పిల్లలతో ఆడితేనే ఉల్లాసం

22 Jan, 2014 00:23 IST|Sakshi
పిల్లలతో ఆడితేనే ఉల్లాసం

 ఇక్కడ ఎంతో గర్వంగా కండలు చూపిస్తున్న మిషెల్ ఒబామా వయసు ఎంత ఉంటుందనుకుంటున్నారు? ఓ నలభైవరకూ ఉంటాయేమో...అంటూ సమాధానం చెప్పేవాళ్లంతా ముక్కున వేలేసుకునేంత వయసు ఉందామెకు. ఎందుకంటే ఈ నెల 17తో మిషెల్‌కి యాభైఏళ్లు నిండాయి. ముఖం మీద ముడతలు దాచుకోవాల్సిన వయసులో కండలు చూపించడం ఎలా సాధ్యమవుతోందని ఆరా తీస్తే మిషెల్ తీసుకునే జాగ్రత్తల జాబితా బయటపడింది. యోగ నుంచి వాలీబాల్ వరకూ మిషెల్ దినచర్యలో భాగమట. అంతేకాదు మిషెల్ స్కిపింగ్ చేయడం మొదలుపెడితే ఆ చురుకుదనాన్ని పాతికేళ్ల వయసు వాళ్లు కూడా నోళ్లు వెళ్ళబెట్టుకుని చూడాల్సిందేనట. ‘‘యవ్వనంగా, దృఢంగా ఉండాలంటే ఎన్నో రకాల నియమాలతో పాటు పిల్లలలో ఒకరిగా కలిసిపోయి ఆడుకోవడం, ఆనందంతో గంతులు వేయడం చాలా ముఖ్యం. వాటి ప్రభావం మన శరీరంపై మాత్రమే కాదు మనసుపై కూడా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటేనే కదా శరీరం చురుగ్గా ఉంటుంది’’ అని మిషెల్ చెప్పే మాటల వెనక యవ్వన రహస్యమే కాదు...జీవన విధానాలను మార్చుకోవాలనే ఫిలాసఫీ కూడా ఉంది. ఇంటా బయటా పనుల ఒత్తిడిలో నలిగిపోకుండా బాల్యాన్ని గుర్తుచేసే ఆటలు, పాటలే మనల్ని నిత్యయవ్వనంగా ఉంచగలవన్నది మిషెల్ సూత్రం.

మరిన్ని వార్తలు