ఉరుముతున్న కాలుష్య మేఘాలు..

5 Jun, 2018 09:09 IST|Sakshi

నేడు పర్యావరణ దినోత్సవం

ఒకవైపు కొరవడుతున్న పర్యావరణ స్పృహ.. మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో మహానగరం విలవిల్లాడుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికరమైన వ్యర్థాలు, నానాటికీ పెరుగుతున్న వాహనాలతో పెచ్చరిల్లుతున్న ఉద్గారాలు, ఈ–వ్యర్థాలు, విచ్చలవిడిగా చెత్తా చెదారాలు.. ఇలా ఒకటనేమిటి ఎన్నో విధాలుగా పర్యావరణంపై కాలుష్యం పడగ విప్పుతోంది. జనజీవనంపై పెనుప్రభావం చూపుతోంది. జల, వాయు, శబ్ద కాలుష్యంతో నగర ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అటు ప్రభుత్వాలు, అధికారులు, వ్యక్తిగతంగా ఎవరూ శ్రద్ధ కనబరచకపోవడంతో ప్రకృతి విషతుల్యంగా మారుతోంది. ఎవరికి వారు దీనిపై చైతన్యవంతులైతేనే ఈ దుస్థితి నుంచి బయటపడవచ్చు.     

అనర్థం ‘ఈ వ్యర్థం’ 
సనత్‌నగర్‌: ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ– వేస్ట్‌) పెనుసవాల్‌గా మారాయి. ఒకవైపు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మనిషి సృష్టిస్తున్న అద్భుతాలకు మురిసిపోతుంటే.. మరోవైపు అవే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. మనిషి అభివృద్ధి ముసుగులో తాను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమేననే పరిస్థితులు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.

సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఛార్జర్, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్‌లు, రిమోట్లు, సీడీలు, హెడ్‌ఫోన్లు, జిరాక్స్‌ యంత్రాలు, ప్రింటర్స్, సీపీయూ (సెంట్రల్‌ పాసెసింగ్‌ యూనిట్లు), ఐప్యాడ్, ప్యాక్స్‌ యంత్రాలు.. ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు మనిషి జీవితంలో భాగమయ్యాయి. వాడి పారేసిన ఆయా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయి. ఈ– వ్యర్ధాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి భూ గర్భ జలాలను విషతుల్యం చేస్తూ మానవ మనుగడకు మనిషి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి.  

హెచ్‌ఎండీఏ నుంచే 33,000 టన్నులు..  
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)చే ఈ– వేస్ట్‌పై 2017–18కు సర్వే చేయించింది. దీని ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో 33,000 టన్నుల ఈ– వేస్ట్‌ ఏటా విడుదలవుతున్నట్లు డ్రాప్ట్‌ నివేదికను పీసీబీకి అందించింది. అందులో సింహభాగం కంప్యూటర్స్, టెలివిజన్స్, ప్రింటర్స్, మొబైల్‌ ఫోన్ల వ్యర్థాలే ఉండడం గమనార్హం. 2016–17కు 28,790 టన్నుల ఈ– వ్యర్ధాలు విడుదల కాగా ఈ ఏడాది ఐదువేల టన్నులకుపైగా పెరిగింది. ఇలా ప్రతి ఏటా ఈ వ్యర్థాలు వెలువడే శాతం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో ఈ– వ్యర్థాల విడుదలలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, చైన్నైలు ఉండగా హైదరాబాద్‌ ఏడో స్థానంలో ఉంది.  

ఎంతో ప్రమాదకరం.. 
ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా చిప్, సర్క్యూట్, మదర్‌బోర్డు వంటి తయారీలో సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్‌ తదితర ప్రమాదకరమైన వాటిని ఉపయోగిస్తారు. వీటితో తయారైన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పారేయడంతో ఆయా రసాయనాలు భూమిలో కలిసి మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెడితే వెలువడే విష వాయువులు వాతావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. రీచార్జిబుల్‌ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో సీసాన్ని అధికంగా ఉపయోగిస్తారు.

సీసంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమ్యాంద్యం వస్తుంది. కంప్యూటర్‌ మానిటర్, సర్క్యూట్‌ బోర్డులు, కంప్యూటర్‌ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాల కాడ్మియం ప్రభావంతో మూత్రపిండాలు, ఎముకలు బలహీనపడతాయి. వెన్నెముక, కీళ్లలో నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని స్విచ్‌లు, పాకెట్‌ క్యాలిక్యులేటర్, ఎల్‌సీడీల తయారీలో ఉపయోగిస్తారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలిగిస్తోంది. సెమీ కండక్టర్లు, డయెడ్‌లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్‌ వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాహన విస్ఫోటనం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వాహన విస్ఫోటనం  ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో వాహనాల సంఖ్య అరకోటి దాటింది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు. తాజాగా మెట్రో రైళ్లు  అందుబాటులోకి వస్తున్నా వ్యక్తిగత వాహనాల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. అయినా నగరవాసి  సొంత వాహనానికే  మొగ్గు చూపుతున్నాడు. మరోవైపు  కాలం చెల్లిన వ్యక్తిగత, రవాణా వాహనాల కారణంగా  కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో వాహనకాలుష్యం గురించి  15 ఏళ్ల క్రితమే భూరేలాల్‌ కమిటీ  ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజా రవాణా వినియోగం పెరగాలని, సీఎన్‌జీ,ఎల్పీజీ వంటి సహజ ఇంధనాలు అందుబాటులోకి రావాలని సూచించింది. వాహన కాలుష్యానికి ప్రధాన కారణమైన ఆటోరిక్షాలపైన  ఆంక్షలు విధించాలని చెప్పింది. ఆ సిఫార్సుల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. ఏటా  వ్యక్తిగత వాహనాలు వెల్లువలా వచ్చిపడుతూనే ఉన్నాయి. జనాభా అవసరాలకు తగిన విధంగా ప్రజారవాణా బలోపేతం కావడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌లో  వాహనాల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇందులో 40.51 లక్షల బైక్‌లు,  9.43 లక్షలకు పైగా వ్యక్తిగత కార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండడం గమనార్హం. ప్రతి సంవత్సరం  5 లక్షల  వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి.  

కొరవడిన నియంత్రణ.. 
ఆర్టీసీలో ఉన్న సుమారు 1000 డొక్కు బస్సులు సిటీ రోడ్లను కాలుష్యంతో ముంచెత్తుతున్నాయి. 1.4 లక్షల ఆటోలు ఉంటే  అందులో 80 వేలకు పైగా కాలం చెల్లినవే. ఈ ఆటోల్లో వినియోగించే నకిలీ టూ టీ ఆయిల్‌ వల్ల  సల్ఫర్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ప్రమాదకరమైన  కాలుష్యకారకాలు  వెలువడుతున్నాయి. స్కూల్‌ బస్సులు, లారీలు, వ్యాన్‌లు, తదితర కేటగిరీకి చెందిన వాటిలో  ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి  దిగుమతి అయిన పాత వాహనాలే ఉన్నాయి. నగరంలో ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యంపైన భూరేలాల్‌ కమిటీ 2002లోనే హెచ్చరించింది. తక్షణమే ఆటోలను నియంత్రించాలని సూచించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం  45 వేల కొత్త ఆటోలు వచ్చి చేరాయి. కమిటీ సూచించినట్లుగా సీఎన్‌జీ అందుబాటులోకి రాలేదు. ఎల్పీజీ బంకులు పరిమితంగానే ఉన్నాయి.  

ఇదీ పరిస్థితి... 

  • గ్రేటర్‌లో వాహనాలు ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్లకు పైగా డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతూనే ఉంది. 
  • పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి.  
  • వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్‌ డయాక్సైడ్,సల్ఫర్‌ డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. దీంతో నగరవాసులు పలు జబ్బుల బారిన పడుతున్నారు. 

జబ్బుల ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండి దగ్గరి నుంచి, తాగే నీరు, పీల్చే గాలి, ఇలా అన్నీ కలుషితమే. సంపూర్ణ ఆరో గ్యంతో జీవించాల్సిన నగరవాసులు.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య భూతం వల్ల భయంకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. గ్రేటర్‌ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల చిన్న తనంలోనే అనేక మంది శ్వాసకోశ జబ్బుల బారినపడుతున్నారు. నగరంలో ఐదు శాతం మంది పెద్దలు, 20 శాతం మంది చిన్నారులు శ్వాస కోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

వాతావరణంలో ఓజోన్‌ 100 మైక్రో గ్రాములు దాట కూడదు. పగటివేళ 120–150 మైక్రోగ్రాములు దాటుతోంది. సీసం, ఆర్సినిక్, నికెల్‌ వంటి భారలోహ ధాతువులు కలిగిస గాలి పీల్చడం ద్వారా అది శ్వాసకోశాల్లోంచి రక్తంలోకి చేరుతుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యం వల్ల ముక్కు ద్వారాలు మూసుకపోయి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. అంతేకాదు ఈ కాలుష్యం సంతాన సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

జడలు విప్పుతున్న థైరాయిడ్‌.. 
ఇప్పటి వరకు కేవలం మధుమేహ, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరం తాజాగా హైపోథైరాయిడిజంలోనూ ఇతర ప్రాంతాలతో పోటీపడుతోంది. ఇండియన్‌ థైరాయి డ్‌ ఎపిడమిలాజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లుపైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ నగరం లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధా«రణ కాగా, వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియక పోవడం శోచనీయం.  

వెంటాడుతున్న కేన్సర్‌ 
ఐఏఆర్‌సీ సర్వే ప్రకారం దేశంలో ఏటా కొత్తగా పది లక్షల క్యేన్సర్‌ కేసులు నమోదు అవుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల కేసులు నమోదు అవుతున్న ట్లు సమాచారం. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌ తక్కువగా ఉన్నా.. రొమ్ము కేన్సర్‌ మాత్రం రెట్టింపవుతోంది. మారిన జీవనశైలి ఒక కారణమైతే..నగరంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కేన్సర్‌ పెరుగుదలకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. ప్రతి వంద క్యాన్సర్‌ బాధితుల్లో 60 శాతం రొమ్ము, 40 శాతం మంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇక పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా రెండు లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతుండటం విశేషం.

జనజీవితాలపై పొగ

రోజు రోజుకు పర్యావరణంపై కాలుష్య ప్రభావం పెరుగుతూనే ఉన్నది. పరిశ్రమల యాజమాన్యాల స్వార్థానికి తోడు అవినీతి అధికారుల కారణంగా పర్యావరణ ప్రమాణాలు పడిపోతూనే ఉన్నాయి. కాలుష్య పొగలను బహిరంగంగా గాలిలోకి కలిపేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ పరిధి జీడిమెట్ల, సుభాష్‌నగర్, దుండిగల్‌ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య పొగలు ఇవి. కేవలం పరిశ్రమలే కాదు వివిధ ప్రాంతాలలో వ్యర్థాలను తగులబెడుతూ పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ దుస్థితి ఇకనైనా మారేనా!?     
– కుత్బుల్లాపూర్‌.

పర్యావరణంపై ధ్యాస.. ప్రకృతే ‘శ్వాస’
మొక్కలు నాటడంలో ఆదర్శంగా నిలుస్తున్న కళ్యాణి 

హిమాయత్‌నగర్‌: ఆమె ఒక పర్యావరణ విద్యార్థిని. ప్రకృతిపై ఎనలేని అభిమాని. పర్యావరణంపై ప్రతి పౌరుడూ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఆమె ప్రతిరోజూ నేర్చుకుంటున్నారు. అది తరగతి గదికే పరిమితం కాకుండా ఆచరణలోనూ పాటిస్తున్నారు. రహదారి పక్కన ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నారు జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ స్కాలర్‌ జి.కళ్యాణి. దీనిని ఒక యజ్ఞంలా భావించి మొక్కలు నాటేందుకు ఓ ఫౌండేషన్‌ కూడా స్థాపించారామె. ఫౌండేషన్‌ ద్వారా తోటి విద్యార్థులను ఏకం చేస్తూ పర్యావరణంపై మరింత బాధ్యతగా నిలుస్తున్నారు కల్యాణి.


 
నగరంలో ఖాళీగా కనిపించిన స్థలాలను ఎంచుకుని తోటి సభ్యులతో కలసి వారంలో రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటుతోంది. దీంతో అక్కడి ప్రజలకు ఈ మొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తూ వాటిని రక్షించాలనే మెసేజ్‌ను ఇస్తున్నారు. ఇప్పటి వరకు జేఎన్‌టీయూ, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న విషయం ప్రజల్లోకి మరింతగా వెళ్లాలంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఓ ఫౌండేషన్‌ను స్థాపించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు కళ్యాణి. ‘శ్వాస ఫౌండేషన్‌’ స్థాపించి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతకు శ్రీకారం చుట్టారు.

పచ్చదనం ప్రయోజనాలను వివరిస్తాను.. 


ఎన్విరాన్‌మెంట్‌ పీహెచ్‌డీ స్కాలర్‌గా నా చదువుకు కూడా న్యాయం చేయాలి. పర్యావరణంపై  మమకారం ఎక్కువ. అందుకే ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. రానున్న రోజుల్లో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనుంది.
– జి.కళ్యాణి, ‘శ్వాస’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు 

మరిన్ని వార్తలు