ఇన్సులిన్‌ మాత్రలు వచ్చేస్తున్నాయి..

30 Jun, 2018 02:48 IST|Sakshi

మధుమేహులకు.. మరీ ముఖ్యంగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటున్న వారికి ఓ శుభవార్త. సూది మందు బాధలు త్వరలో తొలగిపోనున్నాయి. ఎలాగంటారా? సూదులకు బదులుగా మాత్రల ద్వారా ఇన్సులిన్‌ను అందించేందుకు రంగం సిద్ధమవుతోంది కాబట్టి! నోటి ద్వారా ఇన్సులిన్‌ను అందించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రొటీన్‌ కడుపులోని ఆమ్లాల ధాటికి తట్టుకోలేకపోవడం, పేగుల నుంచి శరీరానికి తగినంత స్థాయిలో శోషణ జరగకపోవడం కారణంగా ఇవి విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో హార్వర్డ్‌ జాన్‌ ఎ.పాల్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు ఇన్సులిన్‌ను నేరుగా కాకుండా అయానిక్‌ ద్రవం రూపంలో అందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తించారు.

కోలీన్, జెరానిక్‌ యాసిడ్లతో కలిపిన అయానిక్‌ ఇన్సులిన్‌ను యాసిడ్లను తట్టుకోగల పదార్థంతో తయారైన క్యాప్సూల్‌లో ఉంచి ఇవ్వడం వీరు అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి. ఈ రకమైన మాత్రల తయారీ సులువుగానే జరిగిపోతుందని, రెండు నెలల వరకూ నిల్వ ఉంచేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిత్రాగోత్రి తెలిపారు. కడుపులోని ఆమ్లాలను తట్టుకుని పేగుల్లోకి ప్రవేశించే ఈ మాత్ర అక్కడ మాత్రం కొన్ని ఎంజైమ్‌ల కారణంగా కరిగిపోతుందని వివరించారు. జెరానిక్‌ యాసిడ్ల కారణంగా పేగుల్లోంచి రక్తంలోకి చేరడం సులువవుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు