నిత్య ప్రార్థనేనిత్య జీవము

19 Jun, 2014 22:49 IST|Sakshi
నిత్య ప్రార్థనేనిత్య జీవము

సువార్త

దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీ 4:6)

ప్రార్థన... దేవుడిని, భక్తుడిని అనుసంధానం చేసే సాధనం. మనల్ని ప్రభువుకు దగ్గర చేసే అతి శక్తిమంతమైన ఉపకరణం. ప్రభువు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం ప్రభువుతో ప్రార్థన ద్వారా మాట్లాడుతాం. ప్రార్థన లేని జీవితం అద్భుతాలను చూడలేదు. ప్రార్థన లేని జీవితం క్రైస్తవుని జీవితానికి సాఫల్యతనివ్వదు. అందుకే యెడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ప్రార్థన ఒక బలం. ప్రార్థన చెడును జయించే ఓ సాధనం. ప్రార్థన ఓ ధైర్యం. ప్రార్థన మనల్ని పరలోకానికి చేర్చే ఒక మార్గం.
 
మనిషికి ఎన్నో చింతలు. అది ఉంది, ఇది లేదు, ఇంకేదో కావాలి అంటూ ఆలోచనలు. అయితే దేని గురించీ అంత చింతించాల్సిన పని లేదని సూటిగా చెబుతున్నాడు ప్రభువు పై వాక్యంలో. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? నాకిది కావాలి ఇవ్వు ‘తండ్రీ అని అడిగేస్తే సరిపోతుందా? లేదు. నిండు విశ్వాసంతో, పూర్ణమనసుతో, కృతజ్ఞత నిండిన ప్రార్థన చేయాలి. విన్నవించుకోవాలి.

మనకు సర్వస్వాన్నీ అనుగ్రహించువాడు ప్రభువే. ఆయనే అన్నాడు ‘అడుగుడి ఇవ్వబడును’ అని. తండ్రీ నా శక్తి చాలదు, నాకిది అనుగ్రహించు’ అని వేడుకుంటే ఆయన తప్పక మనకు దానిని ఇస్తాడు. విశ్వాసంతో నిండిన ప్రార్థనను, నమ్మకంతో కూడా విన్నపాన్ని ఆయన ఎప్పుడూ తోసిపుచ్చడు. లోక సంబంధిత విషయాల కొరకు చింతించనవసరం లేదు. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ఓ క్రైస్తవుడిగా దైవ సంబంధిత చింతనను మాత్రమే కలిగివుండాలి.
 
ప్రార్థనాశక్తి ఎంతటిదో పలు సందర్భాల్లో రుజువు అయ్యింది. నమ్మకంతో ప్రార్థించినవారి రోగాలు నయమయ్యాయి. నమ్మకంతో ప్రార్థన చేసినవారి నుంచి దురాత్మలు దూరమయ్యాయి. యేసుక్రీస్తు సైతం ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. అంత గొప్ప ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రతిదినం దేవుడిని ప్రార్థిస్తున్నామా? ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో పడి ప్రార్థనను విస్మరిస్తున్నామా? ప్రతి క్రైస్తవుడూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రార్థనకు మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నామో తరచి చూసుకోవాలి.  నిత్యం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే... మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది.
 
- జాయ్స్ మేయర్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా