పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం

28 Jan, 2020 06:47 IST|Sakshi

గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే.

వనరాజా కోళ్ల విశిష్టతలు
► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి.
► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ.
► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి నుంచి తప్పించుకోగలవు.
► గుడ్ల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పనికివస్తాయి.

వనరాజా కోళ్ల సామర్థ్యం
► మొదటి గుడ్డు పెట్టే రోజు నుంచి 175–180 రోజుల వరకు గుడ్లు పెడతాయి. 160 గుడ్లు పెడతాయి.
► 6వ వారంలో శరీర బరువు 2,000–2,200 గ్రాములు.
► గుడ్ల బరువు 28వ వారంలో 48–50 గ్రాములు. 40వ వారంలో 52–58 గ్రాములు.
► మొదటి 6 వారాల వరకు మరణాల శాతం 2 శాతం కంటే తక్కువ.
► ఎక్కువ సంఖ్యలో వనరాజా కోడి పిల్లలను పెంచేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో బ్రూడర్స్‌ను ఏర్పాటు చేయాలి. పిల్లలు షెడ్లకు రాక ముందు 2–3 అంగుళాల వరకు వరి పొట్టు / రంపపు పొట్టు లిట్టరు లాగా పోయాలి. అది మేయకుండా కాగితాలు పరవాలి. బ్రూడర్స్‌ చుట్టూ నీటి, మేత తొట్టెలను అమర్చాలి. కరెంటు బల్బులలతో ప్రతి కోడికి 2 వ్యాట్ల చొప్పున వేడినివ్వాలి.
► మేతలో 2,400 కేలరీల శక్తి , 16 శాతం ప్రొటీన్లు, 0.77% లైసిన్, 0.36% మిధియోనిన్, 0.36% భాస్వరం, 0.7% కాల్షియం ఉండాలి.
► ఆరువారాల వయస్సు దాటిన తర్వాత వాటిని పెరట్లో విడిచి పెట్టాలి. పెరట్లో లభించే చిన్న చిన్న మొక్కలు, నిరుపయోగ ధాన్యాలు, క్రిమి కీటకాలు, గింజలు మొదలైన వాటిని తింటూ పగలంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి.
► వివిధ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్ల పుట్టిన ఒకటో రోజున, 7వ రోజున, 14వ రోజున, 28వ రోజున, 36–42 రోజుల మధ్య, 8వ వారంలో టీకాలను విధిగా వేయించాలి.
► ఆర్థిక లాభాల కోసం కోడి పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, కోడి పుంజులను 14 లేదా 16 వారాల వయస్సు వచ్చే వరకు పెంచాలి. ఒక్కో పెట్ట 160 గుడ్లు పెడుతుందనుకుంటే రూ. 5 చొప్పున రూ. 800ల ఆదాయం పొందవచ్చు.
► దాణాను అధిక ధరకు కొనుగోలు చేయడం కన్నా రైతు తన దగ్గర ఉన్న దాణా దినుసులతో చౌకగా తయారు చేసుకుంటే, గుడ్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.

– డా. ఎం.వి.ఎ.ఎన్‌. సూర్యనారాయణ , (99485 90506), ప్రొఫెసర్‌–అధిపతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవస్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి

మరిన్ని వార్తలు