ఆకలి పాట

20 Apr, 2020 10:36 IST|Sakshi

అంతకంతకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు ఎంత కలవరపెడ్తున్నాయో.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కులీల ‘లాంగ్‌మార్చ్‌’ కూడా అంతే కలవరపెడ్తోంది. మన దేశంలో కరోనా మరణాల కంటే లాక్‌డౌన్‌ వల్ల ఆకలి చావులే ఎక్కువగా నమోదవుతాయి అని నిపుణులూ అంటున్నారు. ‘వలస కార్మికులంతా ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోండి.. నిత్యావసర సరకులతోపాటు కొంత డబ్బూ అందజేస్తాం’ అని రాష్ట్రప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభత్వమూ ప్రకటించింది. అయినా చాలా మంది వలస కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు. అన్నం దొరక్క తల్లడిల్లిపోతున్నారు. అప్పటికి మొన్న (14, ఏప్రిల్‌) ప్రధాని ప్రసంగం వరకు ఓపిక పట్టారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్టు ప్రధాని చెప్తారేమోనని ఆశపడ్డారు. (ఆకలితో 8 ఏళ్ల బాలుడి మృతి)

కనీసం వెసులుబాటైనా కల్పిస్తారేమోననే మాట కోసం ఎదురుచూశారు. అలాంటిదేమీ ప్రధాని నోట వినపడకపోయే సరికి నిరాశ చెందారు. నిస్పృహకు లోనయ్యారు. ముంబైలో దాదాపు 20 వేల మంది  వలస కార్మికులు ఒక్కసారిగా బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. మనసున్న వాళ్లను కదిలించే.. కలచివేసే సంఘటన ఇది. అంతకుముందే వందల మంది కార్మికులు నడక మొదలుపెట్టారు వాళ్ల ఇళ్లకు చేరుకోవడానికి. గమ్యం చేరుకోకముందే దాదాపు రెండువందల మంది అసువులుబాశారు. వీటన్నిటితో కలత చెందిన కవి... సంగీతకారుడు పూజన్‌ సాహిల్‌ ‘భూఖ్‌ ( ఆకలి)’ పేరుతో ఓ పాటరాసి సంగీతం సమకూర్చి.. వలస కూలీల కాలి బాట దృశ్యాలతో వీడియో సాంగ్‌గా మలిచాడు. ‘జో బీమారి సే బచే, తో భూఖ్‌ సె మర్‌జాయేంగే.. (కరోనా నుంచి తప్పించుకున్నా ఆకలితో చావడం ఖాయం) అని సాగే ఈ లెటెస్ట్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు