మేలైన ఔషధం.. మెంతులు

6 Oct, 2015 23:07 IST|Sakshi
మేలైన ఔషధం.. మెంతులు

తిండి గోల
 
మెంతులు, మెంతి పొడి, మెంతి కూర గురించి మనకు తెలిసిందే. వగరుగా, చిరుచేదుగా ఉంటూ పచ్చళ్ళకు, వంటకాలకు మంచి రుచిని తెచ్చే మెంతులు పోపుల పెట్టెలో ప్రధానంగా కనిపించే దినుసులు కూడా! చక్కెర వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని చాలా పరిశోధనల్లోనూ నిర్ధారణ అయ్యింది. ముదురు పసుపు రంగులో ఉండి, ఘాటైన సుగందం, ఔషధ గుణాలు కలిగి ఉన్న మెంతిగింజల గొప్పతనం ఇంతని చెప్పలేం. వీటిలో జిగురు, చేదు రుచి ఉండటం వల్ల జీర్ణాశయ సంబంధ సమస్యలకు నివారిణిగా ఉపయోగిస్తారు. స్థూలకాయం, చెడు కొవ్వులు, మధుమేహం అదుపుకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగిస్తారు.

జుట్టు పట్టుకుచ్చులా ఉండటానికి మెంతిపొడిని నానబెట్టి హెయిర్ ప్యాక్ వేస్తారు. అందానికి, ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే మెంతుల మూలాలు మాత్రం ఆసియాఖండంలోనివే. అయితే, ప్రధానంగా ఇవి అరబ్ దేశాల నుంచి వచ్చినట్టు, ఇరాక్‌లో క్రీ.పూ. 4000 ఏళ్ల క్రితమే ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇవి కంచు యుగానికి చెందినట్టుగా ముస్లిం సాహిత్యం ద్వారా తెలుస్తోంది. మెంతి పంట దిగుబడిలో అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఇరాన్, బంగ్లాదేశ్‌లు.. వరుసగా ఉన్నాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాలలో లెక్కేస్తే ఒక్క రాజస్థాన్‌లోనే 80 శాతంతో పంటదిగుబడి సాధించి ప్రధమ స్థానంలో ఉంది.
 
 

మరిన్ని వార్తలు