భూతాపోన్నతి ప్రభావంపై కొత్త అంచనా...

9 Jul, 2018 01:41 IST|Sakshi

భూతాపోన్నతి ప్రభావం ఇప్పటి అంచనాలకు రెట్టింపు స్థాయిలో ఉండవచ్చునని అంచనా వేస్తోంది న్యూసౌత్‌ వేల్స్‌ శాస్త్రవేత్తల అధ్యయనం. వాతావరణంలో కాలుష్య వాయువుల మోతాదు పెరిగి ఈ శతాబ్దం అంతానికి భూమి సగటు ఉష్ణోగ్రత  రెండు డిగ్రీల సెల్సియస్‌కే పరిమితమైనప్పటికీ సముద్రమట్టాలు ఏకంగా ఆరు మీటర్ల వరకూ పెరుగుతాయని నేచర్‌ జియోసైన్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం చెబుతోంది. దాదాపు 17 దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం భూమి గత చరిత్ర ఆధారంగా జరిగింది.

సుమారు 450 కోట్ల ఏళ్ల వయసున్న భూమిపై గత 35 లక్షల సంవత్సరాలలో కనీసం మూడుసార్లు భూమి చెప్పుకోదగ్గ స్థాయిలో వేడెక్కిందని అంచనా. పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ పెరుగుదల ఇది 0.5 డిగ్రీ సెల్సియస్‌ నుంచి రెండు డిగ్రీల వరకూ ఉండేదని అంచనా. ధ్రువప్రాంతాల్లోని భారీ మంచు శకలాలు కరిగిపోతే జీవావరణ వ్యవస్థలో వచ్చే మార్పుల ఫలితంగా ఇప్పటివరకూ ఎడారిగా ఉన్న సహారా ప్రాంతం పచ్చగా మారవచ్చునని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది.

భూతాపోన్నతిని రెండు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే లక్ష్యంతో ప్రపంచదేశాలు చేసుకున్న ప్యారిస్‌ ఒప్పందం అమలుకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని.. ఫలితంగా ఉష్ణోగ్రతలు నిర్ణీతస్థాయిలో మాత్రమే పెరిగినా పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలన్‌ మిక్స్‌ అంటున్నారు.

దుష్ప్రభావాల్లేని మందులు వచ్చేస్తున్నాయి
కడుపునొప్పికి మందేసుకుంటే మలబద్దకం లాంటి దుష్ప్రభావాలు కనిపించడం... ఈ కొత్త సమస్యకు ఇంకో మాత్ర వేసుకోవడం ఈ రోజుల్లో సహజమైపోయింది. వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్త జూలియస్‌ ఝూ పరిశోధనలు ఫలిస్తే ఈ ఇబ్బందులన్నీ మాయమవుతాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేసే సరికొత్త మందులను తయారు చేసేందుకు ఈయన ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు మనం వాడే మందులు కణాల్లోపలి భాగాలను గంపగుత్తగా అడ్డుకుంటాయనీ, దాంతో తగిన ఫలితం లేకుండా పోతోందని ఝూ వివరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము నిర్దిష్టమైన ప్రాంతంలో నిర్దిష్టంగా పనిచేసే కణభాగాలు మాత్రమే లక్ష్యంగా పనిచేసే మందులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేన్సర్లతోపాటు నాడీ సంబంధిత వ్యాధులకు తాము అభివృద్ధి చేస్తున్న మందులు ఎంతో ఉపయోగపడతాయని, వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు. పరిశోధన వివరాలు సైంటిఫిక్‌ జర్నల్‌ ‘న్యూరాన్‌’లో ప్రచురితమయ్యాయి.

రోగనిరోధక వ్యవస్థ కీలకం తెలిసింది..
రోగనిరోధక వ్యవస్థ తాలూకూ కీలకమైన రహస్యాన్ని సౌత్‌వెస్ట్‌ర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఛేదించారు. డీఎన్‌ఏను గుర్తించగల ఒక ఎంజైమ్‌ చిన్న చిన్న నీటిచుక్కలాంటి నిర్మాణాలుగా మారిపోయి బయో రియాక్టర్ల మాదిరిగా పనిచేస్తాయనీ, దాంతో రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమై సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లపై దాడి చేయడం మొదలవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ జిఝాన్‌ జేమ్స్‌ చెన్‌ తెలిపారు.

జర్నల్‌ ‘సైన్స్‌’ లో ప్రచురితమైన ఈ పరిశోధన ఫలితంగా మధుమేహం, కీళ్లవాతం వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతోపాటు కేన్సర్‌కు కూడా మెరుగైన చికిత్స లభించే అవకాశం ఉంది. ఈ రకమైన వ్యాధులన్నింటిలోనూ సొంతది లేదంటే బ్యాక్టీరియా, వైరస్‌ల డీఎన్‌ఏ కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. సైక్లిక్‌ జీఎంపీ–ఏఎంపీ అని పిలిచే ఎంజైమ్‌ ఒక సెన్సర్‌లా పనిచేస్తుందని చెన్‌ ఆరేళ్ల క్రితమే గుర్తించారు.

సూక్ష్మజీవుల లేదంటే మార్పులతో కూడిన డీఎన్‌ఏ కణాల్లో ఉండకూడని చోట కనిపిస్తే ఈ ఎంజైమ్‌ వెంటనే స్పందిస్తుంది. సీజీఏఎంపీ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది కాస్తా శరీరంలో ఉండే ఒక రకమైన రోగనిరోధక వ్యవస్థ (ఇన్నేట్‌ ఇమ్యూనిటీ)కి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ఎంజైమ్‌ కాస్తా డీఎన్‌ఏపోగుకు అనుసంధానమై చిన్న నీటిచుక్కల్లా ఏర్పడి సీజీఏఎంపీని ఉత్పత్తి చేస్తుందని చెన్‌ తాజా పరిశోధన ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు