సాహో కోసం...

13 Aug, 2019 06:34 IST|Sakshi

ఎత్తుగా ఉన్న పర్వతాన్ని చూసి భయపడనక్కర్లేదు. లోయలో నిలబడి కుంగిపోనక్కర్లేదు. అధిరోహించొచ్చు. ఆ పర్వతం భుజం మీద ఎక్కి పర్వతం ఇచ్చిన ఆనందానికి చప్పట్లు కొట్టొచ్చు. ‘సాహో’ సినిమా ఒక పర్వతం లాంటిది. దాన్ని గౌరవించడానికి, కీర్తించడానికి మాత్రమేచాలా సినిమాలు డేట్లు మార్చుకున్నాయి. ఆ సినిమాల హీరోలు ‘సాహోను సెలబ్రేట్‌ చేద్దాం’ అని పర్వతం భుజం మీద ఎక్కి చప్పట్లు కొడుతున్నారు.

‘టిప్పర్‌ లారీ వచ్చి స్కూటర్‌ని గుద్దితే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది నేను గుద్దితే’ అని ‘బుజ్జిగాడు’ సినిమాలో విలన్‌కు తన స్టామినా గురించి వార్నింగ్‌ ఇస్తాడు ప్రభాస్‌. ఇప్పుడు ప్రభాస్‌ టిప్పర్‌ లారీ కాదు బుల్డోజర్‌. బాక్సాఫీస్‌ని బలంగా తాకి వసూళ్లను భారీగా కొల్లగొట్టే బుల్డోజర్‌. ఇప్పుడు ఆ బుల్డోజర్‌ మరోసారి బాక్సాఫీస్‌ను ఢీ కొనడానికి  దూసుకొస్తోంది. రోడ్డు ఎంత ఖాళీగా ఉంటే ఫోర్స్‌ అంత గట్టిగా ఉంటుంది. ‘సాహో’ ఇంకా గట్టిగా యాక్సలేటర్‌ తొక్కేందుకు మిగతా సినిమాలు సైడ్‌ ఇండికేటర్‌లు వేసి సైడ్‌ అయ్యాయి. రూట్‌ క్లియర్‌ చేశాయి. ‘సాహో’ సోలో రిలీజ్‌ కోసం తమ సినిమాల రిలీజ్‌లు వాయిదా వేసుకున్నాయి. ‘సాహో’ డేట్‌ పోస్ట్‌పోన్‌ కావడంతో డేట్స్‌ షిఫ్ట్‌ అయిన సినిమాలు, డేట్‌ షిఫ్ట్‌ చేసుకున్న సినిమాల వివరాలు ఓ సారి చూద్దాం. 

‘సాహో’ సినిమాను ముందుగా ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం. నేషనల్‌ హాలిడే. ఓపెనింగ్స్‌ సృష్టించడానికి ఓపెన్‌ గ్రౌండ్‌. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో పూర్తవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉడకని విందుభోజనాన్ని ఆడియన్స్‌ను అందించడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి... అందుకే 15 రోజులు పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు. ఆగస్ట్‌ 30న వస్తున్నారు. దాంతో ఆగస్ట్‌15 ఖాళీ ఏర్పడింది. ఆ డేట్‌ను శర్వానంద్‌ ‘రణరంగం’, అడవి శేష్‌ ‘ఎవరు’ సద్వినియోగం చేసుకున్నాయి. సరైన డేట్‌ కోసం చూస్తున్న ‘రణరంగం’కి మంచి డేట్‌ కుదిరింది. 23 వస్తున్నాం అని అనౌన్స్‌ చేసిన ‘ఎవరు’ వారం ముందే వచ్చేస్తోంది. క్యాలెండర్‌లో కొంచెం ముందుకెళ్తే ఆగస్ట్‌ 30. నానీ ‘గ్యాంగ్‌ లీడర్‌’, సూర్య ‘బందోబస్త్‌’ (తమిళంలో ‘కాప్పాన్‌’) రిలీజ్‌ డేట్‌లు ప్రకటించాయి. ‘సాహో’ ఆగస్ట్‌ 30కు రావడంతో ఆ రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి.

