పింక్ బాబా

2 Feb, 2016 06:45 IST|Sakshi
పింక్ బాబా

చేతనబడి
 
ఐదేళ్లు వైద్యం చదివితే డాక్టర్ అవుతారు. ఐదు వేళ్లను గాలితో తిప్పి మంత్రం వేస్తే భూతవైద్యుడు అవుతాడు. అయితే ఈ భూతవైద్యుడు... మంత్రానికి మందు కలిపాడు. మాయలు చేశాడు. పింక్ రంగు దెయ్యాన్ని పట్టేశాడు. జనవిజ్ఞానవేదిక వాళ్లు వచ్చి ఇతడి అసలు రంగుని బయటపెట్టేశారు!

 

అది అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలంలోని మరాలాగ్రామం. గ్రామానికి ఒక చివరగా విసిరేసినట్లుగా ఉంది బాలే నాయక్ తండా. మార్చి నెలాఖరు రోజులు. ఎండలు మండుతున్నాయి. ఆ తండాలో మంగ్లీబాయి, భీకే నాయక్ దంపతుల ఇంటి జనం గుమిగూడి ఉన్నారు. మంగ్లీబాయి ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉంది. ఆమె కొడుకు ఉదయ్‌కిరణ్ పదేళ్ల వాడు. తల్లి ఒళ్లో తల పెట్టుకుని అరుగుమీద అచేతనంగా పడుకుని ఉన్నాడు. ‘ఏమైంది’.. ఒకరినొకరు అడుగుతున్నారు.


ఇంతలో నాగులయ్య రంగ ప్రవేశం చేశాడు. ఆ తండా అంతటికీ వైద్యుడు ఆయనే. భూతవైద్యుడూ ఆయనే. వస్తూనే ఆ పిల్లాడి నాడి పట్టుకుని చూశాడు. నుదురు తాకి చూశాడు... తల పంకిస్తూ ‘పిల్లాడికి దెయ్యం పట్టింది’ అని ఒక్కమాటలో నిర్ధారించేశాడు. కుర్రాడిని లేపి కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. ఇంటి ముందు నేల మీద నీళ్లు చల్లి ముగ్గు వేశాడు. సాంబ్రాణి ధూపం వేసి, అగరువత్తి వెలిగించాడు. తమలపాకుల మధ్య వక్కలు పెట్టాడు. మంగ్లీబాయి బిడ్డను తడుముకుంటూ ఆకాశంలోకి చూస్తూ దణ్ణాలు పెట్టుకుంటోంది.  భయంతో వణికిపోతున్నాయామె చేతులు. నాగులయ్య సంచిలో నుంచి దాకీ బొమ్మను బయటకు తీశాడు.

 

దాన్ని చూడగానే అందరూ భయకంపితులయ్యారు. దాకీ బొమ్మ అంటే కీడుబొమ్మ. ఆ బొమ్మను తీశాడంటే దెయ్యాన్ని పారదోలడానికేనని, నాగులయ్య దెయ్యాన్ని ముగ్గులోకి రప్పిస్తాడని అక్కడ ఉన్న వారందరికీ గట్టి నమ్మకం. దాకీ బొమ్మ తీశాడంటే పిల్లాడికి సోకింది చిన్న గాలి కాదనే నిర్ధారణకు వచ్చేశారు. ఆ బొమ్మను ముగ్గు మధ్యలో పెట్టాడు నాగులయ్య. మంత్రాలు చదువుతున్నాడు. అది ఏ భాషో తెలియడం లేదు. స్వరంలో తీవ్రతను బట్టి ఎవర్నో తిడుతున్నాడని మాత్రం అర్థమవుతోంది. ఆ బొమ్మను ముగ్గులో పెట్టిన కొద్ది క్షణాలకే నాగులయ్య ముఖం రౌద్రంగా మారిపోయింది. కొప్పు ముడి విప్పి జుట్టు విరబోసాడు.

