ఎండిన బోరు, బావిలో పుష్కలంగా నీరు!

24 Jul, 2018 04:34 IST|Sakshi
శ్యాంప్రసాద్‌ రెడ్డి పొలంలో కందకాలు.. నీటితో కళకళలాడుతున్న బావి.. బోరు

కందకాలతో నెల రోజుల్లోనే నీటి భద్రత సాధించిన యువ రైతు

వాన నీటిని కందకాల ద్వారా నేలతల్లికి తాపితే.. ఎండిన బోర్లు, బావులు వెంటనే జలకళను సంతరించుకుంటాయనడానికి యువ సేంద్రియ రైతు మార్తి శ్యాంప్రసాద్‌రెడ్డికి కలిగిన తాజా అనుభవమే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎనిమిదిన్నరేళ్లు విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి.. వ్యవసాయంపై మక్కువతో తిరిగి వచ్చేసిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గజ్జెనవారిగూడెంలో 20 ఎకరాల ఎర్రగరప నేలను కొనుగోలు చేశారు. గతేడాది 4 ఎకరాల్లో శ్రీవరి, 16 ఎకరాల్లో చిరుధాన్యాలు, దేశీ పుచ్చ (విత్తనం కోసం) సాగు చేశారు. పొలంలో రెండు బోర్లు, బావి ఉన్నాయి. అయితే, ఈ ఎండాకాలంలో ఒక బోరుతోపాటు బావి కూడా ఎండిపోయింది. గత ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. ఈ వేసవిలో బోరు, బావి ఎండిపోయాయి.

ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించి.. వారి సూచనల మేరకు గత నెలలో కందకాలు తవ్వించారు. తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా ఉన్న ఈ భూమిలోకి పై నుంచి కూడా వాన నీటి వరద వస్తూ ఉంటుంది. వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకింపజేసుకోవాలన్న లక్ష్యంతో పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. నెల తిరగక ముందే 4 పెద్ద వర్షాలు పడ్డాయి. వారమంతా వర్షం కురిసింది. కురిసిన 2–3 గంటల్లోనే కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకిందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే బోరు, బావి తిరిగి జలకళను సంతరించుకున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు.

బోరు రెండించుల నీరు పోస్తున్నదని, 7హెచ్‌.పి. మోటారుకు రోజుకు ఐదారు గంటలు బావి నీరు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో డ్రమ్‌ సీడర్‌తో వరి విత్తటానికి దమ్ము చేస్తున్నామని, మిగతా 16 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో వర్షం కురిస్తే పైనుంచి కూడా వచ్చే వరద వల్ల పడమర భాగంలో భూమి కోసుకుపోయేదని, మట్టి కట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితుల్లో కందకాలు తవ్వటం వల్ల చుక్క నీరు, పిడికెడు మట్టి కూడా బయటకు కొట్టుకుపోలేదన్నారు. ఇంకో 2–3 వానలు పడితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. వర్షాలకు ముందు కందకాలు తవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే బోరు, బావి జలకళను సంతరించుకోవడం సంతోషకరమని యువ రైతు శ్యాంప్రసాద్‌రెడ్డి (84640 76429) తెలిపారు.

    మార్తి శ్యాంప్రసాద్‌ రెడ్డి

మరిన్ని వార్తలు