పేదింటి పిల్లల పెద్ద విజయం!

3 Nov, 2014 22:31 IST|Sakshi
పేదింటి పిల్లల పెద్ద విజయం!

వీధుల్లో విద్యార్థులు ఊరేగింపుగా వెళ్లడం ఆ  గ్రామప్రజలకు కొత్తేమీ కాదు. ‘భారత్‌మాతాకు జై’ ‘జై జవాన్ జై కిసాన్’ ఇలా ఎప్పుడూ  వినవచ్చే నినాదాలు కాకుండా ఎప్పుడూ వినబడని  నినాదాలు వినిపించాయి. దీంతో ఆ గ్రామస్థులకు ఆసక్తి పెరిగింది. ‘చదువుకునే  హక్కు మాకు ఉంది.  చదువు చెప్పేవారు మాత్రం లేరు’... ఈ తరహా నినాదాల నేపథ్యంలో ‘టీచర్‌లు కావాలంటున్నారు. మరి ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారు?’ అనే సందేహం రావచ్చు. ఈ  సందేహనివృత్తి కోసం మనం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న భిమ్ అనే ఆ ఊరికి  వెళ్ళొద్దాం...
 
భిమ్‌లో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌లో మొత్తం 700 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే!  ఇక ప్రిన్సిపల్  పోస్ట్ ఎనిమిది ఏళ్లుగా ఖాళీగా ఉంది. మొత్తం 11 ఫస్ట్ గ్రేడ్ టీచర్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి గురించి తెలిసి కూడా  తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్లో ఎలా చదివిస్తున్నారు? ‘‘ప్రైవేట్ స్కూల్లో చదివించే  స్తోమత ఉంటే  అక్కడెందుకు చదివిస్తాం?!’’ అంటారు చాలామంది. అదనపు ఉపాధ్యాయుల నియామకం కోసం పెద్దవాళ్లు చేసిన ప్రయత్నాలను దగ్గరి నుంచి గమనించిన పిల్లలు తమ కోసం తామే ఉద్యమించాలనుకున్నారు. దానికి ‘గాంధీజయంతి’ని ముహూర్తంగా పెట్టుకున్నారు.

గాంధీ జయంతి రోజున స్కూలు గేటుకు తాళం  వేసి, బ్యానర్లు చేతబట్టి   ర్యాలీ నిర్వహించారు పిల్లలు. ఆ తరువాత   బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ముందు ఎండలో  ధర్నాకు కూర్చున్నారు. అక్టోబర్ 7లోపు కొత్త ఉపాధ్యాయుల నియామకం జరగకపోతే స్కూల్‌కు తాళం వేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడంతో  అక్టోబర్ 8న స్కూలు గేటుకు తాళం వేసి విద్యార్థులందరూ  బయటకి వచ్చారు.

పిల్లల ధర్నా  విషయం కలెక్టర్ కార్యాలయం, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, సీయం కార్యాలయాలకు చేరింది. కదలిక మొదలైంది. ఒకేరోజు...నలుగురు టీచర్ల నియామకం జరిగింది. మరుసటి రోజు ఏడుగురు ఉపాధ్యాయులూ స్కూలుకొచ్చారు.  అయితే ఈ సత్యాగ్రహం ఇక్కడితో ఆగలేదు. పొరుగున ఉన్న  ఊళ్లలో కూడా భీమ్ తరహా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫలితం ఇంకా రాలేదు. వస్తుందనే నమ్మకం మాత్రం వారిలో చాలా గట్టిగా ఉంది. దీనికి కారణం భిమ్ పిల్లల సత్యాగ్రహ విజయమే!

మరిన్ని వార్తలు