పరి పరిశోధన

9 Apr, 2018 00:50 IST|Sakshi

జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు కొత్త మార్గం!
వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మనలో అందరికీ ఎదురయ్యే సమస్యే. గుండెపోటుకు గురైనవారు లేదా అల్జీమర్స్, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధుల బారిన పడినవారికీ అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఈ సమస్యలకు ఇప్పటివరకూ కచ్చితమైన పరిష్కారాలు లేవు. అయితే వేక్‌ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తల తాజా ప్రయోగాల పుణ్యమా అని ఇకపై మాత్రం అవసరమైనప్పుడు మెదడు పనితీరును సూపర్‌ చార్జ్‌ చేసుకునేందుకు వీలేర్పడనుంది.

ఎలాగంటారా? చాలా సింపుల్‌. కంప్యూటర్లలో ర్యామ్‌ పెంచుకున్నట్లే మన మెదడులోనూ ఓ చిప్‌లాంటిది ఉంచుకుంటే సరి అంటున్నారు రాబర్ట్‌ హాంప్సన్‌ అనే శాస్త్రవేత్త. ఇలాంటి పరికరాన్ని తాము ఇప్పటికే తయారు చేశామని.. ఇటీవలే కొందరి మెదళ్లలో ఈ పరికరాన్ని అమర్చి విజయవంతంగా పరీక్షలు కూడా పూర్తి చేశామని రాబర్ట్‌ తెలిపారు. అటు షార్ట్‌ టర్మ్‌ మెమరీతోపాటు, ఇటు లాంగ్‌టర్మ్‌ మెమరీ కూడా ఈ పరికరం ద్వారా మెరుగుపడినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని చెప్పారు.

వీడియోగేమ్‌లు ఆడుతున్న కొందరి మెదళ్లను పరిశీలిస్తూ.. హిప్పోకాంపస్‌ ప్రాంతంలో న్యూరాన్లు ఏ పద్ధతిలో చైతన్యవంతం అవుతున్నాయో గుర్తించి అదే పద్ధతిలో పనిచేసే పరికరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. మరిన్ని పరిశోధనలతో ఈ పరికరాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్కువ జ్ఞాపకశక్తిని అందించే యంత్రాల తయారీకి వీలేర్పడుతుందని హాంప్సన్‌ తెలిపారు.
 

నిద్రలేమి.. ఒత్తిళ్లతో ఊబకాయం!
వేళాపాళా లేని తిండి, నిద్ర, రకరకాల ఒత్తిళ్లు... ఆరోగ్యానికి చేటని, బరువు పెరిగేందుకూ కారణమవుతాయనీ తెలుసు. అయితే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా ఇందుకు గల కారణాలను స్పష్టంగా తెలుసుకోగలిగారు. మన శరీరంలో ఒక పద్ధతి ప్రకారం హెచ్చుతగ్గులకు గురయ్యే గ్లూకోకార్టికాయిడ్‌ హార్మోన్లతో ఈ చిక్కులన్నీ వస్తున్నాయని వీరు అంటున్నారు. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ కూడా గ్లూకో కార్టికాయిడ్‌ హార్మోన్‌ కావడం గమనార్హం.

సాధారణంగా ఈ హార్మోన్లు ఒక రోజులో గరిష్టస్థాయికి చేరి... తగ్గిపోతూంటాయి. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతితక్కువగా... ఉదయం 8 గంటలకు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, ఒత్తిడి లేదంటే కొన్నిరకాల మందుల ద్వారా అప్పుడప్పుడూ ఈ హార్మోన్‌ కొద్ది సమయం పాటు ఎక్కువవుతూంటుంది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే అది కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది.

ఈ నేపథ్యంలో స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపి ఈ హార్మోన్లు 12 గంటల్లోపు అత్యధిక, అత్యల్ప స్థాయిలకు చేరుకుంటే కొవ్వు కణాలు తొందరగా జీర్ణమవుతాయని గుర్తించారు. ఎలుకలకు ఈ హార్మోన్‌ను అందించినప్పుడు సహజమైన ప్రక్రియకు విఘాతం కలిగి కొవ్వు రెట్టింపు అయిందని తెలిసింది. ఈ పరిశోధన బరువు నియంత్రణకు ఉపయోగపడుతుందని అంచనా.
 

పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు
సౌరకుటుంబంతోపాటు కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలకు నెలవైన మన పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు ఉన్నట్లు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలపుంత మధ్యలో సాగిట్టారిస్‌ పేరుతో అత్యంత భారీ కృష్ణబిలం ఉందని చాలాకాలంగా తెలుసు. అయితే దీన్ని గుర్తించేందుకు ఉపయోగించిన పద్ధతిలో కొన్ని మార్పులు చేసి పరిశీలించినప్పుడు ఆ భారీ కృష్ణబిలం పరిసరాల్లో కొన్ని వేల సంఖ్యలో కృష్ణబిలాలు ఉన్నట్లుగా తెలిసింది.

ఇంత పెద్దస్థాయిలో కృష్ణబిలాలను ప్రత్యక్షంగా గుర్తించడం ఇదే తొలిసారి. నేచర్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ ఖగోళశాస్త్రవేత్తలు చేపట్టారు. భారీ కృష్ణబిలం మింగేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు బుల్లి కృష్ణబిలాలు పొరుగునే ఉండే నక్షత్రాలతో లంకె ఏర్పరచుకుంటాయని ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎక్స్‌రే కిరణాలు వెలువడతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛక్‌ హేలీ తెలిపారు.

అయితే పాలపుంత మధ్యలో ఉండే భారీ కృష్ణబిలం చాలా దూరంగా ఉంది కాబట్టి.. ఎక్స్‌ కిరణాలను చూడటం సాధ్యం కాదని చెప్పారు. అందువల్ల తాము చంద్ర వేధశాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఎక్స్‌రే కిరణాలను గుర్తించి భారీ కృష్ణబిలం చుట్టూ చిన్న సైజులో ఉన్నవి పదివేల వరకూ ఉన్నట్లు గుర్తించామని వివరించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు