గుండెకు ప్లాస్టిక్‌ పట్టీ...

22 Feb, 2020 08:39 IST|Sakshi

గుండెజబ్బు వచ్చిన తరువాత గుండెపై ఉండే కణజాలం కొంత దెబ్బతింటుందని... ఫలితంగా ఆ భాగం గుండె లబ్‌డబ్‌లలో భాగం కాదని తెలుసు. దీనివల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దాని ప్రభావం కాస్తా మన ఆరోగ్యంపైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఓ ప్లాస్టిక్‌ పట్టీ అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఈ పట్టీని చెడిపోయిన గుండె కణజాలంపై అతికిస్తే చాలు.. పరిసరాల్లోని గుండె కణాల విద్యుత్‌ ప్రచోదనాలను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందిస్తుంది.

ఇందుకు తగ్గట్టుగా ఈ పట్టీలో విద్యుత్‌ ప్రచోదనాలను ప్రసారం చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంకోలా చెప్పాలంటే సాధారణ గుండె కణజాల సంకోచ వ్యాకోచాలను ఈ పట్టీ ద్వారా అనుకరించవచ్చునన్నమాట. ప్రస్తుతానికి ఈ పట్టీని తాము పరిశోధన శాలలోని కణజాలంపై ఉపయోగించి చూశామని, త్వరలోనే జంతు ప్రయోగాలు చేపడతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మైకేల్‌ మోనగన్‌ తెలిపారు. గతంలోనూ ఇలాంటి పట్టీలు కొన్ని అభివృద్ధి చేసినా వాటిల్లో సజీవ గుండెకణజాల కణాలనే ఉపయోగించే వారు కాగా.. తాము తయారు చేసింది పూర్తిగా ప్రత్యేక పదార్థాంతోనని ఆయన వివరించారు. సజీవ కణాలను చేరిస్తే పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్‌డ్‌ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు