బాల్యంలోనే బాటలు

12 Aug, 2017 00:02 IST|Sakshi
బాల్యంలోనే బాటలు

సముద్రంలోని అలలు నిరంతరం ముందుకీ, వెనక్కీ, పైకీ, కిందికీ అవుతుంటాయి. ఒక్కోసారి ఎగసి పడుతుంటాయి. అంతలోనే వెనక్కి తగ్గి సముద్రంలో కలిసిపోతుంటాయి. మానవజీవితం, సంపదలు కూడా అంతే. రావి ఆకు నిరంతరం గాలికి రెపరెపలాడుతూనే ఉంటుంది. ఎంత తొందరగా చిగురిస్తుందో అంత తొందరగానూ రాలిపోతుంది. గాలి వీచినప్పుడు ఎంతటి దీపమైనా కొండెక్కక తప్పదు. ఏనుగు నిరంతరం దాని చెవులను కదుపుతూ ఉంటుంది. మిణుగురుల కాంతి  క్షణికం. నీటిమీద రాసిన రాతలు వెంటనే చెరిగిపోతాయి. వెన్నెల మురిపిస్తుంది. కాని చేతికి చిక్కదు. సంపద కూడా అంతే. ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రాణం కూడా అంతే.  అందుకే జీవితం బుద్బుదప్రాయం అనే విషయాన్ని అర్థం చేసుకుని జీవించినంతకాలం సన్మార్గంలో ఉండాలి. కొందరు అలా కాదు, బతికినంత కాలం చేయరాని పనులు చేయడమే కాక తాము చేసినది తప్పు కాదనుకుంటారు.

అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగుతుంటారు. అలా విర్రవీగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు బాల్యం నుంచే పిల్లలకు మంచి అలవాట్లు చేయాలి, మహనీయుల మహోన్నత గాథలు చెబుతూ పెంచితే వారు పెరిగి పెద్దయ్యాక ఉత్తమ పౌరులవుతారు లేదంటే సంఘవిద్రోహక శక్తులుగా మారతారు. అందుకే మొక్కగానే వంచాలి. అందుకు ఇప్పటినుంచే బాటలు వేయాలి. వారికి మంచీ చెడూ, ఆత్మీయత, ఆప్యాయతలు, సామాజిక, నైతిక విలువలు నేర్పాలి.

మరిన్ని వార్తలు