నా కోసం.. నా ప్రధాని

24 Jun, 2019 11:27 IST|Sakshi

మంచి విషయం

ఇలాంటప్పుడే.. ప్రభుత్వం ఎక్కడో ఢిల్లీలో లేదు, మన ఇంటి పక్కనే ఉందన్న నమ్మకం కలుగుతుంది. సుమేర్‌ సింగ్‌ది జైపూర్‌. ఆయన కూతురు లలిత్‌కి కొన్నాళ్లుగా ఒంట్లో బాగోలేదు. కూతురంటే మరీ చిన్న పిల్ల కాదు. టీనేజ్‌ అమ్మాయి. బాగోలేక పోవడం అంటే ఎంతకూ తగ్గని జ్వరమో, తలనొప్పో కాదు. అప్లాస్టిక్‌ అనీమియా! ‘మనిషి ఒంట్లో ఎప్పటికప్పుడు రక్తకణాలు పుట్టుకొస్తుండాలి. మీ అమ్మాయిలో అలా లేదు. దీనివల్లే ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం తగ్గట్లేదు. రక్తకణాలను తయారు చేసేది ఎముకల్లోని మూలుగ. ఆ మూలుగను వేరే మనిషి నుంచి తీసుకుని మీ అమ్మాయి వేస్తే తిరిగి రక్తకణాల వృద్ధి మొదలవుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. మూలుగను మార్చాలంటే సుమారు 10 లక్షల రూపాయల వరకు అవుతుంది’’ అని డాక్టర్లు చెప్పారు.

అప్పటికే సుమేర్‌ తన కూతురి వైద్యం కోసం భూమిని అమ్ముకున్నాడు. ఇంటిని తనఖా పెట్టాడు. 7 లక్షల రూపాయలు వరకు ఖర్చు పెట్టాడు. అయినా నయం కాలేదు. ఆ తండ్రి దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘‘నా కూతురికి ఇక ఎప్పటికీ బాగయే అవకాశం లేకపోతే నేను చచ్చిపోతాను’’ అన్నాడు ఓ రోజు. అప్పుడే డాక్టర్లు చెప్పారు మూలుగ మార్పిడి చేయించగలిగితే పిల్ల బతుకుతుందని. మూలుగ ఇవ్వడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. ఇక కావలసింది పది లక్షలు. అంత డబ్బు ఎవరిస్తారు? ప్రధాన మంత్రికి ఉత్తరం రాయమని చదువుకున్న వాళ్లెవరో సలహా ఇచ్చారు. సమేర్‌ తన కూతురు పరిస్థితి, తన ఆర్థిక దుస్థితి వివరిస్తూ నరేంద్ర మోదీ పేరిట ఉత్తరం రాశారు. ఆ ఉత్తరానికి స్పందించిన ప్రధాని కార్యాలయం ‘జాతీయ సహాయ నిధి’ నుంచి సమేర్‌ కూతురి చికిత్స కోసం 30 లక్షల రూపాయలను విడుదల చేసింది! సమేర్‌ సహాయం అడిగితే ఏకంగా వరమే లభించింది. ఈ డబ్బుతో అతడికి కూతురికి నయమవడమే కాదు, అతడి అప్పులూ తీరుతాయి. తను అమ్మిన భూమిని తిరిగి తనే కొనుక్కోగలడు. తనఖా పెట్టిన ఇంటిని విడిపించుకోగలడు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఢిల్లీ మన కాలనీలోనే ఉందని! ప్రధాని రోజూ మన ఇంటి వైపు చూస్తూ డ్యూటీకి వెళుతున్నారని. పరామర్శించడానికి కూడా ఎప్పుడో ఇంటి లోపలికి కూడా రానే వచ్చేస్తారని.

మరిన్ని వార్తలు