ఆర్థరైటిస్‌కూ వ్యక్తిగత వైద్యం...

21 Mar, 2018 00:57 IST|Sakshi

కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌)కు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు నార్త్‌ వెస్టర్న్‌ మెడిసిన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జన్యుక్రమం ఆసరా తీసుకున్నారు. వ్యక్తి జన్యుక్రమానికి అనుగుణంగా వారికి కీళ్లవాతం మందులు తయారుచేసి ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇస్తున్న మందులు చాలామందిలో ఏ మాత్రం ప్రభావం చూపవన్న సంగతి తెలిసిందే. కీళ్ల వాతానికి ప్రస్తుతం చాలా మందులు అందుబాటులో ఉన్నాయనీ.. అయితే ఒక్కోదాన్నీ 12 వారాల పాటు వాడిన తరువాతే అది పనిచేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుందనీ.. ఒకవేళ పనిచేయకపోతే డాక్టర్లు వెంటనే మరో మందు పేరు రాస్తారనీ.. ఇది కూడా పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదనీ పెర్ల్‌మ్యాన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

ఈ నేపథ్యంలో తాము ఒక అధ్యయనం నిర్వహించామని, కొంతమంది బాధితుల జన్యుక్రమాలను విశ్లేషించామని చెప్పారు. సాధారణ మందులతో మంచి ఫలితాలు సాధించిన వారి జన్యువులతో పోల్చి అవే మందులు ఇచ్చినప్పుడు వీరిలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ అధ్యయనం ఆధారంగా జన్యుమార్పులకు అనుగుణంగా మెరుగైన ఫలితాలిచ్చే మందులను గుర్తించగలిగామని, త్వరలో కీళ్లవాతం ఉన్న వారందరికీ ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు.  

మరిన్ని వార్తలు