సూర్యనమస్కారాలతో శారీరక, మానసిక ఆరోగ్యం

6 Feb, 2018 00:04 IST|Sakshi
సూర్యనమస్కారాలు

సైన్స్‌ – సంప్రదాయం

ఎముకలు ఆరోగ్యంగా పెరగాలంటే మన శరీరానికి డి విటమిన్‌ ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి నుంచి సమృద్ధిగా లభిస్తుంది. అందుకే కాబోలు, పూర్వం మన పెద్దవాళ్లు సూర్యనమస్కారాలు చేసేవారు. ఇప్పుడు కొందరు వెద్యులు కూడా సూర్యనమస్కారాలు చేయమని చెబుతుంటారు.  సూర్యనమస్కారాల ప్రయోజనమేమిటో చూద్దాం.  సూర్య నమస్కారం అనేది పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు; ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు; మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని సైన్సు చెబుతోంది. సూర్య నమస్కారాల వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా వివిధ రకాల గ్రంథులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.  

మరిన్ని వార్తలు