కార్బన్‌తో  కాలుష్యం లేని విద్యుత్తు...

24 Jan, 2018 02:10 IST|Sakshi

భూమి పొరల్లో దాగిన బొగ్గుతో పాటు.. అన్నిరకాల సేంద్రియ పదార్థాలతో కాలుష్యం ప్రమాదం లేకుండానే బోలెడంత విద్యుత్తును తయారుచేసేందుకు ఇడాహో నేషనల్‌ లేబొరేటరీ (అమెరికా) శాస్త్రవేత్తలు వినూత్నమైన ఫ్యూయల్‌సెల్‌ను ఆవిష్కరించారు. గతంలోనూ ఇలాంటి డైరెక్ట్‌ కార్బన్‌ ఫ్యూయల్‌సెల్స్‌ ఉన్నప్పటికీ వాటితో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన కొత్త ఫ్యూయల్‌సెల్‌ ఎంతో సమర్థవంతమైందని డాంగ్‌ డింగ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. అతితక్కువ ఉష్ణోగ్రతలోనే ఎక్కువ మోతాదులో శక్తిని విడుదల చేయడం దీనికున్న ప్రత్యేకతల్లో రెండు మాత్రమేనని, బొగ్గుతోపాటు సేంద్రియ వ్యర్థాలన్నింటితోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయగలగడం ఇంకో విశేషమని వివరించారు.

సీరియం ఆక్సైడ్‌తోపాటు పింగాణీ పదార్థంతో తయారైన ఐనోడ్‌లు ఇందుకు కారణమని చెప్పారు. ఈ ఫ్యూయల్‌ సెల్‌ ద్వారా స్వచ్ఛమైన బొగ్గుపులుసు వాయువు మాత్రమే విడుదలవుతుంది కాబట్టి దాన్ని కూడా వాతావరణంలోకి చేరకుండా అక్కడికక్కడే నిల్వ చేసుకునేందుకు లేదంటే వాణిజ్యస్థాయిలో వాడుకునేందుకు అవకాశముంటుందని డింగ్‌ తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే... బొగ్గును వాడుకున్నా ఏమాత్రం కాలుష్యం లేకుండా అధిక విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ ఫ్యూయల్‌సెల్‌ ఉపయోగపడుతుందన్నమాట. కార్బన్‌డయాక్సైడ్‌ను నిల్వ చేసుకునే అవకాశం ఉండటం అదనపు లాభం.  

మరిన్ని వార్తలు