మంత్రాలు చదవడంలో స్వరం పెంచాడు. తననెవరో గట్టిగా కొట్టినట్లు విసురుగా పక్కకు పడిపోయాడు. ఒక్క క్షణం మంత్రాలు ఆపి ‘నన్నే పడేస్తావా, నీ అంతు చూస్తా’ అంటూ గుప్పెట్లోకి సాంబ్రాణి తీసుకుకి విసురుగా నిప్పుల మీద చల్లాడు. సంచిలో నుంచి ఇంకా ఏవేవో వస్తువులు బయటకు తీశాడు. గట్టిగా అరుస్తూ నాగులయ్య మధ్య మధ్యలో విరుచుకు పడిపోతున్నాడు. మళ్లీ లేస్తున్నాడు. పూజ తంతు పూర్తి కావస్తోంది. పిల్లాడిని ముగ్గు దగ్గరకు తెచ్చి కూర్చోబెట్టమన్నాడు. పిల్లాడి కనురెప్పలు తెరిచి చూశాడు. చేతులను చాపించి అరచేతులను తెరిచి చూశాడు. 

 

‘త్వరగా సున్నం తీసుకురండి’ అని గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్న మంగ్లీబాయి కూతురు పరుగున వెళ్లి సున్నం పిడత తెచ్చింది. ‘పిల్లవాడి చేతికి సున్నం రాయి’.. అదే కంచుకంఠంతో అరిచాడు. భీకూ నాయక్ భయపడుతూనే సున్నం తీసుకుని ఉదయ్‌కిరణ్ అరచేతికి రాశాడు. అంతే... సున్నం రాసినంత మేర చేయి ముదురు గులాబీరంగులోకి మారిపోయింది. నాగులయ్య ముఖం విజయగర్వంతో వెలిగిపోయింది.

‘అమ్మో! గాలి దెయ్యమే’ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ‘ఇట్లాంటి దెయ్యాలనెన్నింటినో వదిలించాను. ఇదో లెక్కా’ అంటూ పెద్దగా నవ్వి... మళ్లీ మంత్రాలు మొదలెట్టి పూజతంతు త్వరగానే ముగించాడు. గిన్నెలో మజ్జిగ తెప్పించాడు. సంచిలో నుంచి బిట్వాకు తీసుకుని అరచేతుల్లో వేసి నలిపి మజ్జిగలో కలిపి పిల్లాడి నాలుక మీద పిండాడు.

కొద్దిసేపటికి మిగిలిన మజ్జిగను కూడా తాగించాడు. ‘పిల్లాడిని పట్టిన దెయ్యం వదిలింది. అయినా దాని ఆశ తొందరగా చావదు. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండి మళ్లీ పిల్లాడి మీద వాలుతుంది. వరుసగా మూడు రోజులు ఇక్కడే ఇదే సమయానికి ముగ్గుపెట్టాలి. ఆ తర్వాత అమావాస్య రోజు పెద్ద పూజ చేస్తే తప్ప పూర్తిగా వదలదు’ అంటూ సంచి సర్దుకున్నాడు నాగులయ్య.
   
ఉదయ్‌కిరణ్ కొంత వరకు సాంత్వన పడుతున్నాడు. స్కూలుకెళ్లడం లేదు, కానీ మంచం మీద పడుకోకుండా ఇంట్లో తన పనులు చేసుకుంటున్నాడు. నాగులయ్య రెండవ రోజు, మూడవ రోజు పూజ చేసి వెళ్లాడు. ఇక అమావాస్య రోజు పూజ భారీ ఎత్తున జరగాలి. మేకను బలివ్వాలి. తాంబూలంలో డబ్బు పెట్టాలి. పిల్లాడి నిలువెత్తు ధాన్యం పోయాలి. ఊర్లో డబ్బు వడ్డీకి అప్పిచ్చే గోవిందు దగ్గరకెళ్లాడు భీకే నాయక్. అవతల కొడుకు ప్రాణం. దెయ్యం తిరగబెడితే ఇక పిల్లాడు దక్కడేమోననే భయమే... ఎంత వడ్డీకైనా డబ్బు అప్పు తీసుకునే తెగువను తెస్తుంది. తండా అంతటా నాగులయ్య పెద్ద పూజ చేస్తాట్ట అని తెలిసింది. వెళ్లి చూడాలనే ఉత్సుకత అందరిలోనూ పెరిగింది.

