నములుతూ నడిస్తే.. ప్రయోజనమెక్కువ!

27 May, 2018 00:46 IST|Sakshi

వాకింగ్‌ చేస్తూ బబుల్‌ గమ్‌ నములుతూండటం ఆరోగ్యానికి కొంతవరకూ మేలు చేస్తుందని అంటున్నారు టోక్యోలోని వాసెడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్‌గమ్‌ తినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడంతోపాటు శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుందని వీరు అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు తాము 21 – 69 మధ్య వయస్కులతో ప్రయోగం నిర్వహించామని చెప్పారు.

వీరికి రెండు బబుల్‌గమ్స్‌ ఇచ్చి ముందుగా గంటసేపు విశ్రాంతి కల్పించామని ఆ తరువాత పదిహేను నిమిషాలపాటు బబుల్‌గమ్స్‌ నములుతూ నడవమని సూచించామని.. ఇదే సమయంలో ఇంకొంతమందికి బబుల్‌గమ్‌ కాకుండా అదే పదార్థాలతో చేసిన ఇంకో తినుబండారం ఇచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు వివరించారు. రెండు గ్రూపుల్లోని వారిని పరిశీలించినప్పుడు బబుల్‌గమ్‌ తినేవారు నడిచే వేగం, దూరం పెరిగినట్లు గుర్తించామని తెలిపారు.

ఒక్కో అంగలో కొంచెం ఎక్కువ దూరం వేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అలాగే గుండెకొట్టుకునే సగటు వేగం కూడా బబుల్‌గమ్‌ తినేవారిలో కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు. వయసు, స్త్రీయా, పురుషుడా? వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పులేమీ లేకపోవడంతో బబుల్‌గమ్‌లు నములుతూ నడవడం వల్లనే ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు నిర్ధారించుకున్నామని వివరించారు. మధ్యవయసు వారిపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని.. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం వ్యాయామం చేసే వారు మరింత ఎక్కువ ఫలితాన్ని సాధించేందుకు తగిన బబుల్‌గమ్‌ను ఉపయోగించడం ఒక మార్గమవుతుందనేది తమ అంచనా అని చెప్పారు.


ఆవలింతలు.. అంటుకుంటాయా?
చిన్నప్పటి నుంచి చాలాసార్లు విని ఉంటాం.. చూసి ఉంటాం కూడా. ఒకరికి ఆవలింతలు వస్తే చాలు.. చుట్టూ ఉన్న వారు ఒకొక్కరికీ వెంటవెంటనే ఆవలింతలు వచ్చేస్తూంటాయి. ఇది అక్షరాలా నిజమే అయినప్పటికీ ఎందుకిలా జరుగుతుందో మాత్రం ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయని అంటున్నారు టెక్సస్‌ ఏ అండ్‌ ఎమ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన మెరిడిత్‌ విలియమ్‌సన్‌.

బహుశా ఇది మాటల్లేని సమాచార ప్రసారం కావచ్చునని... అందుకే ఇది కేవలం మనుషుల్లోనే కాకుండా కొన్ని రకాల జంతువుల్లోనూ కనిపిస్తూంటుందని వివరించారు. ఇతరులపట్ల సహానుభూతి ఎక్కువగా ఉన్నవారు ఇతరుల ఆవలింతలకు ఎక్కువగా స్పందిస్తూంటారని.. మిగిలినవారు.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం తక్కువగా స్పందిస్తారని ఆమె వివరించారు. అలాగే నాలుగేళ్లలోపు పిల్లలు, వయసుమళ్లిన వారు కూడా ఇతరుల ఆవలింతలకు స్పందించరని చెప్పారు.


మద్యానికి.. గుండెపోటుకు ఇంకో కొత్త లింకు!
అతిగా మద్యం తాగితే జబ్బులు గ్యారెంటీ. మిగిలిన వాటి సంగతేమోగానీ.. గుండెజబ్బుల విషయంలో మాత్రం మద్యంతోపాటు మన శరీరంలో ఉండే ఓ జన్యువు కీలకపాత్ర పోసిస్తున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. టిటిన్‌ అని పిలిచే ఈ జన్యువు గుండె కండరం సంకోచ వ్యాకోచాలు సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని.. మద్యం తాగినప్పుడు మాత్రం ఈ జన్యువు సక్రమంగా పనిచేయకుండా గుండెజబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఆల్కహాలిక్‌ కార్డియో మయోపతీ వ్యాధికి గురైన కొంతమందిపై తాము పరిశీలన జరిపినప్పుడు టిటిన్‌ పాత్ర గురించి తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ జేమ్స్‌ వేర్‌ తెలిపారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం వారానికి 70 కంటే ఎక్కువ యూనిట్ల వైన్‌ తాగే వారికి ఆల్కహాలిక్‌ కార్డియో మయోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతూ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ మారుతుందని జేమ్స్‌ చెప్పారు. తాము పరిశీలించిన వారిలో దాదాపు 13.5 శాతం మందిలో టిటిన్‌ జన్యువు మార్పులకు గురైనట్లు తెలిసిందని వివరించారు.

దీన్నిబట్టి మద్యం జన్యువులపై ప్రభావం చూపుతుందని మరింత స్పష్టంగా అర్థమవుతోందని.. ఒకవేళ ముందుగానే కొన్ని జన్యుమార్పులున్న వారు మద్యానికి బానిసలైతే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువవుతాయన్నది తమ పరిశోధనల సారాంశమని తెలిపారు. ఆల్కహాలిక్‌ కార్డియో మయోపతి వ్యాధికి గురైన వారి కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని మరోసారి బేరీజు వేసుకోవాలని... జన్మతహా టిటిన్‌ జన్యువులో మార్పులు ఉంటే వీరు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు