మెరుపు మెరిస్తే.. కార్చిచ్చు

2 Jun, 2018 00:33 IST|Sakshi

వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వరదలతోపాటు కార్చిచ్చులు కూడా ప్రబలిపోతాయని మనకు తెలుసు. అయితే పోర్ట్‌ల్యాండ్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒకరు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. మెరుపుల కారణంగా కార్చిచ్చులు రావడం మరింత ఎక్కువ అవుతుందని.. ఇది మధ్యధర ప్రాంతంలోనూ.. దక్షిణార్ధ భూగోళంలోని సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ ఉండే అవకాశం ఉందని వీరు అంటున్నారు. ఎల్‌నినో, లా నినా వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం.. తద్వారా కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోవడం దీనికి ఒక కారణమని అంటున్నారు.

ఉష్ణోగ్రతతోపాటు ఆక్సిజన్, మండేందుకు అవసరమైన పదార్థాలు అందుబాటులో ఉండటం వల్ల మెరుపులతోనూ కార్చిచ్చులు ప్రబలే అవకాశాలు ఎక్కువవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పశ్చిమ దిక్కు నుంచి వీచే గాలులు అంటార్కిటికా సమీపానికి చేరుకోవడం వల్ల దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఆస్ట్రేలియాల్లో వాన చినుకు అన్నది కనిపించకుండా పోతుందని.. దీనివల్ల వేడి ఎక్కువై కార్చిచ్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. చలికాలంలో తేమ తక్కువగా ఉండటం.. వేసవి ఎక్కువ కాలం కొనసాగడం వంటివన్నీ పరిస్థితి మరింత విషమించేందుకు దోహదపడుతున్నాయని అన్నారు.  

మరిన్ని వార్తలు