భూమి లోపల వజ్రాల కొండ!

23 Jul, 2018 02:07 IST|Sakshi

భూమ్మీద ఉన్న వజ్రాల పరిమాణమెంతో తెలుసా? ఊహూ.. ఇప్పటికే తవ్వి తీసింది.. నగల రూపంలో ఉన్నవి కాదు. భూగర్భంలో దాక్కుని ఇప్పటివరకూ బయటకు రాని వాటి సంగతి! వందలు, వేలు, లక్షలు కూడా కాదు. ఏకంగా పదివేల లక్షల కోట్ల టన్నులు!! ఇంకోలా చెప్పాలంటే ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట! భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా తెలుసుకున్న తాజా విషయమిది.

మన అడుగున భూగర్భంలో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ధ్వని తరంగాలు వాడతారని మనకు తెలుసు. ఈ తరంగాలు భూమి గుండా ప్రయాణించే క్రమంలో అక్కడ ఉండే రాళ్లను బట్టి వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తాయి. శాస్త్రవేత్తలు ఈ తేడాలను గుర్తించి అక్కడ ఏముందో అంచనా వేస్తారు. అయితే భూమ్మీద ఒక ప్రాంతంలో మాత్రం శాస్త్రవేత్తల అంచనాలు తారుమారయ్యాయి.

సుమారు 320 కిలోమీటర్ల లోతుల్లో ఉండే ఈ భారీ రాతి పలకల ప్రాంతంలో ఏముందో తెలుసుకోవడానికి... ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా త్రీడీ మోడళ్లు తయారు చేశారు. ఆ ప్రాంతంలో ధ్వని తరంగాలను పరిశీలించి.. దానికి దగ్గరగా ఏ రకమైన రాళ్లు ఉన్నాయో పరిశీలించినప్పుడు అవి వజ్రాలని తేలింది. భూగర్భంలో ఉండే భారీ రాతి ఫలకాల ప్రాంతం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అక్కడ ఉండే వజ్రాల పరిమాణం ప్రస్తుతం అందుబాటులో ఉన్నదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉండవచ్చు.

నానో గుళికలతో వ్యాధులకు చికిత్స!
కేన్సర్‌ చికిత్సకు మానిజ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేన్సర్‌ చికిత్సకు వాడే మందులకు సూక్ష్మస్థాయి గుళికలు (నానోస్థాయి) సిద్ధం చేసి వాటిని శరీర రోగ నిరోధక వ్యవస్థ కణాలతో జోడించేలా చేయగలిగితే అవి నేరుగా కణితిపై దాడి చేస్తాయని వీరు అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలతో పోలిస్తే ఈ కొత్త పద్ధతి వల్ల ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగదని అంచనా.

భవిష్యత్తులో ఈ పద్ధతిని కేన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చునని, తద్వారా మందులతో వచ్చే దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వోల్కర్‌ మెయిలిండర్‌ తెలిపారు. మనిషి వెంట్రుకలో వెయ్యోవంతు మందం ఉండే నానో మందుల గుళికల ద్వారా వ్యాధికి చికిత్స అందించే స్థాయిలో మందులు చేర్చగలమని, ఈ గుళికల పైభాగానికి ప్రత్యేకమైన పూత పూసి రోగ నిరోధక కణాలకు అతుక్కునేలా చేయడం ఈ పద్ధతిలో కీలకమని చెప్పారు. పరిశోధన వివరాలు నేచర్‌ నానోటెక్నాలజీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

సూర్యుడిపైకి పార్కర్‌ ఉపగ్రహం!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెలలో సూర్యుడిపైకి ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. కోటానుకోట్ల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ఉపగ్రహం సూర్యుడి ఉపరితలానికి దగ్గరగా వెళుతుందని నాసా అంటోంది. మరి... సూర్యుడిపైన దుర్భరమైన వేడిని తట్టుకుని ఉపగ్రహం ఉపరితలాన్ని తాకడం ఎలా? ఇలా జరక్కుండా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు వేడి.. ఉష్ణోగ్రతలను అర్థం చేసుకోవాలి.

మామూలుగానైతే ఇవి రెండూ ఒకటే అనిపిస్తుంది. కానీ అంతరిక్షంలో ఉష్ణోగ్రత వేల డిగ్రీల సెల్సియస్‌ ఉన్నప్పటికీ వేడి మాత్రం ఆ స్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కణాలు ఎంత వేగంగా కదులుతాయన్న అంశంపై ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. వేడి మాత్రం ఎంత శక్తి ఉత్పత్తి అయిందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.

అంతరిక్షంలో కణాలు వేగంగా కదులుతున్నా శక్తి ఉత్పత్తి, సరఫరా తక్కువ కాబట్టి వేడి తక్కువ. సూర్యుడిపైకి ప్రయోగించే పార్కర్‌ ఉపగ్రహంపై ప్రత్యేకమైన పదార్థపు పూత ఉంటుంది. ఇది ఎనిమిది అడుగుల వెడల్పు, నాలుగున్నర అంగుళాల మందం ఉంటుంది. అతి తేలికగా ఉండటం, ప్రత్యేకమైన పదార్థంతో తయారవడం వల్ల పార్కర్‌ ఉపగ్రహం సూర్యుడిపై వేడిని తట్టుకోగలదని అంచనా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా