యముడితో చెప్పిస్తేనైనా వింటారా?!

1 Oct, 2013 23:34 IST|Sakshi
యముడితో చెప్పిస్తేనైనా వింటారా?!
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఢిల్లీ పోలీసుల పాలిట ఒక పరిష్కారం లేని సమస్యగా మారింది. ఆ మహానగరంలో రోజుకు కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి. దొరికిన వాళ్లకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఎన్ని జరిమానాలు విధించినా, చలాన్లు రాసినా మందుబాబులు పోలీసుల మాటలను చెవికెక్కించుకోవడం లేదు. అరే.. మీరు తాగి డ్రైవ్ చేస్తే.. మీ ప్రాణాలకే కాక పక్కవారి ప్రాణాలకు కూడా ప్రమాదం కదా.. అని పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు వినడం లేదు. ఎన్ని రకాలుగా హెచ్చరించినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. తాగి వాహనం నడిపే వాళ్లకు యమరాజును చూపి భయపెడుతున్నారు. మీరు తాగి వాహనాన్ని నడిపిస్తే యముడు వచ్చి మీ ప్రాణాలను తీసుకెళ్తాడని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా యముడి ఫోటోలు, వాటి కిందే హెచ్చరిక రాసి రోడ్లపక్కన పోస్టర్లు అతికిస్తున్నారు. అలాగే ప్రత్యేకమైన వీడియోలు రూపొందించి సినిమా థియేటర్‌లలో ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు యముడి  హెచ్చరికలతో కూడిన వీడియోలను చూసైనా జనాల్లో మార్పు వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ పోలీసులను ఆదర్శంగా తీసుకుని చెన్నై పోలీసులు కూడా ఆ వీడియోలను తెప్పించుకున్నారట. మరి ఈ హెచ్చరికలతో కొంతమందిలో మార్పు వచ్చినా.. వారి ప్రాణాలను నిలబెట్టినందుకు యమరాజుకు థ్యాంక్స్ చెప్పవచ్చు.
 
మరిన్ని వార్తలు