మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!

14 Jul, 2014 00:55 IST|Sakshi
మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!

తనికెళ్ల భరణి...
ఈ ప్రపంచానికి ఒక్కడిగా కనిపించొచ్చు!
కానీ ప్రకాశ్‌రాజ్‌కి మాత్రం
భరణి చుట్టూరానే ప్రపంచం కనిపిస్తుంది!
ప్రకాశ్‌రాజ్ సుదీర్ఘ ప్రయాణంలో
ఓ రహదారిలా... ఓ వారధిలా...
దొరికిన సాంగత్యం భరణి!
వీరిద్దరి స్నేహంలో ఓ ప్యాసా ఉంది...
ఓ అంతుచిక్కని మజా ఉంది..!
భరణి గురించి ప్రకాశ్‌రాజ్ హృదయావిష్కరణ...

‘సాక్షి’కి ప్రత్యేకం


మనం ప్రేమించిన క్షణం... గడిచిపోయిన క్షణం కాదు. తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్లీ మళ్లీ బతికే క్షణం! ‘దేవదాసు’ చేసిన 20 ఏళ్ల తర్వాత దిలీప్‌కుమార్‌గారు బెంగళూరు వెళ్లారు...ఓ అభిమాని ‘దేవదాసు’ని గుర్తు చేసి‘ఎంత బాగా చేశారండీ’ అని ప్రశంసించాడు.దిలీప్‌కుమార్ కదిలిపోయారు.నేను వేషం వేస్తున్నప్పుడు బతికింది ఒక్క క్షణమే.తెరపై ఆ పాత్రను చూసి ప్రేక్షకుడు పులకించిందీ

ఒక్క క్షణమే!
 అయితే ఆ పులకింతలన్నీ అనంతవాహినిలా ప్రవహిస్తూ... ఇరవై ఏళ్ల తర్వాత కూడా మళ్లీ నా క్షణాన్ని నాకు గుర్తు చేసింది కదా అనుకున్నారు దిలీప్‌కుమార్. తనికెళ్ల భరణి పొయిట్రీ చదువుతుంటే కూడా నాకదే ఫీలింగ్... మళ్లీ మళ్లీ బతికే క్షణం!
   
అసలు తనికెళ్ల భరణి ఎవరు? నేను ఎవరు?
ఓ రచయితగా, నటునిగా వాడు నాకు తెలియదు... నేనూ వాడికంతే! ఓ జర్నీ చేయడానికి ఇద్దరం దొరికాం.పది పదిహేనేళ్ల నుంచి జరుగుతున్న జర్నీ ఇది. ఒకరికొకరం వెతుక్కుంటూ వెళ్తే దొరికినవాళ్లం కాదు!
 వాడి ప్రపంచం వేరు... నా ప్రపంచం వేరు.అయినా కలిశాం. ఎందుకు కలిశామంటే... మేం కలవాలంతే!
   
భరణి అంటే ఎందుకిష్టమంటే? ఏమో చెప్పలేను.
కొన్నింటిని ఎక్స్‌ప్రెస్ చేస్తే ఆ మిస్టరీ పోతుంది. మా ఇద్దర్నీ కలిపింది కవిత్వం కాదు.. జీవనోత్సాహం! వాడు చాలా ప్రామాణికుడు... నిజంగా ప్రేమిస్తాడు. ఆత్మబంధువులా ఉంటాడు. కొందరే ఉంటారలా! తన ఆంతర్యాన్ని, ఆత్మను, అభివ్యక్తీకరించే తీరు... అదే నాకు నచ్చుతుందేమో!
   
భరణి రాసిన ‘శృంగార గంగావతరణం’ చదివారా?
వెంటనే చదవండి. ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని, వినిపించాడు నాకు.శివుడు తన జటాజూటంలో గంగాదేవిని బంధిస్తే..గంగకే చెమట్లు పట్టడం లాంటి ఎక్స్‌ప్రెషన్స్... ఎన్నెన్నో!
   
కొన్ని నెలల తర్వాత కలిసినా...
‘అరె.. నిన్ననే కలిశాం కదా’ అనిపించడమంటే.. ఆ బంధంలోని గాఢత్వం గురించి ఇంకేం చెప్పాలి? వాడు సంబరం చేసుకుంటుంటే వాడిలో సగమై నేనుంటా! నేను ఉత్సాహంతో ఊరేగుతుంటే వాడు నాలో ఉంటాడు! ఎక్కడో అమలాపురంలో షూటింగంతా కానిచ్చేసి మహ్మద్ రఫీ పాట వింటూ... ఓ తన్మయావస్థలో ఉన్నప్పుడు వాడు గుర్తుకొస్తాడు. చిన్న ఫోన్ కాల్... రెండు నిమిషాల టాక్... ఎందుకో ఆ సఖ్యం ఎప్పుడూ కావాలనిపిస్తుంది.
  
