పేదరికంపై పవర్‌ పంచ్

29 Jul, 2014 23:04 IST|Sakshi
పేదరికంపై పవర్‌ పంచ్

లక్ష్యం
 
వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్‌వైపు ఎలా అడుగులు వేశారంటే...
 
నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్‌లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు  మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను.
 
ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్‌టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల  పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్.
 
ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్‌లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది.
 
సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్‌టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్‌మెడల్.
 
ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు.
 
- అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు
 - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి

 

మరిన్ని వార్తలు