‘సాహో’ కథేంటి?
ట్రైలర్‌ను బట్టి గమనిస్తే... ముంబైలో రెండు వేల కోట్ల చోరీ జరుగుతుంది. దీన్ని ఛేదించడానికి ‘అశోక్‌ చక్రవర్తి’ (ప్రభాస్‌ పాత్ర పేరు) అనే అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ రంగంలో దిగుతాడు. మరోవైపు ‘వాజీ’ అనే భయంకరమైన సిటీ. గ్యాంగ్‌స్టర్స్‌ అడ్డా. అందులో ఓ బ్లాక్‌ బాక్స్‌. ఆ బాక్స్‌ సంపాదిస్తే చాలు ప్రత్యేకంగా డబ్బు సంపాదించాల్సిన పనిలేదు. కోటీశ్వరులు అయిపోవచ్చు. దానికోసం ప్రయత్నాలు జరుగుతుంటాయి. ముంబైలో చోరీకి, వాజీ సిటీకి ఏంటి సంబంధం?  తెలియాలి. ‘‘సాహో’ స్క్రీన్‌ప్లే ప్రధానమైన చిత్రం. పాత్రలు మంచివా చెడ్డవా అనేవి స్క్రీన్‌ప్లే మారుస్తుంది’’ అంటోంది చిత్రబృందం. మరి ప్రభాస్‌ హీరో  నా? హీరో ముసుగులో ఉన్న విలనా? విలన్‌గా కలరింగ్‌ ఇచ్చే హీరోనా? ప్రస్తుతానికి సస్పెన్సే. 

పోస్ట్‌పోన్‌ చేసుకున్న సినిమాల వివరాల్లోకి వెళ్తే ...

‘గ్యాంగ్‌ లీడర్‌’ కహానీ క్యా హై?
పార్థసారథి.. రివెంజ్‌ స్టోరీల రైటర్‌. రివెంజ్‌ కథలు రాశాడంటే తిరుగే లేదు. ఓ రివెంజ్‌ స్టోరీ రాయమని పార్థసార థి దగ్గరకు వస్తుందో గ్యాంగ్‌. ఆ గ్యాంగ్‌లో స్కూల్‌ పాప నుంచి బామ్మ వరకూ ఐదుగురు అమ్మాయిలు ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ల రివెంజ్‌ తీర్చుకునే ప్లాన్‌ను సారథి రాయాలి. రాయడమే కాదు వాళ్లకు రథసారథి కూడా కావాలి. నానీ ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్ర కథ ఇది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.  ఆగస్ట్‌ 30న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్‌ 13న రిలీజ్‌ కాబోతోంది. ‘‘సాహో’ మనందరి సినిమా. దేశవ్యాప్తంగా  బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. ‘సాహో’ విజయం సాధిస్తే మనందరం సెలబ్రేట్‌ చేసుకుంటాం. ప్రభాస్‌ అన్నకు, సాహో టీమ్‌ అందరికీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్‌ ద్వారా ‘సాహో’కు శుభాకాంక్షలు తెలిపారు నాని.

‘బందోబస్త్‌’ ఎవరికి?
ప్రధాన మంత్రిని కాపాడే  ‘స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌’ అతను. ప్రధానిగా మోహన్‌లాల్, అతనికి బందోబస్త్‌గా నిలిచే పాత్రను సూర్య చేశారు. కేవీ ఆనంద్‌ దర్శకుడు.‘అయాన్‌’  (తెలుగులో వీడొక్కడే), ‘మాట్రాన్‌’ (బ్రదర్స్‌) ఇది వరకు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు  ‘బందోబస్త్‌’ వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా.   ఆగస్ట్‌ 30న విడుదల చేయాలనుకున్నా ఈ సినిమా సెప్టెంబర్‌ 20న రిలీజ్‌ కానుంది.

ఏడుగురు  ఛిఛోరేల కథ
కాలేజీ రోజుల్లో రేపు అనేది లేనట్టు జీవితాన్ని ఆస్వాదిస్తాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తాం. మన గ్యాంగ్‌తో జ్ఞాపకాల్ని సృష్టించుకుంటాం. కాలేజీ అయిపోయిన తర్వాత? కలుస్తామో లేదో? కుదురుతుందో లేదో? ఈ కాన్సెప్ట్‌తో ‘దంగల్‌’ దర్శకుడు నితేష్‌ తివారీ తీసిన సినిమా ‘చిచోరే’. ఏడుగురు స్నేహితుల జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, నవీన్‌ పొలిశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. ‘ఛిఛోరే’ కూడా ఆగస్ట్‌ 30 రిలీజ్‌ . ఇప్పుడు సెప్టెంబర్‌ 6కి పోస్ట్‌పోన్‌ చేశారు. 

