ఊబకాయంతో నష్టమా? లాభమా?

29 May, 2018 00:02 IST|Sakshi

బరువు పెరిగినకొద్దీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి చుట్టుముడతాయని తరచూ వింటూ ఉంటాం. అందుకే బరువు తగ్గించుకునేందుకు నానా తంటాలూ పడుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో అవసరం కంటే ఎక్కువ బరువు ఉండటం లాభదాయకమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 15 ఏళ్ల క్రితం కిడ్నీ సమస్యలతో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారి వివరాలు సేకరించినప్పుడు విచిత్రమైన అంశం ఒకటి బయటపడింది.

ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటే.. ఊబకాయుల్లో అది తక్కువగా ఉంది. ఈ ఊబకాయ వైచిత్రిని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు పదేళ్లకుపైగా సమయం పట్టింది. ఒక్క కిడ్నీ సమస్యలకు మాత్రమే కాకుండా కొన్ని ఇతర వ్యాధుల విషయంలోనూ ఊబకాయం పాజిటివ్‌ ఫలితాలిస్తున్నట్లు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నెదర్లాండ్స్‌లో సాధారణ సాంక్రమిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన దాదాపు 18 వేల మందిని పరిశీలించినప్పుడు ఇతరులతో పోలిస్తే ఊబకాయులు ఎక్కువకాలం జీవించినట్లు తెలిసింది.

నుమోనియా, సెప్పిస్‌ వంటి విషయాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వెలువడటం గమనార్హం. వీటన్నింటిని బట్టి శాస్త్రవేత్తలు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. శరీరం తీవ్రంగా వ్యాధిగ్రస్తమైనప్పుడు అది అదనపు ఇంధనం కోసం ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలో తగినంత బరువు మాత్రమే ఉండేవారి కండరాలు బలహీనపడిపోతే.. ఊబకాయుల్లో మాత్రం ఇది చాలా తక్కువగా జరుగుతూంటుందని ఫలితంగా వారు బతికేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడుతూండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఫోన్లు, ట్యాబ్లెట్లతో నిద్రకు చేటే...
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను పొద్దుపోయేంత వరకూ తెగ వాడేస్తున్నారా? అయితే మీకు నిద్రకు చేటు వచ్చినట్లే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని వినే ఉంటాంగానీ.. తాజాగా హార్వర్డ్‌లోని బోస్టన్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఇంకో అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. ట్యాబ్లెట్లను ఇష్టమొచ్చినట్లు వాడుకొమ్మని చెప్పి కొంతమంది యువకుల నిద్రతీరును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త అంశాలు తెలిశాయి.

ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే శక్తిమంతమైన తెల్లటి వెలుగు మెలటోనిన్‌ రసాయన ఉత్పత్తిని తగ్గించిందని ఈ అధ్యయనానికి నేతత్వం వహించిన శాస్త్రవేత్త జీనీ డుఫీ తెలిపారు. స్క్రీన్స్‌ను దగ్గరగా ఉంచుకోవడం వల్ల తెల్లటి వెలుగు మన జీవ గడియారంపై దుష్ప్రభావం చూపుతుందని ఫలితంగా తగినంత నిద్ర పట్టదని జీనీ అంటున్నారు.

ట్యాబ్లెట్లను విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఇచ్చిన తరువాత కొన్ని రోజులకు తాము వారిని మరోసారి పరీక్షించామని.. ఈసారి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు ఏవీ ఇవ్వకుండా కేవలం వార్తాపత్రికలు చదివేందుకు మాత్రమే అవకాశమిచ్చామని.. అప్పుడు వారు సుఖంగా నిద్రపోయినట్లు తెలిసిందని చెప్పారు. పడుకునే ముందు ట్యాబ్లెట్లు వాడే వారిలో మెలటోనిన్‌ ఉత్పత్తి కనీసం అరగంట తరువాత మాత్రమే జరుగుతున్నట్లు తెలిసిందని, పైగా నిద్రలోంచి మేల్కొన్న తరువాత గంట సేపటి వరకూ వారు చురుకుగా ఉండలేకపోయారని జీనీ వివరించారు. 

మరిన్ని వార్తలు