కేన్సర్‌ పంట!

3 Apr, 2018 03:46 IST|Sakshi
ఈడిగపల్లె చిలకావారిపల్లెలో టమాటా పొలం

ఒకే పంచాయతీలో ఏడాదిలో 15 మంది రైతులు కేన్సర్‌తో మృత్యువాత

సూచించిన దానికన్నా 5 రెట్లు ఎక్కువ పురుగుమందులు చల్లటమే కారణమంటున్న అధికారులు

అన్నదాతలు కోటి ఆశలతో పంట పెడతారు. ఆరుగాలం అష్టకష్టాలూ పడి పంట పండిస్తారు. చీడపీడల నుంచి రక్షణకు పురుగు విషాలు పిచికారీ చేస్తారు. కాలంతోపాటు పురుగుల్లోనూ మార్పొచ్చింది..వాటిని మట్టుబెట్టడానికి ఒకటికి పదిసార్లు ‘సిస్టమిక్‌’ విషాలు చల్లుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే..  ఉన్న నాలుక పోతోంది.

పురుగు విషాలు పచ్చని పల్లెల గాలిని, నీటిని, భూమిని విష కాసారాల్లా మార్చేస్తున్నాయి. రైతులు పంటల మీద చల్లుతున్న విషరసాయనాలు కేన్సరై వారినే కాటేస్తున్నాయి..  చిత్తూరు జిల్లా ఈడిగపల్లె పంచాయతీ గ్రామాల్లో కేన్సర్‌ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. గత ఏడాదిలోనే 15 మంది చనిపోయారు. చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కేన్సర్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ భయానక పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

ఈడిగపల్లె పంచాయతీ చిత్తూరు–మదనపల్లె హైవేలో ఉంది. అక్కడి భూములు సారవంతమైనవే. గత ముప్పయ్యేళ్లుగా టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజి, వరి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈడిగపల్లె పంచాయతీలోని చిలకావారిపల్లె, ఆవులోళ్లపల్లె, నేతిగుట్లపల్లె, యర్రగుంట్లపల్లె తదితర గ్రామాల్లో కేన్సర్‌ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది.

గత ఏడాది కాలంలోనే రైతు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది మహిళలు, పురుషులు కేన్సర్‌ కారణంగా చనిపోయారు. పదుల సంఖ్యలో బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. 80–90 ఏళ్లు వరకు ఆరోగ్యవంతులుగా జీవించిన పల్లెవాసులు నేడు 50–60 ఏళ్లలోపే క్యాన్సర్‌ బారిన పడి నేలరాలుతున్నారని కొందరు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

ప్రమాదకరంగా పురుగుమందుల పిచికారీ
అధికారులు, శాస్త్రవేత్తల సూచనలకు నాలుగైదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేయడం వరకూ వెళ్లింది. అంతకన్నా ప్రమాదకరమైన సంగతేమిటంటే.. పురుగుమందులు పిచికారీ చేసే టప్పుడు ఒక్కరు కూడా ముఖానికి గుడ్డ కూడా అడ్డం కట్టుకున్నట్లు కనపడలేదు. ఈ గ్రామాల్లో రైతులు సాధారణంగా 4–7 రోజుల వ్యవధిలో ఒక సారి పురుగుమందు పిచికారీ చేయిస్తుంటారు. మొత్తం పంట కాలంలో 15–20 సార్లు పిచికారీ చేస్తున్నట్లు అంచనా. టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించడానికి కూడా ప్రత్యేక మందులు పిచికారీ చేస్తున్నట్లు ఒక రైతు చెప్పారు.

టమాటా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు రసాయనిక పురుగుమందుల పిచికారీ కూడా బాగా తక్కువగా కొడతారని ఒక రైతు తెలిపారు. కొందరు రైతులు స్ప్రింక్లర్ల ద్వారా కూడా పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినప్పుడు ఒంటిపై పడకుండా జాగ్రత్తపడే పరిస్థితి కూడా లేదు. చీడపీడలను సహజ పద్ధతుల్లో అదుపులో ఉంచడానికి దోహదపడే అంతర పంటలు, ఎర పంటలు, సరిహద్దు పంటలు వేయడం, ఎర అట్టలు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులు అక్కడ అసలు కనపడలేదు. ఇలా.. పురుగుమందులను ప్రమాదకరంగా వాడటంతోపాటు.. అధిక రసాయనిక అవశేషాలతో కూడిన కూరగాయలనే వారూ తింటున్నారు.  

ఎకరానికి 20 బస్తాలకు పైగా ఎరువులు..
కర్ర ఊతం లేకుండా టమాటా సాగు చేసే రైతులు కూడా ఎకరానికి రూ. 60 వేలు ఖర్చు పెట్టి.. 10 వేల నుంచి 15 వేల కిలోల వరకు దిగుబడి తీస్తున్నారు. స్టేకింగ్‌(కర్ర ఊతం) పద్ధతిలో ఏకపంటగా, మల్చింగ్‌ షీట్‌ వేసి, డ్రిప్‌తో టమాటా సాగు చేస్తున్నారు. అధికోత్పత్తి సాధించే లక్ష్యంతో ఎకరానికి 20 నుంచి 50 బస్తాల(బస్తా 50 కిలోలు) వరకు రసాయనిక ఎరువులు వేస్తున్నట్లు తెలిసింది. ఎకరానికి 25 వేల కిలోల నుంచి 30 వేల కిలోల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఎరువులు, పురుగుమందులతో కలుపుకొని ఎకరానికి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

