సహానుభూతి

13 Mar, 2014 22:32 IST|Sakshi
సహానుభూతి

‘‘మరీ అంతగా నెత్తిన పెట్టుకున్నారేం?’’
 గతవారం ‘దైవికం’ చదివిన వారిలో కొందరు ‘సాక్షి’కి ఫోన్ చేసిన అడిగిన ప్రశ్న ఇది. స్త్రీకి దైవత్వాన్ని ఆపాదించడం కూడా దైవదూషణే అవుతుందని వారు ఈ కాలమిస్టును ఆత్మీయంగా హెచ్చరించారు. ధన్యవాదాలు. అయితే ఒక సందేహం. స్త్రీకి కనీస గౌరవాన్ని, కనీస సౌకర్యాన్ని ఇవ్వకపోవడం దైవదూషణ అనిపించుకోదా?! ఇవన్నీ వాదనలతో తేలేవీ, తెలిసేవీ కాదు. కవి శివారెడ్డిలా స్త్రీ హృదయంలోకి ప్రవేశించాలి. అప్పుడిన్ని సందేహాలు రావు.
 
అయితే- ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ, ‘‘ఆఫీస్‌కి క్యారేజీ రెడీ చేశావా, రాత్రికేం చేస్తున్నాం’’ అని అడిగినంత తేలికా... స్త్రీ హృదయంలోకి ప్రవేశించడం? కానే కాదు. మగపుట్టుక కదా! అన్నీ వేర్వేరు. లోపలి గ్రంధులు, నరాలు, నాళాలు. ఆ స్ట్రక్చర్, ఆ థాట్స్ అన్నీ డిఫరెంట్. మానవుడిగా పుట్టి దైవసాక్షాత్కారానికి యోగ్యత సాధించడం ఎంత కష్టమో, స్త్రీని మగవాడు అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం! ఇక మనం చేయగలిందేమైనా ఉందా అంటే స్త్రీల అసౌకర్యాలను అనుభూతి చెందే ప్రయత్నం చెయ్యడం. అది కూడా అయ్యే పని కాదు. చాలా శక్తి కావాలి. ఈ కండలు సరిపోవు. ఈ బుర్రలు సరిపోవు. ఈ చదువులు, సంస్కారాలు కూడా. ఒక సుపీరియన్ హ్యూమన్ బీయింగ్‌గా మగవాడు ఎదగాలి. అప్పుడేమైనా స్త్రీ మనసు మగవాడి మనసుకు అందుతుందేమో!

లైంగిక హింస, లైంగిక దౌర్జన్యం, లైంగిక వేధింపు, లైంగిక అత్యాచారం స్త్రీని ఎంతగా కుంగదీస్తాయో మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ బాధ, ఆ ఆవేదన, ఆ అవమానం ఎలా ఉంటుందో ఎన్ని జన్మలకీ అర్థం కాదు (ఆడజన్మకు తప్ప). బెత్తంతో కొడితే బెత్తానికి బాధ తెలుస్తుందా? రాయి తగిలితే రాయి ‘అమ్మా’ అంటుందా? అలాగే మగజన్మకు నొప్పి తెలియకపోవడంలో వింతేం లేదు. ఎలా మరి? దేనికి ఎలా? అదే, ఆడవాళ్ల బాధను అర్థం చేసుకోవడం ఎలా? ఇదిగో ఈ ప్రశ్న వేశారు కదా, సగం అర్థం చేసుకున్నట్లే. కనీసం అర్థం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి!  
 
స్త్రీల ఆవేదనను, అసౌకర్యాలను అర్థం చేసుకునే ఉద్యమం ఒకటి ప్రస్తుతం బల్గేరియాలో బయల్దేరింది. ‘వాక్ ఎ మైల్ ఇన్ హర్ షూజ్’ అంటూ అక్కడి మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా హై హీల్స్ వేసుకుని నడుస్తూ లైంగిక హింసలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. ‘స్త్రీల ఇబ్బందులేమిటో కొంతలో కొంతైనా అర్థం కావాలంటే, ఆ ఇబ్బందిని అనుభవించాలి తప్ప ఊహించలేం’ అనే విషయాన్ని సింబాలిక్‌గా హై హీల్స్ వేసుకుని మరీ అక్కడి మగవాళ్లు చూపిస్తున్నారు.
 
మొన్న హైదరాబాద్‌లో కూడా ఉమెన్స్ డేకి ఇలాంటిదే ‘అర్థం చేయించే’ ప్రయత్నం ఒకటి జరిగింది. బస్టాపులు, టీ స్టాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు... ఇలా కొన్ని బహిరంగ ప్రదేశాలలో అప్పటికప్పుడు కొంతమంది ఆడవాళ్లు ప్రత్యక్షమై,  మగవాళ్లను వేధించారు. (రోడ్లపై మగాళ్లు ఆడవాళ్లను ఎలాగైతే వేధిస్తారో, సరిగ్గా అలాగే). ఇదో కనువిప్పు కార్యక్రమం. ‘నొప్పంటే ఇలా ఉంటుందిరా బయ్’ అని మగవాళ్లకు తెలియచెప్పడం. ‘మిర్రర్ మాబ్’ పేరుతో ‘హైదరాబాద్ ఫర్ ఫెమినిజం’ సంస్థ సభ్యులు ఇలా కొందరు మగాళ్లని ‘టీజ్’ చేశారు. వేధింపుల నాటకం అయ్యాక వీళ్లు అసలు విషయం చెప్పేవారు. ఆడవాళ్లను హర్ట్ చెయ్యడం హీరోయిజం కాదు అని చిన్నపాటి ప్రసంగం ఇచ్చి, ఇంకోచోటికి వెళ్లేవారు.
 
ఏం జరుగుతుంది ఈ ప్రయత్నాల వల్ల? జరగనవసరం లేదు. జరగకుండా ఆగిపోతే చాలు... స్త్రీలపై ఈ దౌర్జన్యాలు, అఘాయిత్యాలు! స్త్రీ హృదయంలోకి ప్రవేశించే ద్వారాలను కాలితో తన్ని మూసేస్కోవడం మగవాడికి బాగా అలవాటు. ఆ అలవాటును మాన్పించే ఏ చిన్న ప్రయత్నమైనా దైవాన్వేషణ లాంటిదే. ముందు ఒక మెట్టంటూ ఎక్కితే, తర్వాత దేవుడే తన సన్నిధిలోకి రప్పించుకుంటాడు ఎంత నాస్తికుడినైనా!

స్త్రీ హృదయంతో సహానుభూతి చెందడం అంటే దైవసాక్షాత్కారానికి యోగ్యత సంపాదించడమే. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని, ఇరవై ఏళ్లు కళ్లలో పెట్టుకుని, ఆ తర్వాత భాగస్వామిగా జీవితాంతం కనిపెట్టుకుని ఉండే స్త్రీని నెత్తిన పెట్టుకోవడం దైవార్చన అవుతుంది కానీ దైవదూషణ అవుతుందా? చెప్పండి.

మరిన్ని వార్తలు