో ఉన్న శక్తిని అత్యంత సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వయసు తొందరగా మీదపడదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రైడ్‌మన్‌ తెలిపారు. కేలరీలు పెరిగినప్పుడు ... కొవ్వులు, ప్రొటీన్లు, డీఎన్‌ఏలకు ఆక్సిజన్‌ చేరడం ద్వారా ఫ్రీరాడికల్స్‌ ఉత్పత్తి ఎక్కువవుతుందని, వీటివల్ల కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు, కీళ్లవాతం వంటివి వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


పశువ్యర్థాలతో కాగితం..
కాగితం తయారీ కోసం చెట్లు నరికేస్తున్నారంటే అందరూ అయ్యో అనుకుంటారు. మరో గత్యంతరం లేదు కాబట్టి సరిపుచ్చుకుంటాం కూడా. వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సాకూ లేకుండా పోతోంది. ఎందుకంటే.. వీరు పశువ్యర్థాల నుంచే తెల్లటి కాగితాన్ని తయారు చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ‘‘పశువులు సెల్యులోజ్‌తో కూడిన గడ్డిగాదం తింటూ ఉంటాయి.

ఈ ఆహారం వాటి కడుపుల్లో ఎంజైమ్‌లు, ఆమ్లాలతో చేరి.. వ్యర్థాలుగా విసర్జితమవుతూంటాయి. ఈ వ్యర్థాల్లో కాగితం తయారీకి ఉపయోగపడే సెల్యులోజ్‌ దాదాపు 40 శాతం వరకూ ఉంటుంది. దీన్ని తేలికగా వేరు చేయవచ్చు కూడా’’ అని వివరించారు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఆలెగ్జాండర్‌ బిస్మార్క్‌. ఆవు పేడతోపాటు ఏనుగులు, గుర్రాల వ్యర్థాలతోనూ తాము ప్రయోగాలు చేసి.. కాగితం తయారీకి చౌకైన పద్ధతిని అభివృద్ధి చేశామని వివరించారు.

సోడియం హైడ్రాక్సైడ్‌తో కలిపినప్పుడు వ్యర్థాల్లోంచి అవసరం లేని వాటిని తీసేయవచ్చునని మిగిలిన పదార్థాన్ని సోడియం హైపోక్లోరైట్‌తో బ్లీచ్‌ చేస్తే తెల్లదనం వస్తుందని.. దాన్ని కాగితం తయారీకి వాడుకోవచ్చునని అంటున్నారు ఈయన. ఈ పద్ధతిలో మిగిలినపోయిన పదార్థాన్ని ఎరువు, ఇంధనంగా వాడుకునే అవకాశమూ ఉందని.. అంతేకాకుండా.. బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసుకున్న తరువాతే కాగితం తయారీ చేపట్టేందుకూ వీలుందని వివరించారు.
 

మరిన్ని వార్తలు