ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు

25 Aug, 2019 07:32 IST|Sakshi

సువార్త

ఎలీషా ప్రవక్త  శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా  వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) 

నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ  ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన  ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు  కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది.  

తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని  అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్‌ టేలర్‌ ఇంగ్లాండ్‌ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. 
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా