పరి పరిశోధన

20 May, 2018 01:04 IST|Sakshi

చలికాలంలోనే గుండెపోట్లు ఎక్కువ!
వాతావరణం చల్లబడితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు తైవాన్‌ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెల్సియస్‌ వరకూ ఉన్నప్పుడు ఎక్కువమంది మరణించినట్లు గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పో జూయి వూ తెలిపారు. 2008 – 2011 మధ్యకాలంలో గుండెపోటుకు గురైన 40 వేల మంది వివరాలు.. రెండు ఇతర అధ్యయనాల ద్వారా సేకరించిన పది లక్షల మంది వివరాలను కలిపిపరిశీలించినప్డుపు ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు.

చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురై.. ఆ మరుసటి రోజు చాలామంది గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. చలికాలంలో ఎవరైనా గుండెపోటు తాలూకూ లక్షణాలతో ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. గుండెపోట్లకు.. చలికాలానికి కార్యకారణ సంబంధం ఉందా? లేదా? అన్నది మాత్రం ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. ఆసియా పసఫిక్‌ కార్డియాలజీ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.


ఇన్సులిన్‌ మాత్రలతో సత్ఫలితాలు...
మధుమేహులు తరచూ సూదిమందు తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించే ఇన్సులిన్‌ మాత్రల ప్రభావం బాగానే ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఓరామెడ్‌ అనే సంస్థ అభివద్ధి చేసిన ఈ మాత్రలపై ఇంకో దశ ప్రయోగాలు పూర్తి అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్‌ అందివ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని దశాబ్దాలుగా తెలిసినప్పటికీ ఇలాంటి మాత్రలను తయారు చేయడం ఇప్పటివరకూ వీలుపడలేదు.

కడుపులో ఉండే ఆమ్లాలు ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఓరామెడ్‌ సంస్థ ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించింది. దీంతో ఈ కంపెనీ మాత్రలు చిన్నపేవులను చేరేవరకూ ఇన్సులిన్‌ను విడుదల చేయవు. తొలి రెండు దశల ప్రయోగాల్లో ఈ మాత్రల ప్రభావ శీలతను, భద్రతలను రుజువు చేయగా..  ఇది అందరిలో దాదాపు ఒకేలా పనిచేస్తుందని తెలుసుకునేందుకు ఇంకో దశ ప్రయోగాలు జరిపారు. గతంలో మందు 28 రోజుల పాటు మందు ప్రభావం ఏమిటన్నది గుర్తిస్తే... తాజా ప్రయోగాల్లో 90 రోజులపాటు పరిశీలనలు జరిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ మాత్రలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఓరామెడ్‌తోపాటు కొన్ని ఇతర కంపనీలు కూడా ఇన్సులిన్‌ మాత్రలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.


పొగాకు పూలలో సరికొత్త యాంటీబయాటిక్‌
వ్యాధి కారక బ్యాక్టీరియా మందులకు నిరోధకత పెంచుకుంటున్న ప్రస్తుత తరుణంలో లా ట్రోబ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పొగాకు పూలలో ఉండే ఓ రసాయన మూలకం మెరుగైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందని గుర్తించారు. యాంటీబయాటిక్‌ నిరోధకత ఎక్కువైతే.. ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త యాంటీబయాటిక్‌ మూలకాల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

రకరకాల జంతువులు, సేంద్రీయ ఉత్పత్తుల నుంచి కొత్త యాంటీబయాటిక్‌లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయి. లా ట్రోబ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అలాంటిదాన్ని పొగాకు పూలలో గుర్తించారు. నికోటినా అలాటా అని పిలిచే పొగాకు మొక్క శిలీంధ్రాల దాడిని తట్టుకునేందుకు కొన్ని రసాయలను ఉత్పత్తి చేసుకుంటుందని.. వీటిల్లో ఒకటైన ఎన్‌ఏడీ1 మనుషుల్లో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై కూడా ప్రభావం చూపగలదని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని హ్యులెట్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. హెచ్‌ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ముర్రే రివర్‌ ఎన్‌సెఫిలైటిస్‌ వంటి అనేక వ్యాధులకు ఈ కొత్త యాంటీబయాటిక్‌ ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా.

మరిన్ని వార్తలు