ప్రార్థనతో ఆశ్రయం...ఆనందం 

16 Dec, 2018 00:01 IST|Sakshi

సువార్త

దేవుని ‘సంపూర్ణమైన సంరక్షణ’ ఒక కవచంలాగా, ఒక దుర్భేద్యమైన కోటలాగా మనల్ని, మన కుటుంబసభ్యుల్ని ఆవరించి ఉండగా ఏ అపాయమూ మనల్ని సమీపించదన్న అంశం చాలా విలువైనది. ఎన్నోసార్లు ఆ అంశం ఇతివృత్తంగా వ్యాసాలూ రాశాను. అయితే దేవుని మీద నాకున్న ఆ విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురైంది. నా పెద్ద కూతురు ప్రవచన పెళ్లి జీవన్‌పాల్‌తో 2012లో జరిగినప్పటినుండి అతని ఉద్యోగరీత్యా వారు అబుదాబి (యుఏఐ)లో ఉంటున్నారు. మేమంతా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుండగా, 2017లో ప్రవచన గర్భం దాల్చింది. అప్పటినుండీ నా భార్య ఇక్కడినుంచి వెళ్లి కూతురుతోపాటే ఉంది. స్కానింగ్‌లో కవల పిల్లలని చెప్పడంతో మా సంతోషానికి అవధుల్లేవు. డిసెంబర్‌ 1న ప్రసవం జరుగుతుందన్నారు. కొన్ని ప్రసవ సంబంధమైన కాంప్లికేషన్స్‌ ఉన్నా మేమెంతో ఆనందంగా ఉన్నాం.

ఇంతలోనే హఠాత్తుగా, ప్రవచనకు  నొప్పులొస్తున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ నా భార్య ఏడుస్తూ ఆగస్టు 17న ఉదయం కాల్‌ చేసింది. ఏం జరుగుతోందో మాకర్థమయ్యేలోగానే మళ్ళీ కాలొచ్చింది ప్రసవమై ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. మాకెవ్వరికీ ఆనందించాలో, బాధపడాలో తెలియని అనిశ్చిత స్థితి. సరిగా ఆరు నెలల ఆరురోజులకు పుట్టారు నా మనవరాళ్లు. వెంటనే అక్కడికెళ్లి ప్రార్ధించి అక్షయ, ఆశ్రయ అని నేనే నామకరణం చేశాను. అక్షయ 440 గ్రాముల బరువు, ఆశ్రయ 536 గ్రాములుంది. వాళ్ళు బతికే అవకాశాలు 15 శాతం మాత్రమేనని. ఒకవేళ బతికినా అన్ని శరీరాంగాలు, వ్యవస్థలు ఆరోగ్యంగా, సక్రమంగా ఉండే అవకాశం 5 శాతం మాత్రమేనని డాక్టర్లు తేల్చారు. ఆది మాకందరికీ ముఖ్యంగా ప్రవచనకు, జీవన్‌ పాల్‌కు పిడుగుపాటయ్యింది. వాళ్ళు బతకడం కష్టమని ఇంత గొప్ప డాక్టర్లు తేల్చేసినా, మేమంతా ప్రార్థిస్తునే ఉన్నాము.

అయితే మనసులో ఏదో ఒక మూలన అనుమానం, దేవుడు అద్భుతం చేస్తాడా? అని. మా ఆశలు నీరుగార్చుతూ ‘అక్షయ’ 14 రోజులు మాత్రం బతికి ప్రభువును చేరుకుంది. జీవన్‌పాల్‌ తన భార్య కోసం ౖ«పైకి ధైర్యంగా కనిపిస్తున్నా, ప్రవచనను ఓదార్చడం మాలో ఎవరివల్లా కాలేదు.  దేవుడు గొప్పవాడు, శ్రమల్లో చెయ్యి విడువడు అని ప్రసంగాలు, వ్యాసాల్లో లక్షలమందికి ప్రకటించే నా విశ్వాసానికి ఇప్పుడొక పెను సవాలు ఎదురయింది. ఆ రాత్రి భోరున ఏడుస్తూ ప్రవచన వచ్చి‘డాడీ, ఎందుకిలా అయ్యింది.. ఇంకొక పాపైనా దక్కుతుందా...’ అనడుగుతుంటే నాకూ దుఃఖం పొర్లుకొచ్చింది. కాని తేరుకొని ‘విశ్వాసానికి ప్రథమ శత్రువు భయమే. నీవు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు, ఏడవొద్దు, ప్రార్థన చెయ్యి’ అని ప్రవచనను చిన్నప్పుడు సముదాయించినట్లే సముదాయించాను. ఆ రాత్రంతా మౌనంగా ప్రార్థన చేశాను. నా భార్య కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది కాని ప్రార్థన చేస్తోంది.

