పవర్‌ఫుల్అప్పియరెన్స్

23 Oct, 2013 23:53 IST|Sakshi

 ఫైటింగ్‌లతో విలన్లు...
 ‘కటింగ్’లతో హీరోయిన్లు...
 డైలాగ్స్‌తో ఆడియన్స్...
 ఎవరైనా పడిపోవాల్సిందే హీరో దెబ్బకు!
 అయితే  ఎంతమందిని కొట్టాడని, పడగొట్డాడనీ కాదు...
 స్క్రీన్‌లోంచి కొట్టొచ్చినట్టుంటేనే హీరో!
 పవన్‌లో ఆ పవర్ ఉంది.
 ఆ లుక్కు, ఆ కిక్కు, ఆ స్మైల్, ఆ స్టైల్ అన్నిట్లో...
 కరెంట్ పాసవుతూ ఉంటుంది!
 ఆరడగుల కరెంట్!!
 అదిగో... ఆ కరెంట్‌కే కొలతలు తీశాడో కుర్రాడు!
 షాక్ అతడికి కొట్టలేదు, పవన్ ఫ్యాన్స్‌కి కొట్టింది!!
 ఏం డిజైనింగ్! ఏం పవనైజింగ్!
 కొమరం పులి దగ్గర్నుంచి ‘అత్తారింటి...’ వరకు...ఏం స్టెయిలింగ్!!
 ఈవారం ‘ముస్తాబు’ కంప్లీట్‌గా పవర్‌స్టార్‌దేన ప్పా... సిద్దప్పా!

 
 అత్తారింటికి దారేది
 
 ఈ సినిమాలో గౌతమ్ పాత్ర గొప్పింటి తరహాకు చెందినది. ఫారిన్‌లో ఉండే వాతావరణాన్ని, ధనవంతుడిగా చూపించడానికి ఇందులో టీ షర్‌‌టపైన టు లేయర్‌‌సగా జాకెట్స్ వాడారు. ఈ సినిమాలో ఎక్కువగా హుడీస్, 2-3 లేయర్ టీ షర్ట్స్ వాడుతూ ట్రెండీగా ఉంచటానికి ఎక్కువగా ట్రై చేశారు.
 
 గబ్బర్‌సింగ్
 
 క్యారెక్టర్‌కు తగ్గట్టు షర్ట్ కలర్, ఫ్యాబ్రిక్ ఎలివేట్ అయ్యేలా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పోలీస్ పాత్రకు తగ్గట్టు షర్ట్స్, లెనిన్ ప్యాంట్స్ వాడారు. పెద్ద బెల్ట్ వాడటం ఇందులో హైలైట్. పాటల చిత్రీకరణలో కార్గోస్ ప్యాంట్స్ ఎక్కువ ట్రై చేశారు. వీటిలో ఎక్కువగా వాడింది పోలీస్‌యూనిఫామ్! కాని ఇందుకోసం విభిన్న రంగులను ఎంచుకున్నారు.
 
 తీన్‌మార్
 
 ఈ సినిమాలో మైఖేల్ క్యారెక్టర్ కోసం డిజైన్ చేసిన డ్రెస్ ఇది. స్టైలిష్ లుక్ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ ఇది. 2011 ట్రెండ్‌లో వస్తున్న మార్పులు, ఫ్యాషన్‌లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినది. లెనిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ప్యాంట్, లేయర్ షర్ట్, లోపల ప్రింటెడ్ టీ షర్ట్స్ వాడారు.
 
 కెమెరామెన్ గంగతో రాంబాబు

 
 కుర్తా, ధోతీ మన దేశ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన డ్రెస్. ఈ డ్రెస్‌కు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్‌ను రాజేశ్ ఉపయోగించారు. కలర్ కాంబినేషన్‌‌స ఇందులో ప్రధానమైనవి.
 
 తీన్‌మార్
 
 ఇందులోనే అర్జున్ పాల్వాయి అనే క్యారెక్టర్‌కు డిజైన్ చేసిన డ్రెస్ ఇది! 70వ దశకంలో ఉండే లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇందుకోసం లెనిన్, కాటన్ కుర్తాలు వాడారు. అలాగే డ్రెస్ ఫిట్‌గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 కెమెరామెన్ గంగతో రాంబాబు

 
 ఇందులో ముందు మెకానిక్ క్యారెక్టర్  ఉంటుంది. దానికి తగ్గుట్టు యూనిఫామ్ ఉండాలని ప్యాంట్, షర్ట్ ఒకే రంగులో ఉండేలా డిజైన్ చేశారు. జెమ్ సూట్స్, ఫుల్‌స్లీవ్స్ టీ షర్ట్, పైన యూనిఫామ్ ఇందులో బాగా ఎలివేట్ అయ్యాయి. ఆ తర్వాత  రిపోర్టర్ పాత్రకు లేయరింగ్ టైప్స్ ఎక్కువ వాడారు.
 
 ఎంపిక ముందు...
 
 మగవారికిప్యాంట్ షర్ట్ మినహా డ్రెస్సింగ్‌లో స్టైల్స్ ఏముంటాయి అనుకుంటారు. కాని కాస్త ట్రై చేస్తే ధరించే దుస్తుల్లో చాలా వేరియేషన్స్ చూపించవచ్చు. డ్రెస్‌ను ఎంపిక చేసుకునే ముందు నచ్చిన రంగులు, సౌకర్యం చూసుకోవాలి. ఆ తర్వాత కలర్ కాంబినేషన్స్, స్టైల్స్, ప్రస్తుత ట్రెండ్ దృష్టిలో పెట్టుకోవాలి. క్యాజువల్, ఆఫీస్, పార్టీ... ఇలా దేనికి ఎలా రెడీ అవ్వాలనే విషయంపైనా అవగాహన ఉండాలి. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం.. ఏ పార్టీ ఏ తరహాకు చెందినదో.. దానిని బట్టి డ్రెస్ ఎంపిక, స్టైల్స్ సెట్ చేసుకోవాలి. ఏ డ్రెస్ ధరించినా ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ సర్‌కి డిజైన్ చేశాను.
 - రాజేష్ మోరే, పవన్ కళ్యాన్ కాస్ట్యూమ్స్ డిజైనర్
 

మరిన్ని వార్తలు