పిచికారీ చేసే రసాయనాలలో కేవలం 8 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుందని అంచనా. మిగిలిన 92 శాతం పురుగుమందు గాలిలో, నీటిలో, భూమిలో కలిసి మనం తినే ఆహారం, పీల్చే గాలిలో ప్రకృతిలో కలిసిపోయి.. ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజల వినాశనానికే దారి తీస్తున్నది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం రెండు, మూడు పంటలు కలిపి మిశ్రమ సేద్యం చేసేవారు. 15 ఏళ్ల నుంచి అయితే టమాటా లేదా కాళీఫ్లవర్‌ వంటి ఏదో ఒకే పంటను మాత్రమే సాగు చేస్తున్నారు.

అప్పటి నుంచి ‘సిస్టమిక్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌’ విచ్చలవిడిగా చల్లుతున్నారని మదనపల్లెకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్‌ ‘సాక్షి’తో చెప్పారు. బూడిద, పుల్లటి మజ్జిగ, గోమూత్రంతో కషాయాలు వాడుతుంటే చీడపీడల సమస్య ఉండటం లేదన్నారు. తాము సూచించిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.నీటిని, గాలిని, భూమిని విషపూరితం చేసి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. రైతులు మొదట తాము తినే పంటలనైనా సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవడంపై దృష్టిపెట్టడం అత్యవసరమని సూచిస్తున్నారు.

మా ఇంట్లో ముగ్గురికి కేన్సర్‌ వచ్చింది..
మా ఇంటిలో అమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న ముగ్గురూ కేన్సర్‌ వ్యాధికి గురయ్యారు. అమ్మ 7 నెలల క్రితం చనిపోయింది. చిన్నాన్న, పెద్దనాన్న చికిత్స తర్వాత కోలుకున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది క్యాన్సర్‌ వ్యాధితో మరణించారు. టమాటా, కాళీఫ్లవర్, వరి తదితర పంటలు పదెకరాల్లో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు ఎకరానికి 10–15 బస్తాల వరకు వేస్తాం. పురుగుమందులు దండిగానే చల్లుతున్నాం. ఈ పంటలనే మేము కూడా తింటున్నాం. పంటలు పండించడం మాత్రమే మాకు తెలుసు. దీని వల్ల ప్రాణాలు తీసే వ్యాధులు వస్తాయన్న విషయం తెలియదు.

రామకృష్ణారెడ్డి (కిట్టు), చిలకావారిపల్లె, చిత్తూరు జిల్లా

పురుగుమందులు తప్పనిసరి..
మా పంచాయతీలో ఏ పంటకైనా తప్పక రసాయనిక పురుగుమందులు స్ప్రే చేయాల్సిందే. టమాటా, కాళీఫ్లవర్‌ పంటకు 15 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో పది రోజులకోసారి తప్పకుండా చేస్తుంటాం. చీడపీడలు నివారించేందుకు ఇంతకంటే వేరే మార్గం లేదని ఇక్కడి రైతుల అభిప్రాయం. సేంద్రియ వ్యవసాయం గురించి ఇక్కడెవరికీ తెలియదు.

బాలకృష్ణారెడ్డి, ఈడిగపల్లె, చిత్తూరు జిల్లా

5 రెట్లు ఎక్కువగా పురుగుమందులు..
వ్యవసాయంలో పరిమితి కన్నా ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటంతో దుష్పరిణామాలు తప్పవు. ఒకవేళ ఎరువులు మోతాదుకు మించితే భూమిలో కరిగిపోతాయి. పురుగు మందులు అలా కాదు. గాలిలో, నీటిలో కలవడం, కూరగాయలపై వాటి అవశేషాలు అలాగే ఉంటాయి. అందువల్ల హానికలుగుతుంది. రైతులు రేపు, ఎల్లుండి మార్కెట్‌కు తరలించే కూరగాయలపై సైతం పురుగుల మందులు పిచికారీ చేయడం మంచిది కాదు. కేవలం పురుగులు, చీడపీడీలు ఆశించినపుడు తప్ప అదేపనిగా ఐదు రెట్లు ఎక్కువగా పంటలకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. పంట తెగుళ్లు, చీడపీడలు ఆశిస్తుందేమోనని ముందుజాగ్రత్తగా పురుగుల మందులను విపరీతంగా స్ప్రే చేయడంతోనే అనర్థాలు సంభవిస్తున్నాయి.

– సుధాకర్, వ్యవసాయ విస్తరణాధికారి, పుంగనూరు

పురుగుమందుల వల్ల కేన్సర్లు..
ఈడిగపల్లె పరిసర ప్రాంతాల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, అవగాహన రాహిత్యంతో పురుగుల మందులు  స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. గాలి ద్వారా పీల్చడం వల్ల గొంతు కేన్సర్‌ రావచ్చు. ఆడవారికి బ్రెస్ట్, సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. రైతులు,  పొలం పనులపై వెళ్లే రైతు కూలీలు వక్కలతో పాటుగా దుగ్గు, గుట్కా వాడటం క్యాన్సర్‌కు కారకం కావచ్చు.

– డా. పవన్‌కుమార్,  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ముడిపాపనపల్లె

– సురమాల వంశీధర్, సాక్షి, మదనపల్లి   

మరిన్ని వార్తలు