ఆశ్రయను బతికించమనీ, డిప్రెషన్‌ అంచుల్లో జీవచ్ఛవంలా ఉన్న నా కూతుర్ని కూడా బతికించమనీ... ఆ రాత్రంతా నేను చాలా మెల్లిగా చేసుకొంటున్న ప్రార్ధనలో ప్రతి మాటా తాను విన్నానని, అదే తనను బలపర్చిందని ఆ తర్వాత  ప్రవచన నాకు చెప్పింది. ప్రవచన ఆ కాళరాత్రిలో ఎంత బలాన్ని ప్రభువులో పుంజుకొందంటే, ఆశ్రయ ఇంక్యూబేటర్‌లో ఉన్న ఆసుపత్రికి ప్రతి రోజూ వెళ్లి ఉదయం నుండి రాత్రి భర్త తనను పికప్‌ చేసుకోవడానికి వచ్చేదాకా లాంజ్‌లోనే ప్రార్థిస్తూ కూర్చునేది. దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకునేది. కొందరైతే డిప్రెషన్‌తో ఆమె పిచ్చిదవుతోందన్నారు. డాక్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని సూచించేవారు. ఈ లోగా మా విశ్వాసానికి అన్నీ అవరోధాలే!! ఆశ్రయ బ్రెయిన్‌లో క్లాట్‌ ఏర్పడింది, ఒకసారి ఊపిరితిత్తులు రెండూ ఫెయిల్‌ అయ్యాయి, కంటిచూపు మందగించింది, శరీరంలో రక్తం తగినంతగా లేక 5 సార్లు రక్తమార్పిడి చేశారు. 

అది ప్రతిసారీ ప్రాణగండమే. రెండుసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురై ఆశ్రయకు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కాని విశ్వసించినట్టే, దేవుడు ‘చిన్నారి ఆశ్రయ నావ’ ను ఇన్ని పెను తుఫానుల్లోనూ క్షేమంగా తీరం చేరుకోవడానికి ఇమ్మానుయేలు దేవుడై తన తోడునిచ్చాడు. వైద్యచరిత్రలో మరో  అధ్యాయం సృష్టిస్తూ, వైద్యనియమాలను, విశ్వాసాలను తిరగరాస్తూ ఈ ఏడాది జనవరి 5 న ఆశ్రయ అబుదాబి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికొచ్చింది. ఇదేమీ జరగనప్పుడు, మాకొక మనవడో, మనుమరాలో పుడితే ఎవరెస్టు పర్వతమంత ఆనందం మా సొంతమనుకునే వారం. కాని జనవరి 5న ఆశ్రయ ఇంటికొచ్చినపుడు మేమనుభవించిన ఆనందం పది ఎవరెస్టు పర్వతాలకన్నా ఎక్కువే! ఎందుకంటే అన్ని ఆరోగ్యవ్యవస్థలూ సక్రమంగా, అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తూ, అందరికీ ఆనందాన్ని పంచుతూ, ఆడుతూ. దేవుని పాటలు పాడుతూ పరవళ్లు తొక్కే జలపాతం లాంటి ‘ఆశ్రయ’, దేవుడు మా కుటుంబానికిచ్చిన అపురూపమైన మాకు క్రిస్మస్‌ కానుక. దేవునిలో మా అందరి విశ్వాసం రెట్టింపయ్యింది. మానవాళికి తోడుగా ఉండేందుకు యేసుప్రభువే భువికి దిగివచ్చిన క్రిస్టమస్‌ రాబోతోంది... ఆయన తోడ్పాటును కోరుకోవడానికి అందరికీ ఇది మరో అవకాశం.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు