మరిచిపోయిన ముద్దు

17 Feb, 2018 00:31 IST|Sakshi

చెట్టు నీడ 

ఒక పదిహేను నిమిషాల తర్వాత,
ఇంటిముందు కారు ఆగిన చప్పుడు.
పాప తలుపు దగ్గరికి వెళ్లింది.
తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం.

‘మీటింగ్‌కు ఆలస్యమవుతోంది’ అంటూ హడావుడిగా చొక్కా టక్‌ చేసుకుని, బ్రీఫ్‌కేస్‌ పట్టుకుని బయటికి వెళ్తున్నాడు తండ్రి. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర భోంచేస్తున్న పాప, తండ్రి అలికిడి విని పరుగెత్తుకొచ్చింది. అప్పటికే ఆయన కారు ఎక్కేశాడు. పాప తన ఎంగిలి చేయి వైపు చూసుకుంటూ మళ్లీ పళ్లెం వైపు నడిచింది. అంతకుముందు బాగుందనిపించిన తిండి ఇప్పుడు సహించలేదు. చేయి కడుక్కుని తండ్రికి ఫోన్‌ చేసింది. ‘నువ్వు వెళ్లేటప్పుడు నాకు ముద్దు పెట్టడం మరిచిపోయావు’ అన్నది. ఆ స్వరంలో కొంత నింద ఉంది.  తండ్రి అది గుర్తించాడు. ‘అయ్యో నాన్నా... సారీరా... అప్పటికే లేటయిందిరా... ఇంపార్టెంట్‌ మీటింగ్‌’ వివరణలాగా పదాలను పేర్చాడు.  ‘సరేలే నాన్నా’ అని పెద్దరికం తెచ్చుకుని బదులిచ్చింది పాప.

ఒక పదిహేను నిమిషాల తర్వాత, ఇంటిముందు కారు ఆగిన చప్పుడు. పాప తలుపు దగ్గరికి వెళ్లింది. తండ్రి దిగాడు. కూతురి ముఖంలో ఆశ్చర్యం. దగ్గరికి వచ్చి, తను ఆ రోజుకు బాకీ పడిన ముద్దు పెట్టి, మళ్లీ కారెక్కి వెళ్లిపోయాడాయన. ఆయనకు ఆరోజు మీటింగ్‌ ఎంతో ప్రాధాన్యమున్నదే కావొచ్చు; కానీ రెండ్రోజులాగితే దాని గురించే ఆయన మరిచిపోవచ్చు. కానీ అదే పాప, తన తండ్రి మరిచిపోయిన ముద్దు పెట్టడానికి వెనక్కి వచ్చాడని జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. జ్ఞాపకం పరంగా ఏది మరింత ప్రాధాన్యత కలిగినదో గుర్తుంచుకుని, ఆ పని మనం చేసుకుంటూ వెళ్తే చాలు.

మరిన్ని వార్తలు