మేడ్‌ ఇన్‌ చైనా
‘మేడ్‌ ఇన్‌ చైనా’... మన రోజువారి జీవితంలో చాలాసార్లు వింటాం, చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే క్రేజీ టైటిల్‌తో రాజ్‌ కుమార్‌ రావ్‌ ఓ సినిమా చేస్తున్నారు. గుజరాతీ బిజినెస్‌ మేన్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలని చైనా వెళ్లి అక్కడ ఏం నేర్చుకున్నాడు అన్నది కథ. ఈ సినిమా కూడా ఆగస్ట్‌ 30న థియేటర్స్‌లో పడాలి. కానీ పోస్ట్‌పోన్‌ అయిందని తెలిసింది. ఏదైనా పెద్ద సినిమా ముందు ప్లాన్‌ చేసినట్టుగా రిలీజ్‌ కాకపోతే ఆ ప్రభావం అన్ని సినిమాల మీద పడుతుంది. తేదీలు మార్చుకోవాల్సి ఉంటుంది. సైకిల్‌ దెబ్బతింటుంది. ఉదాహరణకు గత ఏడాదినే తీసుకుంటే.. రజనీకాంత్‌ ‘కాలా’ ఏప్రిల్‌ 27న రిలీజ్‌ కానున్నట్టు ప్రకటించారు. ఆ డేట్‌పై ఆల్రెడీ మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’, అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు కన్నేశాయి. ఈ రెండు చిత్రబృందాలు చర్చలు జరిపి రిలీజ్‌ డేట్లు మార్చుకున్నాయి. మొండిగా తలపడి థియేటర్లను, కలెక్షన్లను షేర్‌ చేసుకునే బదులు విడివిడిగా సోలో రిలీజ్‌ బెనిఫిట్‌లు ఎంజాయ్‌ చేసుకోవచ్చు. (పండగ సీజన్లను మినహాయించి) ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘ఫస్ట్‌ వీక్‌’ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నదే కీలకంగా మారింది. క్లాష్‌ వద్దూ కాంప్రమైజే ముద్దు అనుకోవడం శుభ పరిణామం. క్లాష్‌ అయి ఏ టిక్కెట్టు కొనాలో ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్‌ చేయకుండా సోలోగా వస్తే నిలువుదోపిడీ సమర్పించు కోవడానికి ప్రేక్షకుడు ఎప్పుడూ సిద్ధమే. – గౌతమ్‌ మల్లాది

అందరికీ ధన్యవాదాలు...
‘సాహో’ సినిమాకు సోలో రిలీజ్‌ ఇవ్వడం కోసం  పోస్ట్‌పోన్‌ చేసుకున్న సినిమా టీమ్స్‌ అందరికీ ‘సాహో’ బృందం తరఫున ధన్యవాదాలు తెలిపారు ప్రభాస్‌. ‘‘తమ సినిమాలను పోస్ట్‌పోన్‌ చేసుకున్న యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ అందరికీ పెద్ద థ్యాంక్స్‌. మా ‘సాహో’ టీమ్‌ మీ అందరికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటుంది. మీ సినిమాలకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని ప్రభాస్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా తెలిపారు. 

శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా.. నహీ!

ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకేరోజు తన రెండు సినిమాలు విడుదలైతే అదో కిక్కు. ఒకప్పటి స్టార్స్‌కి ఇలాంటి సీన్‌ దాదాపు ప్రతి శుక్రవారం ఉండేది. అయితే ఈ తరం తారలకు ఎప్పుడో కానీ అలా కుదరదు. ఈ ఏడాది శ్రద్ధాకపూర్‌ ఆ కిక్‌ని ఆస్వాదించగలుగుతారని చాలామంది ఊహించారు. ఎందుకంటే ‘సాహో’, ‘ఛిఛోరే’ ఒకేరోజు విడుదలయ్యే పరిస్థితి కనిపించింది. అయితే శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా నహీ (లేదు). ఎందుకంటే ‘సాహో’ హిందీలోనూ విడుదలవుతోంది కాబట్టి.. అక్కడి సినిమాలు కొన్ని వెనక్కి తగ్గాయి. అలా శ్రద్ధా కపూర్‌ ‘ఛిఛోరే’ కూడా వాయిదా పడింది.  

మరిన్ని వార్తలు