ప్రశ్నించే ఫటీచర్‌

28 Aug, 2019 08:20 IST|Sakshi
ఫటీచర్‌ సీరియల్‌లోని ఓ సన్నివేశం

ఫటీచర్‌

కొందరు కార్లలో ఎందుకు తిరుగుతారు? కొందరు కటికనేల మీద ఎందుకు పరుండుతారు? కొందరికి తిండి ఎందుకు అరగదు? కొందరి కడుపుల్లో గుప్పెడు మెతుకులు ఎందుకు పడలేవు? ఫటీచర్‌ ఒక రచనలో నుంచి ఊడిపడే పాత్ర. కాగితాల్లో నుంచి అసలు ప్రపంచంలోకి వచ్చి ఈ లోకపు అపసవ్యతను చూసి బిత్తరపోతుంది.

కథ రాస్తూ ఉండగా అందులోని ప్రధాన పాత్ర జనజీవనంలోకి వచ్చేస్తే ఎలా ఉంటుంది?! లోకం గురించి తెలియని ఆ పాత్ర చేసే హడావిడి చూస్తే ఎలా ఉంటుంది?! ఒక విచిత్రాన్ని చిత్రంగా అల్లి మనముందుకు తీసుకువచ్చింది దూరదర్శన్‌. 1991లో చేసిన ఆ ప్రయోగం పేరు ‘ఫటీచర్‌’. ఖాకీ రంగు ఖద్దరు చొక్కా, దానిమీదుగా ఓ నీలంరంగు జాకెట్, అదే రంగు ప్యాంటు, తలమీద టోపీ వేషధారణతో ఉండే ఓ వ్యక్తి లోకంలో ధనిక–బీద వ్యత్యాసాన్ని విచిత్రంగా చూస్తూ అందరి మధ్యా తిరుగుతుంటాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవీ అర్థం గాక తనకున్న సందేహాలను అందరినీ అడిగి విసిగిస్తుంటాడు. అర గంటపాటు వచ్చే ఈ సీరియల్‌ చూస్తున్నంతసేపూ ఆశ్చర్యం, హాస్యభరితం, ఆలోచనాహితంగా చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఊహాజనితమైన పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లిన కథాంశంతో ఫటిచర్‌ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

విషయమేంటంటే...
ప్రఖ్యాత పుస్తకాల ప్రచురణ కర్త పౌల్‌ దగ్గర కొంతమంది రచయితలు ఉంటారు. వారంతా పౌల్‌తో తమకు వచ్చిన కొత్త కొత్త కథా ఆలోచనలను చెబుతుంటారు. అందులో భాగంగా ఓ రోజు రచయితల సమావేశంలో అజిత్‌ వచని అనే నవలా రచయిత పౌల్‌ ముందు ఓ నిరుపేద జీవితం గురించి నవలగా రాస్తే బాగుంటుందని చెబుతాడు. ఆ మాటల్లో భాగంగా పౌల్‌ తను నిరుపేద (ఫటీచర్‌)గా ఉన్ననాటి రోజుల నుంచి ప్రచురణ కర్తగా మారిన విధానం గురించి చెబుతాడు. ఆ ఫటిచర్‌ జీవిత చరిత్ర గురించి తను రాస్తానని చెబుతాడు అజిత్‌. అందుకు పౌల్‌ ‘ఓకే’ అనడం, అజిత్‌కి పట్టణంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో రూమ్‌ కేటాయించడం జరిగిపోతాయి. అజిత్‌ వచని ‘ఫటిచర్‌’ అని పేరు పెట్టి అతని గురించి నవల రాస్తూ ఉండగా.. ఆ కాగితాల్లో నుంచి ఫటిచర్‌ బయటకు వస్తాడు. ఈ విషయం అజిత్‌కు తెలియదు. అక్షరాల్లో నుంచి కాగితాలను నెట్టుకుంటూ బయటకు వచ్చిన ఫటిచర్‌ రూమ్‌ దాటి బయటకు వెళ్లడానికి ఆసక్తిగా చూస్తుంటాడు. అప్పుడే అటుగా వచ్చిన వెయిటర్‌తో మాటలు కలపడం, అక్కణ్ణుంచి ఇంకొంతమందిని కలుసుకోవడం, తనకు తెలియని వాటిని తెలుసుకోవడం, విచిత్రంగా వాదించడం చేస్తూ నిరుపేదలు ఉండే చోటుకి వెళతాడు. 

ఇతరనటీనటులు
పంకజ్‌కపూర్‌తో పాటు అజిత్‌ వచని, నినా గుప్తా, రాజేష్‌ పూరీ, అనుపమ్‌ఖేర్, ప్రీతీ ఖేర్‌.. వంటి ప్రముఖ సినీ, నాటక రంగ నటీనటులు ఫటీచర్‌లో ఆకట్టుకున్నారు.