ప్రపంచంలో వాడొక భాగం కాదు... వాడి చుట్టూరా ఉన్నదే ప్రపంచం! అక్కడ్నుంచే అసలు ప్రపంచం మొదలైందనిపిస్తుంది. వాడి అమెరికా వేరు... వాడి పల్లెటూరి వేరు. వాడి శివుడు వేరు.. వాడి ప్రేమ వేరు. నాదీ అదే పరిస్థితి! ఈ తీవ్రతే... ఈ విభిన్నతే...

మా ఇద్దరికీ బ్రిడ్జ్ వేసినట్టుంది.
ప్రతి మనిషిలోనూ పొయిట్రీ ఉంటుంది. ఆస్వాదించడం తెలియాలి... ఆహ్వానించడం రావాలి. వాడి ఆలోచనలెప్పుడూ ప్రెగ్నెంటే! అదే వాడిలో ఉన్న బ్యూటీ ఏమో!!
   
 ఫేమస్ పొయిట్ వర్డ్స్‌వర్త్ ఏమంటాడంటే... నువ్వో చెట్టు కింద విశ్రమిస్తే- ఎక్కడి నుంచో కోయిల పాట వినిపిస్తుంది.. ఆస్వాదించు. అంతేగానీ... అది ఎక్కడ నుంచి పాడుతుంది? ఎందుకు పాడుతుంది? దాని సైజేంటి? కలరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరమా నీకు? ఎక్కడో పడిన వర్షానికే ఇక్కడ చల్లగాలి వీస్తుంది. ఇదొక జర్నీ. దాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించడం తెలియాలి. భరణితో ప్రయణాన్ని కూడా ఎలాంటి ప్రశ్నలూ వేసుకోకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా!
   
 నేను ‘భరణీ’ అని పిలుస్తాను. వాడు నన్ను ‘ప్రకాశ్’ అంటాడు.

ఎందుకో ఆ చనువు అలా వచ్చేసింది! నా వయసెంతో తనకు తెలీదు... అతని వయసు గురించి నాకనవసరం.
ఎక్కడో నేను చూసిన వింతైన మనుషులు, గమ్మత్తయిన సంఘటనలు, కొన్ని మాటలు, కొంత మౌనం... ఇవన్నీ భరణితో షేర్ చేసుకోవాల్సిందే. బయటకు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కానీ, ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిందే. మన దృష్టితో ఆలోచించేవాడయితేనే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కుదురుతుంది. భరణి అలాంటివాడే!
   
గుత్తొంకాయ కూర... తింటే వాడింట్లో తినాల్సిందే!

షూటింగ్‌లో కలుసుకున్నప్పుడు... రేపు లంచ్‌లో మెనూ ఇదీ అంటాడు. తను రాకపోయినా గుత్తొంకాయ కూర వస్తుంది. ఆ రంగు.. రుచి.. వాసన.. ఆహా.. నోరూరిపోతుంది! ఫోన్ చేసి బావుందిరా అంటే... వాడి మనసు నిండిపోతుంది. అప్పుడప్పుడూ... చెన్నైలో సముద్రపు ఒడ్డున కూర్చుంటాం. ఎదురుగా సముద్రం... మాకిష్టమైన బ్రాండ్... ఇక మాటలే మాటలు..! నేను కర్నాటక పొయిట్రీ గురించి చెబుతాను... వాడు తెలుగు లిటరేచర్‌లోని అందాలు ఆవిష్కరిస్తాడు! ఇద్దరం అలా అలా... మరాఠీ కవితల్లోకి .. బెంగాలీ కథల్లోకి కొట్టుకెళ్లిపోతాం.
   
జయంత్ కైకిని అని కన్నడంలో గొప్ప కవి. తను రాసిన ‘శబ్ద తీర’ పుస్తకం ఇప్పుడు చదువుతున్నా. ఓసారి అనుకోకుండా ముగ్గురం కలిశాం. జయంత్‌కి, భరణికి ఒకరికొకరికి ముఖపరిచయం లేదు. కానీ బాగా పరిచయస్తుల్లా కలిసిపోయారు. భరణి పొయిట్రీ గురించి జయంత్ ఆశువుగా చెప్పేస్తున్నాడు... జయంత్ కథల్లోని మెరుపుల గురించి భరణి తన్మయంగా వివరిస్తున్నాడు... వాళ్లిద్దర్నీ అలా చూస్తూ నాలో నేనే మైమరచిపోయా! వారిద్దరికీ బ్రిడ్జ్‌ని నేనే కదా మరి!

   
ఈ భార్య, పిల్లలు, ప్రియురాలు, స్నేహితుడు... ఇలా కొంతమందికే పరిమితమైన ఆప్తవలయంలో వాడు ఉన్నాడు. మా రిలేషన్‌షిప్ దేనికీ ఆనదు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే నేనెక్కువ మాట్లాడలేకపోతున్నా. అయినా మా జర్నీ ఇంకా ఉంది కదా... మరింకెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అందుకే మళ్లీ కలుద్దాం!
 బై!
 సంభాషణ: పులగం చిన్నారాయణ

మరిన్ని వార్తలు