బుల్లి విమానం.. కరెంటుతో నడుస్తుంది!

21 Apr, 2018 00:23 IST|Sakshi

విమానాలు పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనంతో కాకుండా విద్యుత్తుతో నడిస్తే కాలుష్య సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. అచ్చంగా ఇదే ఆలోచనతో సిద్ధమైన విమానం సన్‌ఫ్లయర్‌ ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకుంది. అయితే ఏంటి? అంటున్నారా? ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి మరి. ఒక్కటొక్కటిగా చెప్పుకుందాం. దీనిని అమెరికా కంపెనీ ‘బై ఏరో స్పేస్‌’ తయారు చేసింది. మొత్తం బరువు 1860 కిలోలు మాత్రమే. ఇద్దరు ప్రయాణించే వీలుంది. మొత్తం ఆరు లిథియం అయాన్‌ బ్యాటరీల్లో నిక్షిప్తమైన విద్యుత్తుతో 3.5 గంటలపాటు నడవగలదు ఈ విమానం. సాధారణ లిథియం అయాన్‌ బ్యాటరీల కంటే ఎక్కువగా.. అంటే ప్రతి కిలో బరువున్న బ్యాటరీలో 260 వాట్స్‌/గంట విద్యుత్తు నిల్వ ఉండటం విశేషం.

అంతేకాకుండా వీటిని వేగంగా రీఛార్జ్‌ చేసుకోవచ్చు కూడా. ప్రయాణించే ఎత్తు, వేగం, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం కూడా ఇప్పటికే తయారైన ఇతర విద్యుత్తు విమానాలతో పోలిస్తే చాలా ఎక్కువని కంపెనీ అంటోంది. కార్బన్‌ ఫైబర్‌ వంటి అత్యాధునిక మిశ్రమ లోహాలను వాడటం ద్వారా తాము విమానం మొత్తం బరువును గణనీయంగా తగ్గించగలిగామని అంటోంది. ప్రస్తుతానికి తాము పైలట్లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో సన్‌ఫ్లయర్‌ను తయారు చేశామని, నాలుగు సీట్లు ఉన్న సన్‌ఫ్లయర్‌–4ను తయారుచేసే ఆలోచన కూడా ఉందని కంపెనీ తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ విమానాలతో పోలిస్తే ఈ విమానాల ప్రయాణ ఖర్చు పది రెట్లు తక్కువగా ఉండటం.   

మరిన్ని వార్తలు