ఫటీచర్‌గా పంకజ్‌ కపూర్‌
నాటక, సినీ రంగ నటుడు పంకజ్‌కపూర్‌. సినీ నటుడు షాహిద్‌ కపూర్‌ తండ్రి. చాలా టీవీ సీరియల్స్, సినిమాలలో నటించారు. ఫటీచర్‌కు ముందే డిటెక్టివ్‌గా (కరమ్‌చంద్‌ సీరియల్‌) పంకజ్‌కపూర్‌ టీవీ ప్రేక్షకులకు తెలుసు. ఎన్నో జాతీయ అవార్డులు పంకజ్‌కపూర్‌ ఖాతాలో చోటుచేసుకున్నాయి. ‘ఒకే పాత్రలో నన్ను ప్రేక్షకులు చూడకూడదనేది నా ప్రయత్నం. అందుకే విభిన్న పాత్రలను నా కెరియర్‌లో ఎంచుకున్నాను. అందులో ఫటీచర్‌ ఒకటి’ అని తెలిపారు ఓ ఇంటర్వ్యూలో పంకజ్‌ కపూర్‌.

దారిద్య్రరేఖ
ఫటీచర్‌ హోటల్‌లో ఉన్నప్పుడు అక్కడి టీవీలో వస్తున్న ఒక ఇంటర్వ్యూను చూస్తాడు. దారిద్య్రరేఖకు దిగువన, పైన ఉన్నవారు అనే విభజన గురించి ఆ కార్యక్రమంలో చెప్పడంతో అదేంటో తెలుసుకోవడానికి చాలామందిని అడుగుతుంటాడు. ఆ ‘రేఖల’ గురించి తెలియదని ‘రేఖ’ గురించి అయితే చెబుతామని అనే వ్యక్తులను కాదని ముందుకు వెళతుంటాడు. ఈ క్రమంలో ఫటీచర్‌కి, ఇతర వ్యక్తులకు మధ్య సాగే సంభాషణ హాస్యభరితంగా ఉంటుంది. ఆ క్రమంలోనే నిరుపేదలు ఉండే చోటుకి వెళతాడు. అక్కడ అనుకోకుండా అతనికి ఒక అంధురాలైన చెల్లెలు, మరుగుజ్జు తమ్ముడు, తాగుబోతు తండ్రి ఉన్న నిరుపేద కుటుంబం పరిచయం అవుతుంది. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ కుటుంబానికి చేరువలోనే ఉన్న మున్సిపాలిటీ వాటర్‌పైప్‌లో తలదాచుకుంటాడు. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి అతన్ని అక్కణ్ణుంచి వెళ్లిపొమ్మంటారు. తనకు ఇల్లు లేదని తాగుబోతు వ్యక్తి కుటుంబాన్ని కలుస్తాడు. ఆ జీవనంలో ఫటీచర్‌కి ఒక సామాన్యుడి జీవితం ఎంత దుర్భరమైనదో వాస్తవంలో తెలుసుకుంటాడు. ఆకలి–ఆహారం గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. మృదు స్వభావి కావడంతో ఫటిచర్‌ ను అందరూ ఇష్టపడుతుంటారు. నిరుపేదలను తాను పుట్టుకొచ్చిన లగ్జరీ హోటల్‌కి తీసుకెళుతుంటాడు. వారికి నచ్చిన ఆహారం పెట్టిస్తాడు. ఆ బిల్లు రచయిత అజిత్‌కు వెళుతుంటుంది. తను సృష్టించిన పాత్ర బయటకు రావడమేంటో అర్థంకాక ఫ్రస్టేషన్‌తో అజిత్‌ కాగితాలన్నీ చించేస్తుంటాడు. పేద ప్రజల్లో ఉండే ఒక నైరాశ్యం గురించి ఫటీచర్‌ ఎక్కువ ఆందోళన చెందుతుంటాడు. తనదైన హాస్యభరిత శైలిలో అక్కడి సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కరిస్తుంటాడు. ఫటీచర్‌ జనంలోనే ఉంటాడు. జనంతోనే ఉంటాడు. ఆ నవలకు ఎండ్‌ అనేది ఉండదు. ఇదొక అసంపూర్తి నవలగానే మిగిలిపోతుంది. అనిల్‌ చౌదరి రాసి, దర్శకత్వం వహించిన ఈ ఫటీచర్‌ టీవీ సీరీస్‌ గోల్డెన్‌ డేస్‌ దూరదర్శన్‌ సీరియల్స్‌లో తప్పక ప్రస్తావించదగ్గది.– ఎన్‌.ఆర్‌

మరిన్ని వార్తలు