కవితలు

14 Aug, 2017 01:15 IST|Sakshi

గాలి దిగులుగా కదలక ముడుచుకుంది
ఆకాశం కూలి వర్షం కురుస్తూనే వుంది ఆగకుండా
పూలన్నీ వికసించి, ఇక తలలు వాల్చి, రాలేందుకు ఎదురుచూస్తున్నాయి
తూనీగ రెక్కలపై మోస్తున్న గడచిన జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి
ఇంకా మేల్కొనని కలలు కూడా నెమ్మదిగా మరణించాయి
సన్నటి నొప్పేదో పాత గాయాల్ని రేపుతూ జరజరా పాకుతోంది
ఎన్నెన్నెటికో పగిలిపోయిన మనసు మాత్రం నవ్వుతుంది మెత్తగా

ఎందుకో మళ్లీ గుర్తుకొస్తాయి
ఇసుక ఎడారులలో తుపాను గాలి పాడే వాయులీన గానాలు
తగలబడుతున్న సముద్రాలు నారింజ రంగు చేతులు చాచి చేసిన నృత్యాలు
అడవులు నేలకూలుతూ చేసిన ఆర్తనాదాలు
వెన్నెలను మింగి, ఆనాటి రాత్రి, కొండచిలువలా బద్దకంగా నిదరోవడం
ఎందుకో మళ్లీ గుర్తుకొస్తుంది

పూలు సుతిమెత్తగా విచ్చుకుంటున్న చప్పుడు జోలపాడే వేళ
అలలుగా కదులుతున్న మేఘాల శిఖరాగ్రాలపైన, లోయలలోనా
బాధలను, దుఃఖాలను పోగొట్టే చిరునవ్వుల వెలుగు రవ్వలు ఏవో
తళుక్కున మెరుస్తూ, అందుకొమ్మని కవ్విస్తాయి
అనేక ఏళ్లుగా మిగిలిన, ఏదో ఇంకా దొరకని దేనికోసమో
ఎక్కడెక్కడో వెతికిన దివారాత్రులు ఇహ ముగిసినట్లనిపిస్తుందొక ఘడియ

సరిగ్గా అప్పుడెప్పుడో జరిగినట్లు
పూలు, ఆకులు అన్నీ రాలిపోయి, మంచు గడ్డకట్టిన దినాలలో
పసిపిల్లల లేత పాదాలు నడిచిన మేరా ఆ జాడలలో
గరికపూలు తలయెత్తి వెర్రిగా నవ్వినట్లు
రంగురంగుల పూలు తిరిగి అంతటా మొగ్గలేస్తాయి నెమ్మనెమ్మదిగా.
చల్లటి మంచు అప్పుడిక మెల్లగా కరుగుతుంది.
పసరు వాసనలతో గాలి రివ్వున వీస్తుంది నలుదిక్కులా
తొలకరి జల్లులలో తడిసిన కలల విత్తనాలు మొలకెత్తి చిగురిస్తాయి
పూలు మళ్లీ వికసించే వేళ లోకానికి ఎలాగోలా తెలిసిపోతుంది
విమల

చరాచర
నీడల చేతులతో
ఎత్తుకుని ముద్దాడుతావు
పిల్లల మీద
రెప్పలతో దరువేస్తూ
లోతులు చూస్తావు

నీతో సుఖించి, నిద్రించి
వేకువనే ఉడాయించే
చీకటి చెలికాండ్రను
సాగనంపి
బిడ్డల తల్లివవుతావు

నెత్తిన కొంగుతో
పరుగెత్తుకొచ్చి
నీ పాదాల వద్ద
ముడుచుక్కూచుంటుంది నేల
దారుల చద్ది మూటవు

నీ దెప్పుడూ పరిమళ భాష
నువ్వొదిలే పుక్కిలి
మల్లెల ముల్లె
నీ ఊపిరి ఉద్యాన వనం

చక్రవర్తి నెత్తుటి చేతులు
కడిగిన నీటితో పుట్టావు
తిరగబడి శిరసులిచ్చినవారి
చరిత్రను గానం చేస్తావు
కదలవు, కదిలిస్తావు
నిజం

మరిన్ని వార్తలు