పింక్ జర్నీ

23 Jun, 2015 23:29 IST|Sakshi
పింక్ జర్నీ

నిర్భయ ఉదంతం తర్వాత మహిళా భద్రత చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మహిళల సురక్షిత ప్రయాణం పై దాదాపు అన్ని రాష్ట్రాలూ దృష్టిపెడ్తున్నాయి. శ్రద్ధ చూపిస్తున్నాయి. వీటిలో భాగమే పింక్ ఆటో సర్వీస్. స్త్రీల కోసం స్త్రీలే నడిపే ఆటోరిక్షా ప్రయాణసేవలే పింక్ ఆటో సర్వీస్. ఇప్పటికే రాంచీ, పుణె, భువనేశ్వర్ వంటి పట్టణాలు పింక్ ఆటోలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాయి. ఇప్పుడు ఇండోర్ కూడా అక్కడి ఆడవాళ్ల కోసం పింక్ ఆటో సర్వీస్‌ని లాంచ్ చేయబోతోంది. దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన అటల్ ఇండోర సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (అఐఇఖీఔ) నడపనున్నది. ముందుగా ఓ 20 ఆటోలను ప్రవేశపెట్టనున్నట్లు ఎఐసిటీఎస్‌ఎల్ తెలిపింది.

ఆడవాళ్ల భద్రత కోసం పింక్ ఆటో సర్వీస్‌ని నడపనున్న విషయం తెలిసీ అందులో భాగస్వాములు అవడానికి కొంతమంది మహిళా ఆటోడ్రైవర్లు ఉత్సాహం చూపిస్తున్నారట. వాళ్ల సహకారంతో ఈ సర్వీస్‌ని మరింత మెరుగ్గా అందిస్తామంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాదు, ఔత్సాహిక మహిళలకు ఆటో నడపడంలో శిక్షణనిచ్చి ఈ పింక్ ఆటో ద్వారా ఉపాధి కల్పించే యోచనా చేస్తోంది. తమ ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలనుకునే స్త్రీలు ఈ పింక్ ఆటో సర్వీస్‌ని ఫోన్‌కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 
ఇలాంటి సేవలు తెలుగు రాష్ట్రాల రహదారులకూ రవాణా అయితే బాగుండు!

మరిన్ని వార్తలు