ప్రేమనగర్!

15 Jul, 2014 00:25 IST|Sakshi
ప్రేమనగర్!

గ్రంథపు చెక్క
ప్రపంచంలో ఏ నగరం కూడా ప్రేమ పునాదిగా ప్రేమకోసం స్థాపించబడలేదు ఒక హైద్రాబాద్ నగరం తప్ప. ఖులీ కుతుబ్ షా తన ప్రేయసి భాగ్‌మతి కోసం నిర్మించిన ప్రేమనగరమే హైదరాబాద్. నవాబు ఇస్లాం మతానికి చెందినవాడు. ఆయన ప్రేయసి హిందూ స్త్రీ. అట్లా హైద్రాబాద్ నగరం రెండు మతాల మధ్య సమైక్యతకు, సహజీవనానికి వారధిగా నిలిచింది. ప్రేయసి భాగ్‌మతి, అర్ధాంగి హైదర్‌బేగంగా మారంగనే బాగ్‌నగర్ హైద్రాబాద్‌గా పేరు మార్చుకుంది.

యావత్ భారతదేశంలోనే తొలిసారిగా కవిత్వాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చింది మహ్మద్ కులీ కుతుబ్‌షా. ఆ కవితా సంపుటి పేరు ‘కుల్లీయత్’. అట్లనే అప్పటి వరకూ దేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి మాహ్‌లాఖా బాయి చందా. స్త్రీల తొలి కవిత్వ సంపుటి కూడా ఆమెదే. మొదటిసారి ఒక కవీ, కవయిత్రీ కవితా సంపుటులు హైద్రాబాద్ నుండి రావడం హైద్రాబాద్ నగర అదృష్టం. ఆమె కవిత్వం ఢిల్లీ, లాహోర్, లక్నోలలో కూడా మారుమోగింది. పండితులచే ప్రశంసలు అందుకుంది.
 
హైద్రాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగ్‌మతిలకు పుత్ర సంతానం కలగలేదు. వారి ఏకైక పుత్రికే హయాత్ భక్షీ బేగం. చిన్నతనంల ఆమెను తల్లిదండ్రులు ప్రేమగా ‘‘లాడ్లీ’’ అని పిలిచేటోళ్లు. ఆమె పేరనే చార్మినార్ దగ్గర లాడ్ బజార్ వెలిసింది. ఆమెకు యుక్త వయసు రాంగనే నవాబు తన మేనల్లుడు మహమ్మద్‌తో వివాహం జరిపించినాడు. నవాబు తదనంతరం ఆ అల్లుడే వారసునిగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా పేరుతో రాజ్యాధికారం చేపట్టినాడు.ప్రజలు హయాత్ భక్షీ బేగంను గౌరవించి ‘మాసాహెబా’ అని పిలిచేటోళ్లు. ఆమె కట్టించిన మాసాహెబా ట్యాంకు కాలక్రమంలో ‘మాసాబ్‌ట్యాంక్’ అయింది.
 - లోకేశ్వర్ ‘సలాం హైద్రాబాద్’ నుంచి.

మరిన్ని వార్తలు