 

విషయం ఆ ఊర్లోనే ఉన్న ‘యంగ్ ఇండియా’ ప్రతినిధికి కూడా తెలిసింది. అతడు పూజ సమయానికి భీకే నాయక్ ఇంటికి చేరాడు. అతడిని చూడగానే నాగులయ్య ముఖం జేపురించింది. ‘ఫినాప్తలీన్ పొడి ఉందా, పర్గోలాక్స్ మాత్రలున్నాయా నాగులయ్యా’ అనగానే భయంతో వణికిపోయాడు. అమావాస్య పూజ ఆగిపోయింది. ఉదయ్‌కిరణ్ సంఘటనతో తండా చైతన్యవంతం అయింది. అప్పటి నుంచి నాగులయ్య ఆ ఊళ్లో ఎవరికీ భూతవైద్యం చేయలేదు. ఆ తండా వాసులు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు. తండాలోని పిల్లలు, యువత సరదాగా పర్గోలాక్స్ మాత్రను పొడిచేసి చేతికి అద్దుకుని దానిపై తడి సున్నం రాసి గులాబీరంగులోకి మారిన చేతులను చూస్తూ ‘అరె! నీకు దెయ్యం పట్టిందిరా’ అంటూ ఒకరినొకరు ఆటపట్టించుకోసాగారు. ఇప్పుడు ఉదయ్‌కిరణ్ ఖరగ్‌పూర్ ఐఐటిలో చదువుతున్నాడు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 
నాగులయ్య  ఎంత తెలివైన వాడంటే...
రోగిని చూడగానే వ్యాధి ఏమిటనేది పట్టేస్తాడు. తన వైద్యంతో నయం అయ్యే వ్యాధి అయితేనే కేసు టేకప్ చేస్తాడు. తనకు చేతగానిదయితే ‘ఇది నన్నే చంపేసే దెయ్యం. పెద్ద దేవుళ్లకు మొక్కాలి’ అంటూ ఇతర ఊళ్లలో ఉన్న గుళ్లకు పంపిస్తాడు. ఉదయ్‌కిరణ్‌కి వడదెబ్బ కొట్టిందని గ్రహించాడు. మజ్జిగ, బిట్వాకు పసరుతో స్వస్థత చేకూరుతుందనీ తెలుసు. అయితే సాధారణ వైద్యానికి భూతవైద్యం ముసుగు వేసి ఎక్కువ డబ్బు గుంజేవాడు. తండా అందరికీ వైద్యం చేసే నాగులయ్య... తనకు అనారోగ్యం వస్తే అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్లేవాడు. ఒకరోజు విడిగా కూర్చుని నీకు నిజంగా శక్తులున్నాయా అని నేనడిగితే పెద్దగా నవ్వేసి ‘శక్తులుంటే నేనిలా ఎందుకుంటాను’ అన్నాడు. నాకు తెలిసిన వైద్యంతో ఏడాదంతా భుక్తి గడవదు. అందుకే ఇదంతా అని అసలు విషయం చెప్పేశాడు.
 - ఎస్. శంకర శివరావు,
 కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ
 
ఉదయ్‌కిరణ్ ఎందుకు పడిపోయాడంటే...
బాలే నాయక్ తండా మరాలా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1997 ప్రాంతంలో ఊరికీ తండాకూ మధ్య పెద్ద చింతతోపు, ఈతవనం ఉండేవి. వాటి మధ్య గుండ్లవాగు. చింతతోపులో దెయ్యాలు తిరుగుతుంటాయని నమ్మేవారు. మార్చినెలలో మధ్యాహ్నం స్కూలు వదిలిన తర్వాత ఉదయ్‌కిరణ్, అక్కతో కలిసి ఆకలి కడుపుతో, దాహంతో పిడచకట్టుకు పోయిన నాలుకను లాలాజలంతో ఆర్చుకుంటూ రెండు కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. ఇంతలో పెద్ద ఎత్తున లేచిన సుడిగాలి దాటికి పడిపోయాడు.
 

మరిన్ని వార్తలు