పాకెట్ మనీతో చెబితేనే పేమెంట్ విలువ తెలిసేది

21 Feb, 2014 23:23 IST|Sakshi

కల్యాణ్‌కు ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తవుతుండగానే... క్యాంపస్‌లోనే ఓ బహుళజాతి సంస్థ తనను సెలక్ట్ చేసుకుంది. ఆరంభంలో నెలకు రూ.25 వేల జీతం. రెండేళ్లు తిరిగేసరికల్లా జీతం రూ.50 వేలు దాటిపోయింది. ఐదేళ్లు తిరిగేసరికి ఇంట్లో వాళ్లు పెళ్లి కూడా కుదిర్చేశారు. ‘‘పెళ్లయ్యాక ఇంట్లో చక్కని సామగ్రి, హనీమూన్ ట్రిప్... అన్నిటికీ నీ సేవింగ్స్ పనికొస్తాయిరా’’ అన్నాడు కల్యాణ్ తండ్రి. తెల్లమొహం వేశాడు కల్యాణ్. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచీ పైసా దాస్తే ఒట్టు. జీతం పెరిగితే ఖర్చులూ పెరిగాయి. అంతెందుకు! చదువుకునేటపుడు సైతం పాకెట్ మనీ అయిపోయి మళ్లీ మళ్లీ ఇంట్లోవాళ్లనే అడిగేవాడు కల్యాణ్. ఇదంతా ఎందుకంటే... చిన్నప్పటి నుంచే కళ్యాణ్‌కు పొదుపు చేయటం అనే అలవాటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పటానికే. అది అలవాటు కావాలంటే నేర్పించాల్సింది తల్లిదండ్రులే. అదెలాగో ఈ వారం చూద్దాం...
     
పాత సలహానే అనిపించినా.. ముందుగా పిల్లలకంటూ పిగ్గీ బ్యాంక్ లాంటిది ఒకటి అలవాటు చేయండి. దాని ప్రయోజనాలేంటో వివరించండి. వాళ్లేదైనా మంచి పని చేస్తే చిన్నపాటి పారితోషికం ఇవ్వడంతో పాటు దాన్ని వారు దాచుకునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పొదుపు చేయడం అన్నది చిన్నతనంలోనే అలవాటవుతుంది.
     
పిల్లలకు ప్రతి నెలా పాకెట్ మనీ లాంటిది ఇచ్చినప్పుడు అది మొత్తం ఖర్చు చేసేయకుండా.. కొంతైనా దాచుకునేలా ప్రోత్సహించండి. అలా జమ చేసిన డబ్బుతో వారికి నచ్చినవి కొని గిఫ్టుగా ఇవ్వండి. కొంత కొంతగా పొదుపు చేసిన డబ్బుతో పెద్ద అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో దీని వల్ల వారికి తెలియజేయొచ్చు.
     
 వస్తువులు కొనుక్కురావడం వంటి డబ్బుతో ముడిపడి ఉన్న చిన్న చిన్న పనుల్ని అప్పుడప్పుడు వారికి పురమాయించండి. మొదట్లో తప్పులు చేయొచ్చు. కానీ ఓర్పుగా వివరిస్తే వారు ఆర్థిక లావాదేవీల గురించి త్వరగానే తెలుసుకుంటారు.
     
 అప్పుడప్పుడు బ్యాంకులకూ, ఏటీఎంలకూ వెంట తీసుకెళ్లండి. చెక్కులు వేయడం, డబ్బు డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం లాంటి లావాదేవీల గురించి వారు తెలుసుకునే వీలుంటుంది. వీలయితే పిల్లల పేరుతో బ్యాంకు అకౌంటు కూడా తెరవచ్చు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి కిడ్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
 
 కిడ్స్ ఖాతా తెరవాలంటే...
 పద్దెనిమిదేళ్ల దాకా వయసుండే పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. సేవింగ్స్ ఖాతా తరహాలోనే ఈ అకౌంట్లకు కూడా అన్ని సదుపాయాలూ ఉంటాయి. డెబిట్ కార్డు, పాస్ బుక్ లాంటి వాటితో పాటు కొన్ని బ్యాంకులు మైనర్ల కోసం చెక్ బుక్‌లు కూడా ఇస్తున్నాయి.
 
ఖాతా తెరిచేందుకు వయసు, చిరునామాతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లలకు మధ్య బంధాన్ని తెలియజేసే పత్రాలు, మైనర్ ఫోటో కావాల్సి ఉంటుంది. .. కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బీమా కవరేజి కూడా ఇస్తున్నాయి. పేరెంట్స్‌కి ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో బీమా సొమ్ము పిల్లలకు అందుతుంది.
 
 మిగతా ఖాతాల్లానే కిడ్స్ అకౌంట్లలోనూ కనీస బ్యాలెన్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
 
 ఏమేం ఖాతాలున్నాయంటే...


 ఐసీఐసీఐ యంగ్ స్టార్స్
 1 రోజు  నుంచి 18 ఏళ్ల దాకా వయసున్న వారికి
 సగటున కనీస బ్యాలెన్స్ రూ. 2,500 ఉండాలి.
 పర్సనలైజ్డ్ చెక్ బుక్, ఉచిత డెబిట్ కార్డు
 రోజువారీ రూ.5,000 వ్యయం లేదా విత్‌డ్రాయల్
 పేరెంట్స్‌కి ఐసీఐసీఐలో ఖాతా తప్పనిసరి.
 
 హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాంటేజీ

 ఖాతాలో రూ. 35,000 దాటాక..
 ఎఫ్‌డీ కింద ఆటోమేటిక్‌గా మార్చుకునే మనీ మ్యాగ్జిమైజర్ సదుపాయం.
 ఈ ఖాతా నుంచి పిల్లల పేరిట సిప్‌తో ఫండ్స్‌లోకి మళ్లించవచ్చు కూడా.
 తల్లిదండ్రులకు ఏదైనా జరిగిన పక్షంలో పిల్లల చదువుకు     రూ.1,00,000 ఉచిత విద్యా బీమా.
 
 ఆంధ్రా ఏబీ కిడ్డీ
 18 ఏళ్ల దాకా వయసున్న వారికోసం  పొదుపు అలవాటును పెంచేందుకు  ఖాతా తెరిచే సమయంలో పిల్లలకు ఉచితంగా ఒక బొమ్మ కిడ్డీ బ్యాంకును అందిస్తోంది. పిల్లలు దీన్లో డబ్బులు దాచుకోవచ్చు. దీనికి ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది. ఖాతా ఉన్న శాఖలోనే ఈ లాక్‌ని తీయడానికి వీలవుతుంది. కనీస బ్యాలెన్స్ రూ. 100.
 
 యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్
 12 ఏళ్లకు లోబడి ఉంటే తల్లిదండ్రులు లేదా గార్డియన్ల పేరిట చెక్ బుక్, ఏటీఎం కార్డు
 మెట్రో నగరాల్లో కనీస త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 2,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000.
 6 నెలలకు రూ.25,000 ఎఫ్‌డీ, రూ.2,000 ఆర్డీ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్‌లో సడలింపు
 12 ఏళ్లు పైబడిన పిల్లలైతే.. వారు కోరుకున్న బొమ్మను డెబిట్ కార్డుపై ముద్రించి ఇస్తారు
 

మరిన్ని వార్తలు